సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలిలో టీడీపీనేత ఒకరు విలువైన ప్రభుత్వ భూములపై కన్నేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ మంత్రి సహకారంతో కోట్ల రూపాయలు విలువజేసే భూములను బినామీ పేర్లతో తన గుప్పెట్లో ఉంచుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఏడో విడత భూ పంపిణీ జరగనే లేదు. ఏ ఒక్కరికీ ఒక్క సెంటు కూడా పంపిణీ చేసిన దాఖలాలు లేవు.
అయినా టీడీపీ నేత అనుచరుడికి మాత్రం ఏడో విడత భూ పంపిణీలో రెండు ఎకరాలు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించారు. అదేవిధంగా ఎక్కడో కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీనేత బినామీకి పిత్రార్జితంగా మరో 5.12 ఎకరాలకు రికార్డులు సృష్టించి సొంతం చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. రూ.కోట్లు విలువజేసే ఈ భూములు టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే బినామీల పేరుతో తన గుప్పెట్లో పెట్టుకున్నారనే ప్రచారం సాగుతోంది.
ఈ తతంగం వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి మంత్రి హస్తం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 2013లో ఏడో విడత భూ పంపిణీ జరిగిన దాఖలాలు లేవు. అయితే 2013 డిసెంబర్ 24న భూ పంపిణీ అసైన్‌మెంట్ కమిటీ తీర్మానం ప్రకారం దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామానికి చెందిన రెండు ఎకరాలను ఇద్దరు వ్యక్తులకు పంపిణీ చేయాలని తీర్మానం చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి ఉన్నారు. వారిలో ఒకరు గుండ్రాజు సుమలత, మరొకరు బాణాల రామారావు పేర్లు పొందుపరచి ఉన్నారు. వీరిద్దరికీ సర్వే నంబర్ 82-4లో చెరొక ఎకరా పంపిణీ చేసినట్లు రికార్డులు సృష్టించారు. ఈ రెండెకరాలు జాతీయ రహదారిపక్కనే ఉండడంతో రూ.కోట్లు విలువ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా బోగోలు మండలం అల్లిమడుగు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 315, 316లో 5.12 ఎకరాలు గుండ్రాజు నరసింహరాజు పేరున రికార్డులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నరసింహరాజు సతీమణే గుండ్రాజు సుమలత కావడం గమనార్హం. గుండ్రాజు నరసింహరావు టీడీపీ నేతకు చెందిన హేచరీస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతని సొంత గ్రామం కృష్ణాజిల్లా కలిగింటి మండలం తాడినకకు చెందిన వారని హే చరీస్‌లో పనిచేసే వారు చెబుతున్నారు. ఇతను టీడీపీ నేతకు నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు.
కాంగ్రెస్ మంత్రి సహకారంతో...
అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఒకరు టీడీపీ నేతకు విలువైన భూమిని కట్టబెట్టేందుకు సహకరించినట్లు తెలుస్తోం ది. పని పూర్తయ్యాక ఆ టీడీపీ నేత అప్పట్లోనే రూ.కోటి విలువ చేసే కారును ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
అడంగల్‌లో పేర్లు ఎలా వచ్చాయో తెలియదు :
-మీనాకుమార్, ఇన్‌చార్జి తహశీల్దార్, దగదర్తి
అడంగల్‌లో సుమలత, రామారావు పేర్లు ఎలా వచ్చాయో నాకు తెలియదు. ఏడో విడత భూపంపిణీ తీర్మానం మాత్రమే జరిగింది. పంపిణీ జరగలేదు. నేను కొత్తగా వచ్చాను. దాని గురించి పూర్తి వివరాలు తెలియదు.
కావలిలో భూ బాగోతం
Published Sat, May 2 2015 2:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement