సాక్షి, తిరుపతి: ఐదేళ్లపాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిన పాలకులే కష్టాలను సృష్టిస్తున్నారు. నష్టాలు తెచ్చిపెడుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో సీమాంధ్ర అగ్నిగుండంగా మారింది. ఇటు ప్రజలను.. అటు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. గతనెల 30న వెలువడిన ప్రత్యేక తెలంగాణ ప్రకటనతో 31 నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తం గా ఊరువాడా తేడా లేకుండా 36 కుల సం ఘాలు, వివిధ వృత్తి, వర్తక, వ్యాపార సంఘాలు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయ, అధ్యాపకులు, ప్రైవేటు ఉద్యోగులు, న్యాయవాదులు, 45 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు విధులను బహిష్కరించి రోడ్డెక్కారు. 12 రోజులుగా ఆర్టీసీ చక్రాలు రోడ్డెక్కలేదు.
స్తంభించిన పాలన
ఏపీఎన్‌జీల పిలుపుమేరకు వారం రోజుల క్రితం సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు విధులను బహిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 1,350 ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. 12 రోజులుగా ఏ ఒక్క బస్సూ రోడ్డెక్కలేదు. ఫలితంగా తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీవరసిద్ధి వినాయక ఆలయాల ఆదాయానికి గండిపడింది. కలెక్టరేట్, జేసీ, ఏజేసీ, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో పాలనాపరమైన ఫైళ్లన్నీ పేరుకుపోయాయి. ట్రెజరీలో కార్యకలాపాలు స్తంభించాయి. సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ, డ్వామా, సమాచార శాఖలకు సంబంధించిన పనులన్నీ నిలిచిపోయాయి. పల్లెల్లో అభివృద్ధి, పాలనాపరమైన కార్యలాపాలను నిర్వహించే జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, పీఐయు, సబ్ డివిజన్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల సిబ్బంది వారం రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. ఫలితంగా 29 సేవలు నిలిచిపోయాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి
జిల్లాలో 45 ప్రభుత్వ, వాటి అనుబంధ శాఖలు సమ్మెలో ఉండడంతో పన్నులు, విద్యుత్ బిల్లులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.127 కోట్ల ఆదాయం ఆగిపోయింది. భూరిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో రూ.4.50కోట్లు, రవాణా, వాణిజ్య పన్నుల శాఖల్లో సమ్మె కారణంగా రూ.42 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో సంస్థకు రూ.13.50 కోట్ల రాబడి నిలిచిపోయింది. ఆర్టీసీకి రూ.46 కోట్ల ఆదాయానికి గండిపడింది. మీసేవ కేంద్రాల నుంచి 16 సేవలు నిలిచిపోవటంతో విద్యుత్ శాఖకు సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి. మార్కెట్ కమిటీలకు సంబంధించిన ఆదాయమూ నిలిచిపోయింది. ప్రతినెలా రావాల్సిన రూ.1.50 కోట్లు నిలిచిపోయింది. ఆర్టీఏ, ఎక్సైజ్‌శాఖకు సంబంధించి ఇప్పటివరకు రూ.18 కోట్లమేర ఆదాయానికి గండిపడింది. వ్యాపార సంస్థలు, పరిశ్రమలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కోటిన్నర వరకు నష్టపోయాయి.
చదువులకు కాంగ్రెస్ గ్రహణం
సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు ప్రముఖపాత్ర పోషిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,334 పాఠశాలలు మూతపడ్డాయి. 18వేల మందికిపైగా ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఉద్యమానికి జై కొట్టారు. ముఖ్యమైన ఎంట్రెన్స్ పరీక్షలు, ఎంసెట్ కౌన్సెలింగ్‌కూ సమైక్య సెగ తప్పలేదు. దీనంతటికీ కాంగ్రెస్ పాలకులే కారణమని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ వల్లే కష్టనష్టాలు
Published Sat, Aug 24 2013 2:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement