తెలంగాణ సీపీఐ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్రంలో వామపక్ష, అభ్యుదయశక్తులు, మేధావులు, ఆయా సంఘాలను కలుపుకొని రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సాధించే క్రమంలో ముందుకు సాగాలని, వామపక్ష ఐక్యత కోసం కృషిచేయాలని సీపీఐ నిర్ణయించింది. రాబోయే రోజుల్లో బూర్జువా పార్టీలతో రాజకీయ పొత్తు, అవగాహన ఉండబోదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తును గుణపాఠంగా తీసుకుని ముందుకు సాగాలని సీపీఐ తీర్మానించింది. వచ్చే మార్చి 7-10 తేదీల మధ్య జరగనున్న తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభల ఏర్పాట్లు, గ్రామశాఖల నుంచి రాష్ర్టస్థాయి వరకు నిర్వహించాల్సిన మహాసభల ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ సీపీఐ విస్తృత కార్యవర్గసమావేశం మంగళవారం మఖ్దూంభవన్‌లో జరిగింది. ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ, అజీజ్‌పాషా, కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, గుండా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు నిర్వహించాల్సిన పాత్రపై ఇటీవల వామపక్ష మేధావులు, ఇతర ప్రముఖులతో నిర్వహించిన భేటీలో వెల్లడైన అభిప్రాయాలను గురించి చాడ వెంకటరెడ్డి వివరించారు.
రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వామపక్షాల మధ్య ఐక్యతను సాధించడం, వివిధ సమస్యలపై పోరాడుతున్న కులసంఘాలు, మేధావులు, కలిసొచ్చే వామపక్ష అభిమానులను వెంట తీసుకెళ్లడంపై పార్టీ విధానాన్ని ఆయన ఈ భేటీలో వివరించినట్లు సమాచారం. ఈ నెలలో గ్రామశాఖ మహాసభలు, వచ్చేనెలలో మండలశాఖ మహాసభలు, జనవరిలో జిల్లా శాఖ మహాసభలను పూర్తిచేసుకుని రాష్ట్రమహాసభలకు సిద్ధం కావాలని సమావేశంలో నిర్ణయించారు.
వామపక్ష ఐక్యత కోసం కృషి చేయాలి
Published Wed, Nov 12 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement