separate Telangana
-
తెలంగాణ ఉద్యమ నేతకు రూ.10లక్షలు
ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొని పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ వాసి పగడాల పరంధామకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 1969 ఏప్రిల్ 4న సికింద్రాబాద్ జనరల్ బజార్లో జరిగిన కాల్పుల్లో పరంధామ ఛాతిలో, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కొడుకు ఈతకు వెళ్లి మరణించాడు. కూతురును పోషించుకుంటూ పరంధామ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలసి పరంధామ తన పరిస్థితిని వివరించాడు. దీంతో స్పందించిన సీఎం రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. -
మంత్రి.. ఇక మాజీనే!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్రకేబినెట్ నిర్ణయంతో రాజకీయ నాయకుల హవాకు తాత్కాలిక బ్రేకులు పడనున్నాయి. కేంద్రకేబినెట్ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చేంతవరకు జిల్లాలో పాలనాపగ్గాలు చేతులుమారనున్నాయి. జిల్లా నుంచి మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాంరెడ్డి వెంకటరెడ్డి మాజీ కానుండగా, జిల్లా పాలనా వ్యవహారాల్లో కలెక్టర్ పూర్తిస్థాయిలో కీలకపాత్ర పోషించనున్నారు. అసెంబ్లీ సుప్తచేతనావస్థలోనికి వెళ్లనుండడంతో ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలోకి వెళతారు. కానీ వారి పదవులకు ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపే ఉత్తర్వుల్లో శాసనసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తే మాత్రం ఎమ్మెల్యే పదవులు కూడా పోనున్నాయి. మంత్రి గారి పదవి గోవిందా... రాష్ట్ర ఉద్యానవన శాఖా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోగొట్టుకోనున్నారు. రాష్ట్రపతి పాలనకు ఆమోదం లభిస్తే రాష్ట్రంలో మంత్రిమండలి రద్దవుతుంది కనుక ఆ మంత్రి మండలిలో సభ్యుడయిన రాంరెడ్డి కూడా ఆ హోదా కోల్పోతారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తొలిసారి వైఎస్ కేబినెట్లో మంత్రిపదవి చేపట్టారు. వైఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో చేర్చుకుని సహకార, కార్మిక, ఫ్యాక్టరీలు, బ్రాయిలర్లు మంత్రిత్వ శాఖను అప్పగించారు. అప్పటినుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఆ శాఖల మంత్రిగా పనిచేశారు. కిరణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేయడంతో రాంరెడ్డి పోర్టుఫోలియో మారింది. ఈయనకు కిరణ్ హయాంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ,మేఘమథనం మంత్రిత్వ శాఖలను అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పదవిలో ఉన్న ఆయన రాష్ట్రపతి పాలన వస్తే మాజీ కానున్నారు. మంత్రి హోదాలో ఆయనకు ఉండే ప్రొటోకాల్ రద్దవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతారు. పూర్తిగా రద్దు కావు...కానీ మంత్రిమండలి రద్దయినప్పటికీ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం పదవుల్లో ఉంటారు. ఎందుకంటే అసెంబ్లీ సుప్తచేతనావస్తలోనికి వె ళ్తుందే తప్ప పూర్తిగా రద్దు కాదు. ఎన్నికలు జరిగేలోపు మళ్లీ ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తే గవర్నర్ సభను సమావేశపర్చవచ్చు. అందుకోసం ఎమ్మెల్యే పదవులు రద్దు కావని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇక జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీస్పీకర్, ఎంపీలు, ఎమ్మెల్సీల పదవుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఎందుకంటే రాష్ట్రపతి పాలనతో వీరికి సంబంధం లేదు. ఎంపీలు కేంద్రానికి బాధ్యత వహిం చాల్సి ఉండగా, ఎమ్మెల్సీ హోదా కేవలం మండలికి మాత్రమే పరి మితం అవుతుంది. ఇక డిప్యూటీస్పీకర్ రాజ్యాంగబద్దమైన పదవి కనుక సభ రద్దయ్యేంతవరకు ఆ ప దవి కొనసాగుతుందని అధికారవర్గాలంటున్నాయి. ఇక నామినేటెడ్ పోస్టు లు, సర్పంచ్ పదవులకు కూడా ఎ లాంటి ఢోకా ఉండదు. స్థానిక ప్రభుత్వాలు యథావిధిగా పనిచేస్తాయి. అన్నింటికీ ప్రభుత్వ యంత్రాంగమే రాష్ట్రపతి పాలన వస్తే జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోనుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల కనుసన్నల్లో సాగిన పాలనా వ్యవహారాలన్నీ పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోకి వెళ్లిపోతాయి. రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పూర్తిగా జిల్లాలో పాలన సాగిస్తారు. రాజకీయ పలుకుబడులకు బ్రేకులు పడతాయి. పాలన వ్యవహారాల్లో కలెక్టర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఆయనతో పాటు ఇతర అధికారులపై రాజకీయ నాయకుల ప్రమేయం కానీ, పెత్తనం కానీ ఉండదు. ఏ నిర్ణయమైనా కలెక్టర్ తీసుకోవాల్సిందే. ఆయన నేరుగా గవర్నర్‌కే జవాబుదారీగా ఉంటారు. ప్రజల సమస్యల పరిష్కారం కూడా కలెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. అయితే, మాజీమంత్రులు, ఎమ్మెల్యేల హోదాలో ప్రజాప్రతినిధులు కూడా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టర్, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సిఫారసులు పంపవచ్చు. మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరినా, రాష్ట్రపతి పాలనను ఎత్తివేసినా పాత పరిస్థితులు పునరుద్ధరింపబడతాయి. -
సంబురాల ‘తెలంగాణ’
తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది మన గడ్డ మీదే. ప్రత్యేక పోరాటానికి ఊపిరులూదింది జిల్లా నేతలే. వారి అకుంఠిత పట్టుదల, దీక్షాదక్షలతోనే నేడు తెలంగాణ స్వప్నం సాకారమైంది. చారిత్రక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కొండా వెంకట రంగారెడ్డి 1968లో ‘ఆంధ్ర’ పాలకులపై సమర భేరి మోగించారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కుతున్న వైనంపై నినదించిన కేవీ, అల్లుడు మర్రి చెన్నారెడ్డితో కలిసి 1969లో ‘ప్రత్యేక తెలంగాణ’కు పురుడు పోశారు. వికారాబాద్ కేంద్రంగా ఉద్యమానికి ఊపు తెచ్చిన మర్రి.. విద్యార్థులు, యువతను సంఘటితం చేశారు. తెలంగాణ ప్రజా సమితి పేర పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకోగలిగారు. ఆ తర్వాత పార్టీని కాస్తా కాంగ్రెస్‌లో విలీనం చేసి ఉద్యమానికి తెరిపిచ్చారు. కొన్నాళ్లపాటు ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఉద్యమాన్ని మళ్లీ క్రియాశీలం చేసింది ఉద్యోగ సంఘాలే. 1985లో ఆరుసూత్రాల పథకం అమలులో సమైక్య ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై గళమెత్తిన ఉద్యోగ సంఘాలకు జస్టిస్ మాధవరెడ్డి అండగా నిలిచారు. స్వర్గీయ పి.ఇంద్రారెడ్డి, ఎంపీ దేవేందర్‌గౌడ్ కూడా తెలంగాణ పోరాటంలో తమ వంతు పాత్ర పోషించారు. 2009 తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడంలోనూ.. జాతీయస్థాయిలో ఉద్యమ తీవ్రతను తెలియపరచడంలో మనవారి ఆత్మత్యాగం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ యాదయ్య ఆత్మబలిదానం చేసుకోవడం విద్యార్థిలోకాన్ని కదిలించింది. పార్లమెంటు సాక్షిగా ప్రాణాలర్పించిన యాదిరెడ్డి ఘటనతో యావ త్ భారతావని ‘తెలంగాణ’కు అనుకూలంగా గళం వినిపించేందుకు కారణమైంది. అంతేకాకుండా 2001లో ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్ ఉద్యమానికి వ్యూహరచన చేసింది కూడా కందుకూరు మండలంలోని ఆయన ఫాంహౌస్‌లోనే. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి రాష్ట్ర సాధన వరకూ రంగారెడ్డి జిల్లా వేదికగా నిలిచింది. - సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి -
మళ్లీ నిరాశ
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఏపీఎన్జీవో ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. టెట్‌ను ఈ నెల 9వ తేదీన నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణకు ఉద్యోగులు సహకరించని నేపథ్యంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)ను వాయి దా వేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్వహిస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు. దీం తో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఫిబ్రవరిలో రెవెన్యూ, ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ అర్హత పరీక్షలు ఉన్నాయని, అదే విధంగా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అల్లర్లకు అవకాశం ఉండటంతో టెట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని జనవరి 7వ తేదీన సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. వాయిదాల పర్వం మొదట సెప్టెంబర్ 30 తేదీన నిర్వహించనున్నామని విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వాయిదా పడటంతో నవంబర్‌లో నిర్వహిస్తామని రెండోసారి ప్రకటించారు. రెండో ప్రయత్నంలో కూడా వాయిదా పడటంతో నిరుద్యోగులు నిరాశకు లోనయ్యారు. ఎట్టకేలకు మూడోసారి ఫిబ్రవరి 9న పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రకటించి, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడోసారి కూడ వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రకటన వెలువడే నాటికి 7,998 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
‘శీతాకాలం’లోనే టీ-బిల్లు: షిండే
* పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెడతామని వెల్లడి * 18న కీలక సమావేశాలు జరపనున్న జీవోఎం * రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో, సీఎంతో భేటీలు * 20న ముసాయిదా నివేదికకు తుది మెరుగులు * వీలైతే అదే రోజున కేబినెట్‌కు తెలంగాణ బిల్లు! * శరవేగంగా సాగుతున్న విభజన ప్రక్రియ సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌కు ఎప్పుడు వస్తుందనే విషయమై సాగుతున్న ఊహాగానాలకు, నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం స్వయంగా వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీవోఎం) కేబినెట్‌కు నివేదిక సమర్పించడానికి శరవేగంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇందుకోసం ఈ నెల 11 నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్న జీవోఎం తాజాగా గురువారం సాయంత్రం దాదాపు నాలుగు గంటల పాటు కార్యదర్శుల స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది. ఏడు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమై ఆయా శాఖల నివేదికలపై చర్చించింది. ప్రధానంగా ఆర్థిక, హోం, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షల్లో విభజనతో ముడిపడిన అత్యంత కీలకాంశాలు- హైదరాబాద్ ప్రతిపత్తి, 371-డి, ఆస్తులు-అప్పులు, రెవెన్యూ పంపకంపై విస్తృతంగా చర్చించింది. ముసాయిదా బిల్లు అంశాలపై న్యాయశాఖ ఉన్నతాధికారులతో లోతుగా మాట్లాడింది. ఇక్కడితో శాఖలన్నింటితో చర్చల కసరత్తును దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన జీవోఎం ఈ నెల 18న మూడు కీలక భేటీలు జరపనుంది. ఆ రోజు ఉదయం10.30కు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులతో, 11.30కు సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులతో, 12.30కు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ కానుంది. విభజనపై వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను విన్న మీదట ముసాయిదా నివేదిక తయారు చేసి.. 20న తుది మెరుగులు దిద్దుతోంది. 21న కేంద్ర కేబినెట్ సమావేశంలోనే నివేదికను చర్చకు పెట్టవచ్చని, ఇందుకోసమే 20న జీవోఎం చివరి సమావేశాన్ని నిర్వహించనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 26కల్లా అసెంబ్లీకి బిల్లు అనుకున్న రీతిలోనే అన్నీ జరిగితే, కేబినెట్ సమావేశంలో నివేదికను ఆమోదించి బిల్లును ఒకటి రెండు రోజుల్లోపే రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి నుంచి బహుశా 26కల్లా రాష్ర్ట శాసనసభకు బిల్లు చేరుతుందని హస్తినలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ అభిప్రాయంతో బిల్లు వెనక్కి వచ్చిన వెంటనే అంతిమంగా శీతాకాల సమావేశాల్లో బిల్లును కచ్చితంగా ఏ రోజున పెట్టాలనేదానికి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఆదేశాల మేరకు ముహూర్తాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బాలల చిత్రోత్సవం వల్లే కిరణ్ రాలేకపోయారు హోం శాఖ కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌లో ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొనడానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్న షిండే.. కార్యాలయం లోపల కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ బిల్లుపై నెలకొన్న సందిగ్ధతకు, ఉత్కంఠకు ఫుల్స్టాప్ పెట్టారు. జీవోఎం ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, బిల్లును ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్నించగా, తమకప్పగించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడతామని పునరుద్ఘాటించారు. గురువారం జీవోఎంతో చర్చలకు రావాల్సిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు రాలేదని అడగ్గా బాలల చలనచిత్రోత్సవమే కారణమని షిండే చెప్పారు. ‘‘ఆయన్ను మేం 18న కలుస్తాం. సీఎంతో భేటీ తర్వాత మా నివేదిక తయారీపై దృష్టి పెడతాం’’ అని చెప్పారు. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణపై మీ నివేదికను చర్చకు పెడతారా అని ప్రశ్నించగా, ఆ సంగతి తాను చెప్పలేనంటూ శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందని పునరుద్ఘాటించారు. అధికారులకు షిండే ఆదేశాలు జీవోఎంకు అప్పగించిన పని రానున్న కొద్ది రోజుల్లో పూర్తికానున్నందున కేబినెట్‌కు సమర్పించాల్సిన నివేదిక రూపకల్పనకు సన్నాహాలను చకచకా చేయాలని హోంశాఖ ఉన్నతాధికారులను షిండే ఆదేశించినట్టు తెలిసింది. దాంతో జీవోఎంకు వివిధ శాఖల నుంచి అందిన నివేదికలు, అభిప్రాయాలు, సూచనలన్నింటినీ వారు క్రోడీకరిస్తున్నారని సమాచారం. అధికారులు ఒక పద్ధతి ప్రకారం వాటికి సమగ్ర రూపమిస్తున్నారని, వీటి ఆధారంగానే ముసాయిదా నివేదిక తయారవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముసాయిదా నివేదిక తయారయ్యాక జీవోఎం దాన్ని పరిశీలించి చివరగా అవసరమనుకున్న మార్పుచేర్పులు చేస్తుందని, ఆ తుది మెరుగులు పూర్తయ్యాయంటే అది కేబినెట్‌కు వెళ్లిపోతుందని చెప్పాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని రానున్న వారంలోపే జీవోఎం పూర్తి చేస్తుందని ఆ వర్గాలు వివరించాయి. -
గుండె కోత
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదిస్తూ కేంద్ర మంత్రి వర్గం గురువారం రాత్రి తీసుకున్న నిర్ణయం ఇక్కడి ప్రవాసాంధ్రులను బాధాతప్త హృదయులను చేసింది. ఏదో ఒక విధంగా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఆఖరి నిమిషంలో అద్భుతం జరుగుతుందని ఆశించిన వారికి కేంద్ర మంత్రి వర్గ నిర్ణయం శరాఘాతంలా పరిణమించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా విభజన జరిగిపోయిందంటూ ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించాయి. విదేశీ మహిళ అయిన సోనియా గాంధీకి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే కనీస గౌరవం కూడా లేదు. ఇందుకు పరాకాష్టే తెలుగుజాతిని రెండు ముక్కలు చేయడం. రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు ఇది. 65 రోజులుగా సీమాంధ్ర ప్రజలు చేస్తోన్న ఉద్యమాన్ని కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ అధిష్టానం దెబ్బతీసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చి తెలుగుజాతిని వెన్నుపోటు పొడిచారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనను ప్రధాన రాజకీయ పార్టీలు గౌరవించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అంటూ మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న సీమాంధ్ర, తెలంగాణాలను ముక్కలుగా విభజిస్తుండటంతో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసినట్లు అవుతుందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు తెలంగాణా నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తెలపడంపై సాక్షితో స్పందించారు. వారి అభిప్రాయాలు ... ఇక కలహాల కాపురమే కేంద్రం నిర్ణయం దిగ్భ్రాంతికరం. అభివృద్ధి నిరోధకం. ఆంధ్రులకు ఊపిరాడకుండా చేసిన నిర్ణయం. ఇన్నాళ్లూ హైదరాబాద్ మనదే అని గర్వంగా చెప్పుకునే వాళ్లం. ఇక కలహాల కాపురమే. - డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు, అధ్యక్షుడు, కర్ణాటక తెలుగు అకాడమీ, బెంగళూరు చివరి ఆశ కూడా నెరవేరలేదు ఏదో విధంగా ఒకటిగా ఉంటామనే చివరి ఆశా నెరవేరలేదు. హైదరాబాద్ విషయంలో సడలింపో, మినహాయింపో ఉంటుంది అనుకున్నాం. అదీ జరగలేదు. కాంగ్రెస్ ఎందుకిలా ఆంధ్రులపై కక్ష కట్టింది? రెండుసార్లు కేంద్రంలో అధికారం కట్టబెట్టినందుకు ఇది బహుమతా? - వెంకట కృష్ణారెడ్డి, అధ్యక్షుడు, వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్, బెంగళూరు ఇదో పెద్ద అక్రమం ఆంధ్రప్రదేశ్ విభజన పెద్ద అక్రమం. జనం నెత్తిన పిడుగుపాటు. కేంద్రం నిర్ణయం మింగుడు పడడం లేదు. చివరి క్షణం వరకు ఆశాభావంతోనే ఉన్నాం. