హోదా లేకపోతే పదువులు ఎందుకు?
ప్రత్యేక హోదా సాధన సమితి
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగేశ్వరరావు
గుంటూరు వెస్ట్ : ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ హోదాను ఇవ్వాలని, లేకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. అరండల్‌పేటలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక తరగతి హోదా విషయంలో మోదీని మెప్పించలేని వెంకయ్యనాయుడు కుప్పిగంతులు వేస్తున్నారని విమర్శించారు. మంగళవారం చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమితి జిల్లా అధ్యక్షుడు పీ.వీ.మల్లికార్జునరావు, నాయకులు తాడికొండ నరసింహారావు, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ప్రజానాట్య మండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.