
దూత ఎదుట క్యూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
వందల సంఖ్యలో వాహనాలు.. భారీ అనుచరగణం.. హంగు ఆర్బాటాలతో సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. ఏఐసీసీ పరిశీలకుడు కేబీ కోలివాడ్ గాంధీభవన్‌లోని డీసీసీ కార్యాలయంలో రెండ్రోజులుగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలనుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈనేపథ్యంలో ఆశావహులు హంగు, ఆర్బాటాలతో పరిశీలకుడి ముందు తమ బలాన్ని ప్రదర్శించారు. రాజేంద్రనగర్ నుంచి దాదాపు పదిమందికిపైగా టిక్కెట్టు రేసులో ఉండగా.. చేవెళ్ల, మహేశ్వరం నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే ఆశావహులున్నారు. వీరంతా తమ అభిప్రాయాలను పరిశీలకునికి వివరిస్తూ వినతులు సమర్పించారు. అయితే సబిత అనుచరులు కొందరు మహేశ్వరం నుంచి పోటీ చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చగా, మరికొందరు రాజేంద్రనగర్ టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని స్పష్టం చేయడం గమనార్హం.
రాజేంద్రనగర్ వైపు సబిత చూపు!
అధిష్టానం దూత ముందు అనుచరుల వేడుకోలు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బరిలో దిగేందుకు ఆమె సుముఖత చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ పరిశీలకుడు కోలివాడ్ ఎదుట ఆమె వర్గీయులు చేసిన హడావుడి కూడా ఈ సంకేతాలను బలపరుస్తోంది. ఆమె ముఖ్య అనుచరులుగా పేరొందిన ఎనుగు మురళీధర్‌రెడ్డి, చెక్కల ఎల్లయ్య, అశోక్, నవాజ్‌ముంతాజ్, సదాలక్ష్మి తదితరులు రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సబితారెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ పరిశీలకుడికి లేఖలు ఇచ్చారు. సబితకు సీటు కేటాయించని పక్షంలో ఎనుగు మురళీధర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం మహేశ్వరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డి గతంలో చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయింది. అనివార్యంగా ఆమె సీటు మారేందుకు కారణమైంది. అయితే, గతంలో తాను ప్రాతి నిధ్యం వహించిన చేవెళ్లలో అంతర్భాగంగా రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలుండడం.. వీటితోనే రాజేంద్రనగర్ ఏర్పడిన నేపథ్యంలో ఈ నియోజకవర్గంపై సబిత ఆసక్తి చూపుతున్నారు. పాత పరిచయాలు కలిసివస్తాయని, మైనార్టీల మద్దతు కూడగట్టవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు.
మజ్లిస్ నేతలతో తమ ఫ్యామిలీకి ఉన్న సత్సంబంధాలు ప్లస్ పాయింట్‌గా మారగలవని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ఇక్కడి నుంచి రంగంలోకి దిగడానికి మొగ్గు చూపుతున్నారు. అందులోభాగంగానే అధిష్టానం దూత ముందు అనుచరవర్గంతో తన అంతరంగాన్ని బయటపెట్టినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
చేవెళ్లలో..
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆశావహులు అధికసంఖ్యలో ఉన్నారు. ఎస్సీ రిజర్వుడ్ సీటు కావడంతో సమీప నియోజకవర్గ నేతలు కూడా ఈ సీటుపై కన్నేశారు. దీంతో సోమవారం పరిశీలకుడి ముందు పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు బొల్లు కిషన్, ఇజ్రాయెల్, కాలే యాదయ్య, వెంకటస్వామి, మోత్కుపల్లి రాములు తదితరులు పరిశీలకుడిని కలిసి వారి వాదనలు వినిపించి టిక్కెటు ఇవ్వాలని కోరారు. మొత్తంగా మెజారిటీ నాయకులు ఎంపీ టిక్కెటు కార్తీక్‌రెడ్డికి ఇవ్వాలని కోరగా, మరికొందరు జైపాల్‌రెడ్డికి మద్దతు పలికినట్లు సమాచారం.
రాజేంద్రనగర్ బరిలో..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి ఈ దఫా రాజేంద్రనగర్ సీటు ఇవ్వాలంటూ పలువురు ఆమె మద్దతుదారులు పరిశీలకుడి ముందు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా గత ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి జ్ఞానేశ్వర్ కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో పరిశీలకుడికి వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా అసెంబ్లీ సీటు తనకు కేటాయించాలంటూ సీనియర్ నాయకులు చల్లా నర్సారెడ్డి కోరారు. ఎంపీ సీటును మర్రి కుటుంబానికి ఇవ్వాలని ఆయన పరిశీలకుడికి నివేదించారు. మండల పార్టీ అధ్యక్షుడు వేణుగౌడ్ కూడా సీటును ఆశిస్తూ పరిశీలకుడికి అభిప్రాయం తెలిపారు.
మహేశ్వరంలో..
మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యే సబితారెడ్డి రాజేంద్రనగర్‌వైపు దృష్టి పెట్టారనే ప్రచారంతో మరికొందరు నేతలు అసెంబ్లీ సీటుకు పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి సబితకు టిక్కెట్టు ఇవ్వాలంటూ ఆమె అనుచరులు కొందరు పరిశీలకుడిని కలిశారు. అదేవిధంగా పార్టీ నేత చెన్న క్రిష్ణారెడ్డి టిక్కెట్‌ను ఆశిస్తూ పరిశీలకుడికి వినతి సమర్పించారు. సబితకు టిక్కెట్టు ఇవ్వని సందర్భంలో తనకు కేటాయించాలంటూ ఆ పార్టీ నేత ఇజ్రాయెల్ కోరినట్లు తెలిసింది.