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. కేంద్ర మంత్రులందరూ ఇప్పటికైనా రాజీనామా చేయాలి - కే. గంగరాజు, పూర్వ ప్రధాన కార్యదర్శి, తెలుగు విజ్ఞాన సమితి, బెంగళూరు పుట్టెడు దు:ఖం మిగిల్చారు నమ్మినందుకు కాంగ్రెస్ నట్టేట ముంచింది. పుట్టెడు దుఃఖం మిగిల్చింది. సోనియా నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ఏనాటికీ అధికారంలోకి రాదని ఎందరో చెప్పారు. ఆ జోస్యాన్ని ఆంధ్రులు తలకిందులు చేశారు. ఆమె మనకు విభజన బహుమతినిచ్చి ‘రుణం’ తీర్చుకున్నారు.. - బత్తుల అరుణాదాస్,ప్రవాసాంధ్రులు రాజకీయ లబ్ధి కోసమే అన్యోన్యంగా అన్నదమ్ముల్లా ఉండే వారిని రాజకీయ లబ్ధి కోసం తెలంగాణా పేరుతో విభజన చేశారు. రాయలసీమలో ఎలాంటి నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు లేవు. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణా ఇవ్వడంతో సీమ ప్రజలు బజారున పడాల్సిన దుస్థితి నెలకొంది. వెంటనే కేంద్రం విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. - ఎంపీ జే.శాంత, బళ్లారి ఇది సరైన చర్య కాదు ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడం సరైన చర్యకాదు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాంత ప్రజలను మరింత వెనక్కి నెట్టినట్లయింది. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే కోట్లాది మంది జనం ఇబ్బందులకు గురవుతారు. నేతలు ఢిల్లీలో కూర్చొని తెలంగాణా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం అన్యాయం. - శశికళ, మాజీ డిప్యూటీ మేయర్,బళ్లారి ఆవేదనను పాలకులు గుర్తించాలి తెలంగాణా ప్రక్రియను ఆపాలని రెండు నెలలుగా సీమాంధ్రలో జనం ఘోషిస్తుంటే, ఆ ప్రక్రియను ఆపాల్సింది పోయి కేంద్రం ఆఘమేఘాల మీద ఆమోదం తెలపడం ఎంత వరకు సమంజసం. - రాంప్రకాష్రెడ్డి, బస్సు ఓనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, బళ్లారి -
చవితికి ‘సమైక్య’ సెగ
సమైక్యాంధ్ర ఉద్యమ సెగ వినాయకచవితి పండుగను తాకింది. జీతాలు రాక ఉద్యోగులు, వ్యాపారాలు జరక్క వ్యాపారులు, పనుల్లేక కార్మికులు, కర్షకులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో పండుగ రావడంతో పెద్దగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. పండుగల కంటే సమైక్యాంధ్రనే తమకు ముఖ్యమన్న రీతిలో అన్ని వర్గాల ప్రజలు ముందుకెళుతున్నారు. సాక్షి, తిరుపతి: తిరుపతికి చెందిన రమణయ్య ప్రభుత్వ ఉద్యోగి. నెలకు రూ.12వేలు జీతం వస్తుంది. అం దులో ఇంటిఅద్దె రూ.4వేలుపోను నిత్యావసర సరుకులకు నెలకు రూ.5వేలు ఖర్చు చేస్తారు. ఈ నెల జీతం రాలేదు. చేసేదిలేక నిత్యావసర వస్తువుల కొనుగోలులో పొదుపు పాటిస్తున్నాడు. రూ.2వేలకు మాత్రమే సరుకులు కొనుగోలు చేశా రు. ప్రతి వినాయకచవితికి కొత్తబట్టలు కొన డం, పిండి వంటలు చేసుకునే రమణయ్య ఈసారి బట్టలు కొనుగోలు చేయలేదు. జేబులో రూ.500 పెట్టుకుని ఆదివారం మార్కెట్‌కు వచ్చా డు. పూలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు గోజారి..గోజారి కొనుగోలు చేయ టం కనిపించింది. ఆయన్ను సాక్షి పలకరిస్తే ‘ఏం చేయాలి? కాంగ్రెస్ చేసిన అనాలోచిత నిర్ణయం ఇటు మాలాంటి ఉద్యోగులు, అటు వ్యాపారుల బతుకులపై పడింది. అందుకే సరుకులు పెద్దగా కొనుగోలు చేయలేకపోతున్నాను. ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. అం దుకే వినాయకచవితిని ‘మమ’ అనిపించాలని నిర్ణయించుకున్నాం. గత ఏడాది ఘనంగా జరునుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ తెచ్చిన తంట.. సీడబ్ల్యూసీ చేసిన ప్రత్యేక తెలంగాణ ప్రకటన సీమాంధ్రుల బతుకులపై నీళ్లు చల్లింది. విభజన ప్రకటనతో ఊరూవాడా, చిన్నాపెద్ద, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కూలీలు, రైతులు తమ పనులన్నీ పక్కనపెట్టి ఉద్యమబాట పట్టారు. 40 రోజులుగా చేస్తున్న ఉద్యమంతో జిల్లాలో 40వేల మంది ఉద్యోగులకు సెప్టెంబర్‌లో రావాల్సిన జీతాలు రాలేదు. మరో 10వేల మంది ఆర్టీసీ కార్మికులకు కూడా వేతనాలు అందలేదు. సమ్మె వల్ల దుకాణాలు తెరుచుకోలేదు. కొనుగోలుదారులూ ముందు కు రాలేదు. వ్యాపార లావాదేవిలన్నీ స్తంభించిపోయాయి. ఉద్యమం నేపథ్యంలో వినాయక చవితి రానే వచ్చింది. ఈ పండుగను ప్రతి ఏడా దీ ఘనంగా జరుపుకుంటారు. అటువంటిది ఈసారి సాదాసీదాగా జరుపుకుంటున్నారు. కారణం జీతాలు రాకపోవడం, పనులు దొరక్కపోవటంతో కూలి నిలిచిపోయింది. ఎగుమతులు లేక కూరగాయలు, నిత్యావసర వస్తువు ల ధరలు ఆకాశాన్నంటాయి.మార్కెట్‌కు వచ్చే జనం సంచి నిండా డబ్బుతో వచ్చి చేతినిండా సరుకులతో తిరిగి వెళుతున్నారు. తగ్గిన వ్యాపారం వినాయకచవితి నాడు తిరుపతిలోని ప్రతి బట్టల దుకాణం కొనుగోలుదారులతో రద్దీగా ఉండేది. ఈసారి బాగా తగ్గింది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ప్రజలకు, వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు, మూడు వేలకు దుస్తులు కొనేవారు. ఇప్పుడు 5, 6 వందలతోనే సరిపెట్టుకుంటున్నారు. గత ఏడాది కంటే 50 శాతం వ్యాపారం పడిపోయింది. -పసుపర్తి గోపినాథ్, వస్త్ర వ్యాపారి తగ్గిన పండ్ల కొనుగోళ్లు వినాయక చవితి పండుగకు పండ్ల కొనుగోళ్లు బాగా తగ్గాయి. చవితి వేడుకల్లో గణపతి దేవునికి సమర్పించక తప్పదన్న విధంగా అంతంత మాత్రంగా పండ్లు కొంటున్నారు. చవితి నాడు కేజీల లెక్కన కొనే వారు రెండు మూడు పండ్ల లెక్కన కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. తెల్లారి నుంచి వ్యాపారం చేస్తున్నా గిట్టుబాటు కావడం లేదు. ఉద్యమం వ్యాపారంపై పూర్తి ప్రభావం చూపుతోంది. -మునెమ్మ, పండ్ల వ్యాపారి తక్కువ కొంటున్నారు వినాయకచవితికి ప్రతి ఒక్కరూ పండుగ సరుకులు రూ.500లకు కొనుగోలు చేసేవారు. దుకాణం వద్ద రద్దీగా ఉండేది. ఈ ఏడాది ప్రజలు సరుకులు తక్కువగా కొంటున్నారు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నెల రోజులకుపైగా ఆందోళనలు జరుగుతున్నాయి. జీతాలు లేక సర్దుకోవడం కనిపిస్తోంది. 5, 6 వందలకు కొనేవారు వంద, రెండు వందలకే కొంటున్నారు. -నిరంజన్, సరుకుల దుకాణదారుడు తగ్గిన పూల వ్యాపారం వినాయక చవితి అంటే పూల వ్యాపారం ఊపందుకుంటుంది. ఈ ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వ్యాపారం బాగా తగ్గిపోయింది. పూల దిగుమతులు కూడా అంతంత మాత్రమే. ధరలు కూడా పెరిగాయి. దీంతో 50 వేలు జరిగే వ్యాపారం 10 వేల రూపాయలకు పడిపోయింది. -భార్గవ్, పూల వ్యాపారి కూరగాయల వ్యాపారం పర్వాలేదు వినాయక చవితి పండుగ రోజు ప్రతిఒక్కరూ కూరగాయలు బాగా కొనుగోలు చేసేవారు. సమైక్యాంధ్ర నిరసనల కారణంగా రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో కూరగాయల ధరలు కూడా బాగా పెరిగాయి. గత ఏడాదితో పోల్చితే వ్యాపారం బాగా తగ్గినా కొంత పర్వాలేదు అనిపిస్తోంది. -బాషా, కూరగాయల వ్యాపారి -
కాంగ్రెస్ వల్లే కష్టనష్టాలు
సాక్షి, తిరుపతి: ఐదేళ్లపాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిన పాలకులే కష్టాలను సృష్టిస్తున్నారు. నష్టాలు తెచ్చిపెడుతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో సీమాంధ్ర అగ్నిగుండంగా మారింది. ఇటు ప్రజలను.. అటు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. గతనెల 30న వెలువడిన ప్రత్యేక తెలంగాణ ప్రకటనతో 31 నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తం గా ఊరువాడా తేడా లేకుండా 36 కుల సం ఘాలు, వివిధ వృత్తి, వర్తక, వ్యాపార సంఘాలు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయ, అధ్యాపకులు, ప్రైవేటు ఉద్యోగులు, న్యాయవాదులు, 45 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు విధులను బహిష్కరించి రోడ్డెక్కారు. 12 రోజులుగా ఆర్టీసీ చక్రాలు రోడ్డెక్కలేదు. స్తంభించిన పాలన ఏపీఎన్జీల పిలుపుమేరకు వారం రోజుల క్రితం సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు విధులను బహిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 1,350 ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. 12 రోజులుగా ఏ ఒక్క బస్సూ రోడ్డెక్కలేదు. ఫలితంగా తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీవరసిద్ధి వినాయక ఆలయాల ఆదాయానికి గండిపడింది. కలెక్టరేట్, జేసీ, ఏజేసీ, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో పాలనాపరమైన ఫైళ్లన్నీ పేరుకుపోయాయి. ట్రెజరీలో కార్యకలాపాలు స్తంభించాయి. సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, డ్వామా, సమాచార శాఖలకు సంబంధించిన పనులన్నీ నిలిచిపోయాయి. పల్లెల్లో అభివృద్ధి, పాలనాపరమైన కార్యలాపాలను నిర్వహించే జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, పీఐయు, సబ్ డివిజన్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల సిబ్బంది వారం రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. ఫలితంగా 29 సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి జిల్లాలో 45 ప్రభుత్వ, వాటి అనుబంధ శాఖలు సమ్మెలో ఉండడంతో పన్నులు, విద్యుత్ బిల్లులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ.127 కోట్ల ఆదాయం ఆగిపోయింది. భూరిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో రూ.4.50కోట్లు, రవాణా, వాణిజ్య పన్నుల శాఖల్లో సమ్మె కారణంగా రూ.42 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో సంస్థకు రూ.13.50 కోట్ల రాబడి నిలిచిపోయింది. ఆర్టీసీకి రూ.46 కోట్ల ఆదాయానికి గండిపడింది. మీసేవ కేంద్రాల నుంచి 16 సేవలు నిలిచిపోవటంతో విద్యుత్ శాఖకు సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి. మార్కెట్ కమిటీలకు సంబంధించిన ఆదాయమూ నిలిచిపోయింది. ప్రతినెలా రావాల్సిన రూ.1.50 కోట్లు నిలిచిపోయింది. ఆర్టీఏ, ఎక్సైజ్‌శాఖకు సంబంధించి ఇప్పటివరకు రూ.18 కోట్లమేర ఆదాయానికి గండిపడింది. వ్యాపార సంస్థలు, పరిశ్రమలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కోటిన్నర వరకు నష్టపోయాయి. చదువులకు కాంగ్రెస్ గ్రహణం సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులు ప్రముఖపాత్ర పోషిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,334 పాఠశాలలు మూతపడ్డాయి. 18వేల మందికిపైగా ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఉద్యమానికి జై కొట్టారు. ముఖ్యమైన ఎంట్రెన్స్ పరీక్షలు, ఎంసెట్ కౌన్సెలింగ్‌కూ సమైక్య సెగ తప్పలేదు. దీనంతటికీ కాంగ్రెస్ పాలకులే కారణమని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. -
అన్నదాత ఉద్యమ బాట
సాక్షి, తిరుపతి : జిల్లాలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమంలో అన్నదాతలు ముందు నిలిచారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. పంట పండించేందుకు స్వేదం చిందించడమే కాదు ఉద్యమించడం కూడా తమ కర్తవ్యమంటూ ముందు కొచ్చారు. బీడు వారిన భూముల్ని సస్యశ్యామలం చేసే తాము రాష్ర్టం సమైక్యంగా నిలిపేందుకు పోరాడతామంటూ ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా 12వ రోజున పలుచోట్ల సమైక్యవాదులు ఉద్యమాలను కొనసాగించారు. ఆదివారం నాటి ఉద్యమం లో జిల్లాలోని పలు గ్రామాల్లో వివిధ వర్గాల ప్రజలు సమైక్య ఆందోళనలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభ జనకు కారకులైన నాయకుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. రోడ్లపైనే వంటావార్పు చేసి భోజనాలు చేశారు. గ్రామాల్లో బాలల నుంచి వృద్ధుల వరకూ సమైక్య పోరాటంలో పాల్గొనడం ఉద్యమ తీవ్రతను తెలియజేస్తోంది. సమైక్య ఉద్యమంతో పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులే సమైక్య ఆందోళనలో పాల్గొనమంటూ తమ పిల్లల్ని పంపుతుండడం గమనార్హం. కుప్పంలో వైఎస్సార్ సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్, చంద్రబాబు దిష్టిబొమ్మలను తగులబెట్టారు. కుప్పం, పలమనేరులో క్రైస్తవ సంఘాలు ర్యాలీ, ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. మదనపల్లెలో చెవిటి, మూగ సంఘం సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు సోనియా, దిగ్విజయ్ సింగ్‌లకు అట్టలతో సమాధులు కట్టి నిరసన