గుండె కోత | Congress how touchy | Sakshi
Sakshi News home page

గుండె కోత

Published Fri, Oct 4 2013 3:02 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Congress how touchy

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదిస్తూ కేంద్ర మంత్రి వర్గం గురువారం రాత్రి తీసుకున్న నిర్ణయం ఇక్కడి ప్రవాసాంధ్రులను బాధాతప్త హృదయులను చేసింది. ఏదో ఒక విధంగా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఆఖరి నిమిషంలో అద్భుతం జరుగుతుందని ఆశించిన వారికి కేంద్ర మంత్రి వర్గ నిర్ణయం శరాఘాతంలా పరిణమించింది. మెజారిటీ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా విభజన జరిగిపోయిందంటూ ప్రవాసాంధ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించాయి. విదేశీ మహిళ అయిన సోనియా గాంధీకి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే కనీస గౌరవం కూడా లేదు. ఇందుకు పరాకాష్టే తెలుగుజాతిని రెండు ముక్కలు చేయడం. రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు ఇది. 65 రోజులుగా సీమాంధ్ర ప్రజలు చేస్తోన్న ఉద్యమాన్ని కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ అధిష్టానం దెబ్బతీసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చి తెలుగుజాతిని వెన్నుపోటు పొడిచారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనను ప్రధాన రాజకీయ పార్టీలు గౌరవించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అంటూ మండిపడ్డారు.
 
 అన్నదమ్ముల్లా ఉన్న సీమాంధ్ర, తెలంగాణాలను ముక్కలుగా విభజిస్తుండటంతో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసినట్లు అవుతుందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.  గురువారం వారు  తెలంగాణా నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తెలపడంపై సాక్షితో స్పందించారు. వారి అభిప్రాయాలు ...
 
 ఇక కలహాల కాపురమే    
 కేంద్రం నిర్ణయం దిగ్భ్రాంతికరం. అభివృద్ధి నిరోధకం. ఆంధ్రులకు ఊపిరాడకుండా చేసిన నిర్ణయం. ఇన్నాళ్లూ హైదరాబాద్ మనదే అని గర్వంగా చెప్పుకునే వాళ్లం. ఇక కలహాల కాపురమే.
 - డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు, అధ్యక్షుడు, కర్ణాటక తెలుగు అకాడమీ, బెంగళూరు
 
 చివరి ఆశ కూడా నెరవేరలేదు
 ఏదో విధంగా ఒకటిగా ఉంటామనే చివరి ఆశా నెరవేరలేదు. హైదరాబాద్ విషయంలో సడలింపో, మినహాయింపో ఉంటుంది అనుకున్నాం. అదీ జరగలేదు. కాంగ్రెస్ ఎందుకిలా ఆంధ్రులపై కక్ష కట్టింది? రెండుసార్లు కేంద్రంలో అధికారం కట్టబెట్టినందుకు ఇది బహుమతా?
 - వెంకట కృష్ణారెడ్డి, అధ్యక్షుడు, వైఎస్‌ఆర్ స్మారక ఫౌండేషన్, బెంగళూరు
 
 ఇదో పెద్ద అక్రమం    
 ఆంధ్రప్రదేశ్ విభజన పెద్ద అక్రమం. జనం నెత్తిన పిడుగుపాటు. కేంద్రం నిర్ణయం మింగుడు పడడం లేదు. చివరి క్షణం వరకు ఆశాభావంతోనే ఉన్నాం. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. కేంద్ర మంత్రులందరూ ఇప్పటికైనా రాజీనామా చేయాలి
 - కే. గంగరాజు, పూర్వ ప్రధాన కార్యదర్శి, తెలుగు విజ్ఞాన సమితి, బెంగళూరు
 
 పుట్టెడు దు:ఖం మిగిల్చారు    
 నమ్మినందుకు కాంగ్రెస్ నట్టేట ముంచింది. పుట్టెడు దుఃఖం మిగిల్చింది.  సోనియా నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ ఏనాటికీ అధికారంలోకి రాదని ఎందరో చెప్పారు. ఆ జోస్యాన్ని ఆంధ్రులు తలకిందులు చేశారు. ఆమె మనకు విభజన బహుమతినిచ్చి ‘రుణం’ తీర్చుకున్నారు..                      
 - బత్తుల అరుణాదాస్,ప్రవాసాంధ్రులు
 
  రాజకీయ లబ్ధి కోసమే
 అన్యోన్యంగా అన్నదమ్ముల్లా ఉండే వారిని రాజకీయ లబ్ధి కోసం తెలంగాణా పేరుతో విభజన చేశారు.  రాయలసీమలో ఎలాంటి నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు లేవు. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణా ఇవ్వడంతో సీమ ప్రజలు బజారున పడాల్సిన దుస్థితి నెలకొంది. వెంటనే కేంద్రం విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి.               - ఎంపీ జే.శాంత, బళ్లారి
 
 ఇది సరైన చర్య కాదు
 ఆంధ్రప్రదేశ్‌ను  ముక్కలు చేయడం సరైన చర్యకాదు.  వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాంత ప్రజలను మరింత వెనక్కి నెట్టినట్లయింది. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే కోట్లాది మంది జనం  ఇబ్బందులకు గురవుతారు.  నేతలు ఢిల్లీలో కూర్చొని తెలంగాణా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం అన్యాయం.
 - శశికళ, మాజీ డిప్యూటీ మేయర్,బళ్లారి
 
 ఆవేదనను పాలకులు గుర్తించాలి
 తెలంగాణా ప్రక్రియను ఆపాలని రెండు నెలలుగా సీమాంధ్రలో జనం ఘోషిస్తుంటే, ఆ ప్రక్రియను ఆపాల్సింది పోయి కేంద్రం ఆఘమేఘాల మీద ఆమోదం తెలపడం ఎంత వరకు సమంజసం.   
 - రాంప్రకాష్‌రెడ్డి, బస్సు ఓనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, బళ్లారి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement