సాక్షి ప్రతినిధి, అనంతపురం: మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరించడంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులది అందెవేసిన చేయి. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన నేపథ్యంలో సమైక్యాంధ్రనే కోరుకుంటున్నట్లు వారు ప్రకటిస్తున్నారు. ఆ మేరకు అధిష్టానం రచించిన స్క్రీన్ ప్లే మేరకు రాజీనామా డ్రామాలు ఆడారు. ఇప్పుడు అధిష్టానం మార్గదర్శకాల మేరకు ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ఢిల్లీ బాట పట్టనున్నారు. రాష్ట్ర రెవెన్యూమంత్రి ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణకు ఆమోదముద్ర వేసి.. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం సద్దుమణిగిన వెంటనే మరో విభజనకు తెరతీయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదిలోనే నిర్ణయించింది. ఈ విషయాన్ని తమతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందే చెప్పినట్లు సమాచారం. యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేయడంతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం రగిలింది. ఈ ఉద్యమానికి ‘అనంత’ పురిటిగడ్డయింది. ఉద్యమానికి చుక్కానిలా ఉంటున్న ‘అనంత’లో నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయడానికి రహస్య ప్రణాళిక రచించారు. ఆ క్రమంలోనే జిల్లాను ఖాకీవనంగా మార్చారు. సర్కారు పెద్దల ఒత్తిడి మేరకు ఎస్పీ వీరంగం సృష్టిస్తూ ఉద్యమకారులను బెదరగొడుతున్నారు. సమైక్య ఉద్యమ సెగ తమనూ తాకడంతో చేసేదిలేక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పైకి మాత్రం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసమే రాజీనామా చేశామంటూ డ్రామాలాడుతున్నారు. ఇదే రీతిలో టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారు. అయితే.. రాజీనామా లేఖలు స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికీ చేరలేదు. కాగా.. ఉద్యమం సద్దుమణగక ముందే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలంటూ రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీ వెళ్లనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్‌షిండే, పి.చిదంబరంను కలిసి.. ‘రాయల తెలంగాణ’ ను కోరనున్నట్లు సమాచారం. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లోనే సాగనుండటం గమనార్హం. జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఢిల్లీ పర్యటన పూర్తయ్యాక.. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే నేతృత్వంలో కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ‘రాయల తెలంగాణ’ డిమాండ్‌తో ఢిల్లీ బాట పట్టనున్నట్లు సమాచారం. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసి తమ డిమాండ్ విన్పించనున్నట్లు తెలిసింది.
మాటల్లో సమైక్యం.. చేతల్లో వేర్పాటువాదం
Published Mon, Aug 5 2013 5:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement