సాక్షి, తిరుపతి : జిల్లాలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమంలో అన్నదాతలు ముందు నిలిచారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. పంట పండించేందుకు స్వేదం చిందించడమే కాదు ఉద్యమించడం కూడా తమ కర్తవ్యమంటూ ముందు కొచ్చారు. బీడు వారిన భూముల్ని సస్యశ్యామలం చేసే తాము రాష్ర్టం సమైక్యంగా నిలిపేందుకు పోరాడతామంటూ ప్రతిజ్ఞ చేశారు.
జిల్లాలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా 12వ రోజున పలుచోట్ల సమైక్యవాదులు ఉద్యమాలను కొనసాగించారు. ఆదివారం నాటి ఉద్యమం లో జిల్లాలోని పలు గ్రామాల్లో వివిధ వర్గాల ప్రజలు సమైక్య ఆందోళనలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభ జనకు కారకులైన నాయకుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. రోడ్లపైనే వంటావార్పు చేసి భోజనాలు చేశారు. గ్రామాల్లో బాలల నుంచి వృద్ధుల వరకూ సమైక్య పోరాటంలో పాల్గొనడం ఉద్యమ తీవ్రతను తెలియజేస్తోంది. సమైక్య ఉద్యమంతో పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులే సమైక్య ఆందోళనలో పాల్గొనమంటూ తమ పిల్లల్ని పంపుతుండడం గమనార్హం.
కుప్పంలో వైఎస్సార్ సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్, చంద్రబాబు దిష్టిబొమ్మలను తగులబెట్టారు. కుప్పం, పలమనేరులో క్రైస్తవ సంఘాలు ర్యాలీ, ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. మదనపల్లెలో చెవిటి, మూగ సంఘం సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు సోనియా, దిగ్విజయ్ సింగ్‌లకు అట్టలతో సమాధులు కట్టి నిరసన తెలిపారు. చంద్రగిరిలో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగులు, పలు పార్టీల రాజకీయ నాయకులు రిలే నిరాహారదీక్షలను కొనసాగించారు. పీలేరులో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. జేఏసీ నేతల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చిత్తూరులో పలు సంఘాల అధ్వర్యంలో రిలే దీక్షలు చేశారు.
తిరుపతిలో శ్యాప్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ముందు రిలేదీక్షలు 12వ రోజుకు చేరాయి. పానీపూరీ బండ్ల వ్యాపారులు సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డెక్కారు. బండ్లను రోడ్డుకు అడ్డంగాపెట్టి నిరసన తెలియజేశారు. టీటీడీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో మానవహారంగా ఏర్పడి గంటపాటు రోడ్లపై రాకపోకలను స్తంభింపచేశారు. ఫ్రూట్‌మర్చంట్స్ ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్లు రిలే దీక్షలను కొనసాగించారు. వీరికి మబ్బుచెంగారెడ్డి మద్దతు తెలిపారు. పుత్తూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేశారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. క్రైస్తవ సంఘాలు మానవహారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు రిలేదీక్షలు కొనసాగాయి. శ్రీకాళహస్తిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
అన్నదాత ఉద్యమ బాట
Published Mon, Aug 12 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement