సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీలోకి కాంగ్రెస్ నేతలు రావడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో టీడీపీకి సత్తా లేకపోవడంతో, కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని పలువురు కాంగ్రె స్ నేతలను టీడీపీ నాయకులు సంప్రదిస్తున్నారు. కొంత మందికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి, పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని ఆపార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను చంద్రబాబు పార్టీలోకి తీసుకోవడంతో...మరో కాంగ్రెస్ పార్టీలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించి కొంత మంది నాయకులు చంద్రబాబు నాయుడిని నిలదీసినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్తు కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని, దీనిపై ఎవరూ మాట్లాడకూడదని, మీడియా ముందుకు వెళ్లకూడదని ఆయన హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో తెలుగు తమ్ముళ్లు లోలోపల రగిలిపోతున్నట్లు సమాచారం. జిల్లా తెలుగుదేశంలో ఎన్నికల హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. ఒక పక్క మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా, సార్వత్రిక ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే టీడీపీలో ఎక్కడా చలనం కనిపించడం లేదు. ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థికి స్థానిక నాయకుడు కరణం బలరాం ఉండగా, కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి, పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా పర్చూరు నియోజకవర్గానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావును తీసుకొచ్చే ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. దగ్గుబాటిని తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తూ, అప్పట్లో కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. దీనిపై పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ విషయం మరుగున పడింది. తాజాగా దగ్గుబాటి కుమారుడు హితేష్‌ను రంగంలోకి దింపాలనే ప్రయత్నంలో ఉన్నట్ల్లు తెలిసింది. దీనికి నటుడు బాలకృష్ణ ఆశీస్సులు కూడా ఉన్నాయంటున్నారు. ఇదిలా ఉండగా యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఇటీవల రాజీనామా చేసిన సురేష్‌ను, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్‌ను కూడా తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. చీరాల ఎమ్మెల్యేగా ఇటీవల రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్‌తో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు సమాచారం.
కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డితో మంతనాలు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ విధంగా కాంగ్రె స్ నాయకులందరినీ తెలుగుదేశంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ దేశమనో, తెలుగు కాంగ్రెసనో పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. అదీ కాకుండా ముందు నుంచి జెండాలు మోసిన నాయకులు, కార్యకర్తలను కాదని, నిన్నటి వరకు తెలుగుదేశంపై ఆరోపణలు చేసిన నాయకులను, పార్టీలోకి ఆహ్వానించడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లాలో తెలుగుదేశం నేతలంతా చంద్రబాబును త్వరలో కలిసి నిలదీయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ వలసలపై గుర్రు
Published Wed, Mar 5 2014 2:39 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement