* అఖిలపక్ష సమావేశంలో సుష్మా స్వరాజ్ డిమాండ్
* ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలి
* ప్రక్రియ నడుస్తోందని నచ్చజెప్పిన హోంమంత్రి షిండే
* ఈ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం లేదని విలేకరులకు వెల్లడించిన సుష్మా స్వరాజ్
* ప్రత్యేక భేటీలపై ఆలోచించలేదన్న కమల్‌నాథ్
* బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తామంటూ వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే పెట్టాలని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే, బిల్లుకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోందని, అది పూర్తయితే బిల్లును తీసుకొస్తామని లోక్‌సభలో సభానాయకుడు, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సుష్మా, సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని కోరారు.
శీతాకాల పార్లమెంట్ ఎజెండాపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ సోమవారం రాత్రి పార్లమెంట్ ఆవరణలోని లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెలిసిన సమాచారం ప్రకారం... అన్నిపక్షాల నాయకులు హాజరైన ఈ భేటీలో శీతాకాల పార్లమెంట్ ఎజెండాను ప్రభుత్వం తరఫున సర్క్యులేట్ చేశారు. ఇచ్చిన ఎజెండాలో అనేక ఇతర బిల్లులున్నాయే తప్పించి తెలంగాణ బిల్లు లేకపోవడం చూసిన సుష్మా వెంటనే గళం విప్పారు. చాలా కీలకమైన విభజన బిల్లును ఎందుకు ఎజెండాలో చేర్చలేదని ప్రశ్నించడమే కాకుండా బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టితీరాలని డిమాండ్ చేశారు.
దీనికి షిండే స్పందిస్తూ, ముసాయిదా బిల్లు ఇంకా కేంద్ర కేబినెట్ ముందుకు రాలేదని, అది రాగానే కేబినెట్ పరిశీలించి రాష్ట్రపతికి పంపుతుందని, అక్కడి నుంచి అసెంబ్లీకి బిల్లు వెళ్తుందని, ప్రస్తుతం బిల్లుకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోందని పరిస్థితిని ఏకరువుపెట్టారు. దీంతో సుష్మా, సాధ్యమైనంత త్వరగా బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని మళ్లీ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కమల్‌నాథ్ చెప్పడంతో ఇతర అంశాలపై చర్చ సాగింది. సమావేశానంతరం వామపక్షాల నాయకులు విలేకరులతో మాట్లాడుతూ, ఎజెండాలో బిల్లు లేదని, ప్రభుత్వం పెట్టడం లేదని అన్నారు.
బిల్లు పెట్టే అవకాశం లేదు: సుష్మా
భేటీ అనంతరం సుష్మా స్వరాజ్ విలేకరులతో మాట్లాడుతూ, శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. బిల్లును తప్పనిసరిగా పెట్టాలని తాము డిమాండ్ చేశామని, ఆ బిల్లుకు ఆమోదం కావాలని అన్నారు. షిండే స్పందిస్తూ, బిల్లు కేబినెట్‌కు వెళ్తుందని, అక్కడి నుంచి సంతకం కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్తుందని, తర్వాత అసెంబ్లీకి పంపుతారని తనకు చెప్పారన్నారు. అసలు బిల్లును ఈ సమావేశాల్లో తెచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ సమావేశాల్లోనే బిల్లు తప్పకుండా రావాలన్నది తమ డిమాండన్నారు.
ప్రత్యేక సమావేశాలపై ఆలోచించలేదు: కమల్‌నాథ్
రాష్ట్ర విభజన బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అంశంపై ఏ ఆలోచనా చేయలేదని కమల్‌నాథ్ తెలిపారు. అఖిలపక్ష భేటీ తర్వాత ఆయన విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ బిల్లును ఈ సమావేశాల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు.
సమావేశాలకు సంబంధించిన ఇతర ప్రశ్నలకు జవాబిస్తూ, ‘‘ఇవి స్వల్పకాలిక సమావేశాలు. ఢిల్లీ ఎన్నికల్లో అందరూ ప్రచారం చేయాల్సి ఉన్నందున ఎన్నికలయ్యాక నిర్వహించాలని నిర్ణయించిన మేరకు ఇవి స్వల్పకాలమే జరగనున్నాయి. ఇంతకుముందు ఒక సభలో ఆమోదం పొంది, మరో సభలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదానికి మేం ప్రయత్నిస్తాం. ఇలాంటి బిల్లులకు మేం ప్రాధాన్యమిస్తాం. పలు అంశాలపై చర్చకు తమకు సమయం కేటాయించాలని పార్టీలు కోరాయి. తొలి బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో చర్చించి ఎవరికి ఎంత సమయం కేటాయించాలనేది నిర్ణయిస్తాం’’ అని వివరించారు.
అంతేకాక, ‘‘ఈ సమావేశాల వ్యవధి స్వల్పం. అవసరమైతే అర్ధరాత్రివరకూ కూర్చుని అయినా బిల్లులను ఆమోదిస్తాం. వివాదాస్పద బిల్లులపై పలు పార్టీలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఆ పక్షాలతో మేం మాట్లాడుతున్నాం. ఏదో ఒకసాకు చూపి సమావేశాలకు అంతరాయం కల్పించడం సరికాదు’’ అని ఆయనన్నారు.
తెలంగాణ బిల్లు ఇప్పుడే పెట్టండి
Published Tue, Dec 3 2013 3:30 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement