
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థ టేకోవర్ తమకు లాభదాయకం కాదని, ఈ ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని, తాము డిపాజిట్ చేసిన రూ.10 కోట్లు తిరిగి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన జీఎస్సెల్ గ్రూపుకు చెందిన డాక్టర్ సుభాష్‌చంద్ర ఫౌండేషన్ 24 గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని మంగళవారం హైకోర్టుకు మౌఖికంగా తెలిపింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలను మాత్రం వెల్లడించలేదు.
సుభాష్‌చంద్ర గ్రూపు తరఫున సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం చేసిన ఈ అభ్యర్థనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో అగ్రిగోల్డ్ టేకోవర్ బరిలో సుభాష్‌చంద్ర ఫౌండేషన్ నిలిచినట్లయింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటుకు హైకోర్టు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాల్లో అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి రిజిష్ట్రార్, వాల్యుయర్, రియాల్టర్‌లు సమర్పించిన ధరలు తక్కువగా ఉన్నాయంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అస్తుల అసలు విలువలను తాము కోర్టు ముందుంచుతామని, అందుకు గడువు కావాలని ఆయన కోరడంతో, కోర్టు అందుకు అంగీకరిస్తూ కోర్టు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.