‘శీతాకాలం’లోనే టీ-బిల్లు: షిండే
* పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెడతామని వెల్లడి
* 18న కీలక సమావేశాలు జరపనున్న జీవోఎం
* రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో, సీఎంతో భేటీలు
* 20న ముసాయిదా నివేదికకు తుది మెరుగులు
* వీలైతే అదే రోజున కేబినెట్‌కు తెలంగాణ బిల్లు!
* శరవేగంగా సాగుతున్న విభజన ప్రక్రియ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌కు ఎప్పుడు వస్తుందనే విషయమై సాగుతున్న ఊహాగానాలకు, నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. బిల్లును రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే గురువారం స్వయంగా వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీవోఎం) కేబినెట్‌కు నివేదిక సమర్పించడానికి శరవేగంగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇందుకోసం ఈ నెల 11 నుంచి వరుస భేటీలు నిర్వహిస్తున్న జీవోఎం తాజాగా గురువారం సాయంత్రం దాదాపు నాలుగు గంటల పాటు కార్యదర్శుల స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది.
ఏడు శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమై ఆయా శాఖల నివేదికలపై చర్చించింది. ప్రధానంగా ఆర్థిక, హోం, న్యాయ శాఖల ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షల్లో విభజనతో ముడిపడిన అత్యంత కీలకాంశాలు- హైదరాబాద్ ప్రతిపత్తి, 371-డి, ఆస్తులు-అప్పులు, రెవెన్యూ పంపకంపై విస్తృతంగా చర్చించింది. ముసాయిదా బిల్లు అంశాలపై న్యాయశాఖ ఉన్నతాధికారులతో లోతుగా మాట్లాడింది. ఇక్కడితో శాఖలన్నింటితో చర్చల కసరత్తును దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన జీవోఎం ఈ నెల 18న మూడు కీలక భేటీలు జరపనుంది.
ఆ రోజు ఉదయం10.30కు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులతో, 11.30కు సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులతో, 12.30కు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ కానుంది. విభజనపై వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను విన్న మీదట ముసాయిదా నివేదిక తయారు చేసి.. 20న తుది మెరుగులు దిద్దుతోంది. 21న కేంద్ర కేబినెట్ సమావేశంలోనే నివేదికను చర్చకు పెట్టవచ్చని, ఇందుకోసమే 20న జీవోఎం చివరి సమావేశాన్ని నిర్వహించనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
26కల్లా అసెంబ్లీకి బిల్లు
అనుకున్న రీతిలోనే అన్నీ జరిగితే, కేబినెట్ సమావేశంలో నివేదికను ఆమోదించి బిల్లును ఒకటి రెండు రోజుల్లోపే రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి నుంచి బహుశా 26కల్లా రాష్ర్ట శాసనసభకు బిల్లు చేరుతుందని హస్తినలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ అభిప్రాయంతో బిల్లు వెనక్కి వచ్చిన వెంటనే అంతిమంగా శీతాకాల సమావేశాల్లో బిల్లును కచ్చితంగా ఏ రోజున పెట్టాలనేదానికి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఆదేశాల మేరకు ముహూర్తాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
బాలల చిత్రోత్సవం వల్లే కిరణ్ రాలేకపోయారు
హోం శాఖ కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌లో ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొనడానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్న షిండే.. కార్యాలయం లోపల కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ బిల్లుపై నెలకొన్న సందిగ్ధతకు, ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పెట్టారు. జీవోఎం ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, బిల్లును ఎప్పుడు తీసుకొస్తారనే ప్రశ్నించగా, తమకప్పగించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని, శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు పెడతామని పునరుద్ఘాటించారు.
గురువారం జీవోఎంతో చర్చలకు రావాల్సిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు రాలేదని అడగ్గా బాలల చలనచిత్రోత్సవమే కారణమని షిండే చెప్పారు. ‘‘ఆయన్ను మేం 18న కలుస్తాం. సీఎంతో భేటీ తర్వాత మా నివేదిక తయారీపై దృష్టి పెడతాం’’ అని చెప్పారు. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణపై మీ నివేదికను చర్చకు పెడతారా అని ప్రశ్నించగా, ఆ సంగతి తాను చెప్పలేనంటూ శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందని పునరుద్ఘాటించారు.
అధికారులకు షిండే ఆదేశాలు
జీవోఎంకు అప్పగించిన పని రానున్న కొద్ది రోజుల్లో పూర్తికానున్నందున కేబినెట్‌కు సమర్పించాల్సిన నివేదిక రూపకల్పనకు సన్నాహాలను చకచకా చేయాలని హోంశాఖ ఉన్నతాధికారులను షిండే ఆదేశించినట్టు తెలిసింది. దాంతో జీవోఎంకు వివిధ శాఖల నుంచి అందిన నివేదికలు, అభిప్రాయాలు, సూచనలన్నింటినీ వారు క్రోడీకరిస్తున్నారని సమాచారం. అధికారులు ఒక పద్ధతి ప్రకారం వాటికి సమగ్ర రూపమిస్తున్నారని, వీటి ఆధారంగానే ముసాయిదా నివేదిక తయారవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ముసాయిదా నివేదిక తయారయ్యాక జీవోఎం దాన్ని పరిశీలించి చివరగా అవసరమనుకున్న మార్పుచేర్పులు చేస్తుందని, ఆ తుది మెరుగులు పూర్తయ్యాయంటే అది కేబినెట్‌కు వెళ్లిపోతుందని చెప్పాయి. ఈ ప్రక్రియ మొత్తాన్ని రానున్న వారంలోపే జీవోఎం పూర్తి చేస్తుందని ఆ వర్గాలు వివరించాయి.