సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరు నగరంలో బాస్‌కు ఎదురుగాలి వీస్తోంది. కనుసైగ శాసనంగా భావించే నాయకులు, అధికార యంత్రాంగంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పట్టు కోల్పోతున్నారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని కిందటి ఏడాది నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల ప్రజలు తేల్చి చెప్పారు. నగర కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా శ్రమించినా, అధికార యంత్రాంగం కొమ్ముకాసినా అప్పట్లో ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు అటు సొంత పార్టీ నాయకులతో పాటు అధికార యంత్రాంగంలో కూడా ఆయన మాటకు విలువ లేకుండాపోతోంది. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, అహంకారపూరిత శైలి వారిని కూడా దూరం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు అందుకు నిదర్శనం. వీటికి అద్దం పడుతూ సోమవారం రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి.
నెల్లూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వివేకాకు అత్యంత ముఖ్యులైన మాజీ కార్పొరేటర్లు చాట్ల నరసింహారావు, పిండి సురేష్ గైర్హాజరయ్యారు. కరెంట్ ఆఫీస్ సెంటర్‌లోని రిత్విక్ ఎన్‌క్లేవ్‌లో మాజీ మేయర్ భానుశ్రీ బంధువులు రిజర్వు స్థలంలో చేసిన నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నగరంలో తాను చెప్పిందే వేదం అన్నట్టుగా నడుస్తున్న తరుణంలో అటు సొంత అనుచరులు ఇటు అధికారులు ఆనంకు ఝలక్ ఇచ్చారు.
భానుశ్రీకి ప్రాధాన్యంతో అసంతృప్త జ్వాలలు
నెల్లూరులో మాజీ మేయర్ భానుశ్రీకి రాజకీయంగా పూర్తి అండదండలు అందించడం ఎంతో కాలంగా ఆనం వివేకానందరెడ్డిని నమ్ముకున్న ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఎమ్మెల్యే తనతో సమాన ప్రాధాన్యం భానుశ్రీకి ఇస్తున్నారు. నగరంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు ఆమె పేరు, ఫొటో లేనిదే జరగడం లేదంటే అతిశయోక్తి లేదు. ఈ పరిస్థితుల్లో ఆమెను వ్యతిరేకించే వారిని బాస్ పక్కనబెడుతున్నారు. కనీసం అసంతృప్తుల అభిప్రాయాలను చెవికెక్కించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో వారిని అవమానపరిచిన ఘటనలూ ఉంటున్నాయి. దీంతో ఆనం అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నెల రెండో వారంలో జరిగిన రొట్టెల పండుగ స్వాగత ఫ్లెక్సీలూ వివాదాస్పదంగా మారాయి.
వేదాయపాలెం నుంచి బారాషహీద్ దర్గా వరకు రోడ్డు డివైడర్ల మధ్య ఫ్లెక్సీల్లో (లాలీపప్స్) ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డితో పాటు భానుశ్రీ ఫొటోలు ఏర్పాటు చేశారు. దర్గా కమిటీ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో ఆమెకు ఏ హోదాతో ఇంత ప్రచారం కల్పించారనేది వారికి మింగుడు పడటం లేదు. దర్గా ఆవరణలో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాళ్ల కాంట్రాక్టులు ఎక్కువ భాగం భానుశ్రీ అనుచరులకే దక్కాయి. ఇవన్నీ ఆనం అనుచరుల్లో అసంతృప్తికి కారణంగా భావిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆనం కుటుంబానికి ఎంతో కాలంగా నమ్మినబంటుగా ఉం టున్న చాట్ల నరసింహారావుతో పాటు వివేకాకు అత్యంత సన్నిహితులైన సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పిండి సురేష్ తదితరులకు కూడా రచ్చబండ ఆహ్వానాలు మొక్కుబడిగా అందాయి. వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే సోమవారం జరిగిన రచ్చబండకు చాట్లతో పాటు పిండి కూడా గైర్హాజరయ్యారని చెబుతున్నారు.
ఎమ్మెల్యే సిఫార్సు బేఖాతరు
రిత్విక్ ఎన్‌క్లేవ్‌లోని మున్సిపల్ రిజర్వుడు స్థలంలో భానుశ్రీ సమీప బంధువులు అక్రమంగా నిర్మించిన ఇంటిని మున్సిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఈ ఇంటిని కూల్చకుండా అధికారులకు ఎమ్మెల్యే సిఫార్సు చేసినప్పటికీ ఖాతరు చేయలేదు. దీనికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు కూడా కార్పొరేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే చేసేదేమీలేక మిన్నకుండి పోయినట్టు తెలిసింది. మొత్తం మీద ఎమ్మెల్యేకు అటు అధికారులు ఇటు పార్టీ నాయకుల నుంచి ఎదురవుతున్న అనుభవాలు చికాకుగా మారాయని అంటున్నారు.
ఆనం వివేకాపై తిరుగుబాటు ధోరణిలో కాంగ్రెస్ నేతలు
Published Tue, Nov 26 2013 2:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement