తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది మన గడ్డ మీదే. ప్రత్యేక పోరాటానికి ఊపిరులూదింది జిల్లా నేతలే. వారి అకుంఠిత పట్టుదల, దీక్షాదక్షలతోనే నేడు తెలంగాణ స్వప్నం సాకారమైంది. చారిత్రక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కొండా వెంకట రంగారెడ్డి 1968లో ‘ఆంధ్ర’ పాలకులపై సమర భేరి మోగించారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కుతున్న వైనంపై నినదించిన కేవీ, అల్లుడు మర్రి చెన్నారెడ్డితో కలిసి 1969లో ‘ప్రత్యేక తెలంగాణ’కు పురుడు పోశారు. వికారాబాద్ కేంద్రంగా ఉద్యమానికి ఊపు తెచ్చిన మర్రి.. విద్యార్థులు, యువతను సంఘటితం చేశారు. తెలంగాణ ప్రజా సమితి పేర పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకోగలిగారు. ఆ తర్వాత పార్టీని కాస్తా కాంగ్రెస్‌లో విలీనం చేసి ఉద్యమానికి తెరిపిచ్చారు.
కొన్నాళ్లపాటు ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఉద్యమాన్ని మళ్లీ క్రియాశీలం చేసింది ఉద్యోగ సంఘాలే. 1985లో ఆరుసూత్రాల పథకం అమలులో సమైక్య ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై గళమెత్తిన ఉద్యోగ సంఘాలకు జస్టిస్ మాధవరెడ్డి అండగా నిలిచారు. స్వర్గీయ పి.ఇంద్రారెడ్డి, ఎంపీ దేవేందర్‌గౌడ్ కూడా తెలంగాణ పోరాటంలో తమ వంతు పాత్ర పోషించారు. 2009 తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడంలోనూ.. జాతీయస్థాయిలో ఉద్యమ తీవ్రతను తెలియపరచడంలో మనవారి ఆత్మత్యాగం ఉంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ యాదయ్య ఆత్మబలిదానం చేసుకోవడం విద్యార్థిలోకాన్ని కదిలించింది. పార్లమెంటు సాక్షిగా ప్రాణాలర్పించిన యాదిరెడ్డి ఘటనతో యావ త్ భారతావని ‘తెలంగాణ’కు అనుకూలంగా గళం వినిపించేందుకు కారణమైంది. అంతేకాకుండా 2001లో ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీఆర్‌ఎస్ స్థాపించిన కేసీఆర్ ఉద్యమానికి వ్యూహరచన చేసింది కూడా కందుకూరు మండలంలోని ఆయన ఫాంహౌస్‌లోనే. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి రాష్ట్ర సాధన వరకూ రంగారెడ్డి జిల్లా వేదికగా నిలిచింది. - సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి
సంబురాల ‘తెలంగాణ’
Published Fri, Feb 21 2014 11:16 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement