సాక్షిప్రతినిధి, నల్లగొండ
కాంగ్రెస్‌లో ఒక్కో లీడర్.. ఒక్కో మోనార్క్.. ఎవరి మాటా వినరు.. తమ పంతం నెగ్గించుకునేందుకు నూటికి నూరు పాళ్లు మంకు పట్టు పట్టేవాళ్లే... తమ అనుచరగణానికి పదవులు ఇప్పించుకునేందుకు వీరు చేయని ప్రయత్నమూ లేదు.. ఇప్పటికే కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంలో పదవులు భర్తీ చేస్తూ మూడు జాబితాలు విడుదల చేశారు... ఇంకెన్ని జాబితాలు ఉంటాయో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.
జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న గ్రూపుల ప్రభావం ఆ పార్టీ జిల్లా కార్యవర్గంపై పడుతోంది. ఎంతమందికంటే అంతమందికి, ఎన్ని పదవులు అంటే అన్ని పదవులను పలహారంలా పంచి పెడుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేశారు. వీటి ప్రకారం ఏడుగురు ఉపాధ్యక్షులు, 23 మంది ప్రధాన కార్యదర్శులు, ముగ్గురు అధికార ప్రతినిధులు, పన్నెండు మంది కార్యదర్శులను నియమించారు. ‘పరిస్థితి చూస్తుంటే మరిన్ని జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉంది’.. అని ఆ పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జిల్లా అధ్యక్షుడు, కోశాధికారి పదవులు మాత్రమే ఒక్క వ్యక్తికి పరిమితమయ్యాయి.
పార్టీలో ఆధిపత్య పోరు..
ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, వీరిలో ఇద్దరు మంత్రులు, రెండు చోట్ల ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక శాసన మండలి సభ్యుడు ఇలా.. పదవుల్లో ఉన్న నేతలు కాంగ్రెస్‌లో ఉండడంతో పార్టీలో ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఎవరికి వారుగా ఆ నేతలు తమ అనుచరగణాన్ని పెంచుకునేందుకు, తమ దగ్గరి నుంచి ఎవరూ జారిపోకుండా కాపాడుకునేందుకు పార్టీ పదవులకు సిఫారసు చేస్తున్నారు. ప్రభుత్వంలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో అధికారిక నామినేటెడ్ పోస్టుల భర్తీ అనుకున్నంతగా జరగలేదు. ఒకటీ అరా భర్తీ అయినా, అవి వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాలు, చిన్నా చితక దేవాలయాల పాలక మండళ్లకే పరిమితం అయ్యింది. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణికి పార్టీ పదవులే దిక్కవుతున్నాయి.
బహునాయకత్వం.. పోటాపోటీ
వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఇవి కాకుండా మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఒక విధంగా ముఖ్యమైన ఎన్నికలన్నీ ముందే ఉన్నాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే ఆయా నేతల సూచన మేరకు జిల్లా కార్యవర్గాన్ని భర్తీ చేస్తూ పోతున్నారు. నకిరేకల్ నియోజవకర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, అదే విధంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సిఫారసు చేసిన పేర్లను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి రెండు జాబితాలు డీసీసీకి అందినట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలోనూ ఉంది.
రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కోమటిరెడ్డి సోదరుల మధ్య గ్రూపు తగాదాలు ఉండనే ఉన్నాయి. ఇక్కడా ఇరువర్గాల నేతలు తమ వారికి పదవులంటే, తమవారికి అని ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. తమకు నచ్చని ద్వితీయ, తృతీయ శ్రేణి లోని నాయకుడు ఎవరైనా ఉంటే, ఎట్టి పరిస్థితిలో పదవి ఇవ్వొద్దంటూ అభ్యంతరాలూ చెబుతున్నట్లు సమాచారం. అదే మాదిరిగా భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉందని అంటున్నారు. ఆలేరులో ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గాలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో సూర్యాపేట ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి, ఎంపీ రాజగోపాల్‌రెడ్డి వర్గాలు ఉన్నాయి.
ఈ వర్గాల లొల్లి చివరకు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ప్రభావం చూపించింది. జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహునాయకత్వం, గ్రూపుల గొడవలు ఉన్నాయి. ఎవరికి వారు తమ అనుచరులకు జిల్లా కార్యవర్గంలో పెద్ద పీట వేయించుకునేందుకు ప్రయత్నించడంతో విడతల వారీగా జాబితాలు విడుదలవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక, బ్లాక్ కాంగ్రెస్, జిల్లా అనుబంధ సంఘాలు, వాటి కార్యవర్గాల తీరు సరేసరి. కాంగ్రెస్‌లో జిల్లా స్థాయి పదవంటే.. పేరుకే తప్ప విలువ లేకుండా పోయిందన్న ఆవేదన పార్టీ కేడర్‌లోనే వ్యక్తం కావడం గమనార్హం.
పుష్పక విమానం
Published Mon, Sep 16 2013 3:54 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement