మహబూబాబాద్, న్యూస్‌లైన్: మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు(మానుకోట, భద్రాచలం, పినపాక) డోకా లేదు.. ఇన్‌చార్జ్‌లు ఉన్నచోట వారికే టికెట్ ఇస్తాం.. ఇదే ఫైనల్ అని ఏఐసీసీ పరిశీలకుడు సుదేష్‌బోటే స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడానికి సుదేష్‌బోటేతోపాటు పీసీసీ కార్యదర్శి(రాష్ట్ర పరిశీలకుడి హోదాలో) జైప్రకాశ్ రాపోల్ సోమవారం మానుకోటకు వచ్చారు. కేంద్రమంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అభిప్రాయాల సేకరణ, ధరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గాంధీ భవన్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారని చెప్పారు. మూడు నియోజకవర్గాలలో కొంత అసమ్మతి ఉన్నట్లు వచ్చిన దరఖాస్తుల ద్వారా అర్థమవుతోందని, అయినా మెజార్టీ ఎమ్మెల్యేలకే అనుకూలంగా ఉందన్నారు. మానుకోట ఎంపీ స్థానానికి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదని, నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మద్దతుగా మాట్లాడాడం వల్ల మళ్లీ ఆయనకే ఎంపీ టికెట్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గం నుంచి రెండు మూడు దరఖాస్తులు వచ్చినా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోట వారికి టికెట్ ఇస్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీ పరిస్థితి బాగానే ఉంది.. వాటిలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని, సైనికుల్లా పని చేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్‌కు కంచుకోటగా మారుతుందని చెప్పారు. ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, వారు పార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 23తో అసెంబ్లీలో తెలంగాణపై చర్చ ముగుస్తుందని, గడువు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతిందని, ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. సమావేశంలో మానుకోట ఎమ్మెల్యే మాలోతు కవిత, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కాటా భాస్కర్, నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, పజ్జూరి ఇంద్రారెడ్డి, గిరిధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
అసమ్మతి ఉంది...అయినా వారికే...
Published Tue, Jan 21 2014 5:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement