
ఏడాదిలో ఏమి సాధించాం?
8న గుంటూరులో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: పుదుచ్చేరిలో జరిగిన జాతీయ మహాసభలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు సీపీఐ జాతీయ సమితి వచ్చేనెల 8న గుంటూరులో భేటీ కానుంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ నిర్మాణంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. పార్టీని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని గత మార్చిలో జరిగిన జాతీయ మహాసభల్లో నిర్ణయించారు. తదనుగుణంగా ఏయే రాష్ట్రంలో ఎంతెంత ప్రగతిని సాధించిందీ చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారు. పార్టీ పునాదులు కదిలిపోయి జాతీయ హోదాను కోల్పోయిన నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తిగా సంస్కరించాలని నాయకత్వం నడుంకట్టింది.
అయినప్పటికీ ఏమాత్రం పురోగతి కనిపించకపోగా నానాటికీ తీసికట్టు.. అన్నట్టుగానే మిగిలింది. ఈ తరుణంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి మొదలు జాతీయ నాయకత్వమంతా 7వ తేదీకే గుంటూరు చేరుకుంటుంది. సమావేశాల ఎజెండాను ఖరారు చేసేందుకు కేంద్ర కార్యదర్శివర్గం అదే రోజు సాయంత్రం భేటీ అవుతుంది. 8న ఉదయం కేంద్ర కార్యవర్గం సమావేశం అనంతరం ర్యాలీ, గుంటూరు లాడ్జి సెంటర్‌లోని మహిమా గార్డెన్స్‌లో బహిరంగ సభ ఉంటుంది. తర్వాత జాతీయ సమితి భేటీ అయి మర్నాడు సాయంత్రం వరకు కొనసాగుతుందని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు వివరించారు.