సీఎం కిరణ్ ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు: దిగ్విజయ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది అని ఆపార్గీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం కిరణ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదని, ఆయనకు పూర్తి స్వేచ్చ ఉంది అని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న రూపంలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఆమోదిస్తే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని హెచ్చరించిన నేపథ్యంపై మీడియా అడిగిన ప్రశ్నలకు దిగ్విజయ్ సమాధానమిస్తూ.. ఆయన ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు.
అవినీతిపరులు అంటూ కేంద్రమంత్రులు, రాజకీయవేత్తలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకురాగా.. ఎలాంటి ఆధారాలున్నా కోర్టుకు సమర్పించాలని, లేకుంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలని దిగ్విజయ్ డిమాండ్ చేశారు. గుజరాత్ అభివృద్ధిపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ చెబుతున్నవన్ని అసత్యాలే అని ఆయన ఆరోపించారు.