తెలిపారు. చంద్రగిరిలో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగులు, పలు పార్టీల రాజకీయ నాయకులు రిలే నిరాహారదీక్షలను కొనసాగించారు. పీలేరులో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. జేఏసీ నేతల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చిత్తూరులో పలు సంఘాల అధ్వర్యంలో రిలే దీక్షలు చేశారు. తిరుపతిలో శ్యాప్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ముందు రిలేదీక్షలు 12వ రోజుకు చేరాయి. పానీపూరీ బండ్ల వ్యాపారులు సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డెక్కారు. బండ్లను రోడ్డుకు అడ్డంగాపెట్టి నిరసన తెలియజేశారు. టీటీడీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో మానవహారంగా ఏర్పడి గంటపాటు రోడ్లపై రాకపోకలను స్తంభింపచేశారు. ఫ్రూట్మర్చంట్స్ ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్లు రిలే దీక్షలను కొనసాగించారు. వీరికి మబ్బుచెంగారెడ్డి మద్దతు తెలిపారు. పుత్తూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేశారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. క్రైస్తవ సంఘాలు మానవహారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు రిలేదీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. -
మాటల్లో సమైక్యం.. చేతల్లో వేర్పాటువాదం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరించడంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులది అందెవేసిన చేయి. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన నేపథ్యంలో సమైక్యాంధ్రనే కోరుకుంటున్నట్లు వారు ప్రకటిస్తున్నారు. ఆ మేరకు అధిష్టానం రచించిన స్క్రీన్ ప్లే మేరకు రాజీనామా డ్రామాలు ఆడారు. ఇప్పుడు అధిష్టానం మార్గదర్శకాల మేరకు ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ఢిల్లీ బాట పట్టనున్నారు. రాష్ట్ర రెవెన్యూమంత్రి ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణకు ఆమోదముద్ర వేసి.. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం సద్దుమణిగిన వెంటనే మరో విభజనకు తెరతీయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదిలోనే నిర్ణయించింది. ఈ విషయాన్ని తమతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందే చెప్పినట్లు సమాచారం. యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేయడంతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం రగిలింది. ఈ ఉద్యమానికి ‘అనంత’ పురిటిగడ్డయింది. ఉద్యమానికి చుక్కానిలా ఉంటున్న ‘అనంత’లో నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయడానికి రహస్య ప్రణాళిక రచించారు. ఆ క్రమంలోనే జిల్లాను ఖాకీవనంగా మార్చారు. సర్కారు పెద్దల ఒత్తిడి మేరకు ఎస్పీ వీరంగం సృష్టిస్తూ ఉద్యమకారులను బెదరగొడుతున్నారు. సమైక్య ఉద్యమ సెగ తమనూ తాకడంతో చేసేదిలేక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పైకి మాత్రం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసమే రాజీనామా చేశామంటూ డ్రామాలాడుతున్నారు. ఇదే రీతిలో టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారు. అయితే.. రాజీనామా లేఖలు స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికీ చేరలేదు. కాగా.. ఉద్యమం సద్దుమణగక ముందే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలంటూ రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీ వెళ్లనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్‌షిండే, పి.చిదంబరంను కలిసి.. ‘రాయల తెలంగాణ’ ను కోరనున్నట్లు సమాచారం. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లోనే సాగనుండటం గమనార్హం. జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఢిల్లీ పర్యటన పూర్తయ్యాక.. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే నేతృత్వంలో కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ఢిల్లీ బాట పట్టనున్నట్లు సమాచారం. ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి తమ డిమాండ్ విన్పించనున్నట్లు తెలిసింది.