రండి బాబూ రండి...! | Congress Leaders Tense over Kiran kumar reddy Pulichintala Tour | Sakshi
Sakshi News home page

రండి బాబూ రండి...!

Published Sat, Dec 7 2013 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

రండి బాబూ రండి...!

రండి బాబూ రండి...!

*జనం వచ్చేనా?
 *ఇప్పటికే విభజనపై భగ్గుమంటున్న సీమాంధ్రులు
*ఎలాగోలా రప్పించేందుకు తంటాలు

 
సాక్షి, విజయవాడ/ మచిలీపట్నం : విభజనపై ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేస్తారు.. ముఖ్యమంత్రితో పాటు, సభకు వచ్చే మంత్రులు కూడా రాజీనామాలు చేస్తారు.. సమైక్యవాదులందరూ రండి.. అంటూ గ్రామాలలో పులిచింతల సభకు జనాన్ని రప్పించేందుకు అధికార పార్టీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. తెలంగాణ బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో సీమాంధ్ర భగ్గుమంటోంది.

శుక్రవారం సీమాంధ్ర మొత్తం బంద్‌తో స్తంభించిపోయింది. శనివారం కూడా తెలుగుదేశం పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. అధికార పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసమీకరణ జరుగుతుందా లేదా అన్న భయం అధికార పార్టీ నేతలను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో సమైక్యవాదిగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రాజీనామా ప్రకటిస్తారంటూ ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు లేవనెత్తారు.

పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు విజయవాడ పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో శనివారం బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి రెండు లక్షల మంది ప్రజల్ని సమీకరిస్తామని గొప్పలు చెప్పినా 30, 40 వేల మంది వస్తే చాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో సభ ప్రాంగణంలో 25 వేల కుర్చీలు వేస్తున్నారు. మరో ఐదు వేల మంది నిలబడితే కిక్కిరిసిపోతుంది. అందుకే డ్వాక్వా మహిళలను, రైతులను పెద్ద సంఖ్యలో తరలించే బాధ్యత వ్యవసాయ శాఖ, డ్వామాలపై పెట్టారు.

ఉయ్యూరులో రైతులకు ఆరుతడి పంటలు వేసుకునేందుకు మినుములు సరఫరా చేయాల్సి ఉంది. వీరందరినీ సీఎం సభకు వస్తే ఆదివారం నాడు పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు బతిమలాడుతున్నారు. మరోవైపు భారతరత్న అవార్డు గ్రహీత, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా గురువారం ఉదయం మరణించారు. ఆయనకు సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది. ఈ సమయంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తయిన తరుణంలో సభ నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు  రాష్ట్రపతికి లేఖ పంపనున్నట్లు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఒకపక్క కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆయన శనివారం విజయవాడలో జరిగే సభకు హాజరుకానున్నారు.  ప్రజల ముందుకు రావడానికి ఏదో ఒక నాటకం ఆడటం ఆనవాయితీగా మారింది. దీనిలో భాగంగానే లగడపాటి ఆ ప్రకటన చేశారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తై పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో జరిగే సమావేశాలు అధికార పార్టీ నేతలకు అచ్చిరావన్న సెంటిమెంట్ భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.
 
గత ముఖ్యమంత్రి కె రోశయ్య ఇదే గ్రౌండ్‌లో సన్మానం చేయించుకున్న తర్వాత ఇటునుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి అక్కడ రాజీనామా చేయాల్సి రావడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. గతంలో ప్రధానమంత్రులుగా  పనిచేసిన ఇందిరాగాంధీ, చంద్రశేఖర్,  మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదురైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇన్ని ఆటంకాల మధ్య జరుగుతున్న సభ కావడంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది.
 
అధికారుల నెత్తిన.. జనం ‘మోత’

విజయవాడలో నిర్వహిస్తున్న సీఎం బహిరంగ సభకు సమైక్యసెగ తగిలే అవకాశం ఉండటంతో జన సమీకరణపై ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే మౌఖికంగా దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు మండలాల వారీ జనసమీకరణ కోటాలను వేస్తూ మరింత ఒత్తిడి పెంచారు.

పాలనాపరమైన సేవలను అందించటమే కాదు, కాంగ్రెస్ ఉనికి కోసం ఆ పార్టీ నేతలు నిర్వహిస్తున్న సభలకు కూడా జనాన్ని తరలించాల్సిన బాధ్యత అధికారులపై పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సభ విజయవంతం కోసం జనాన్ని తోలుకురండంటూ ఇటీవల మౌఖికంగా చెప్పిన ఉన్నతాధికారులు ఇప్పుడు రాతపూర్వక ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం వస్తున్న సీఎం బహిరంగ సభను జయప్రదం చేసేందుకు జిల్లా యంత్రాంగం నానా తంటాలు పడుతోంది.

శనివారం ఉదయం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం జడపల్లి తండా వద్ద పులిచింతల పైలాన్‌ను ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన అనంతరం సీఎం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం సభ విజయవంతం చేయటం కోసం కాంగ్రెస్ కార్యకర్తల కంటే జిల్లా అధికార యంత్రాంగం పోటీపడుతోంది. ఇప్పటికే మౌఖికంగా జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు శుక్రవారం రాత్రి ఆయాశాఖల మండలస్థాయి అధికారులకు సెల్ మెసేజ్‌లు, ఈ-మెయిల్ సందేశాలను పంపారు.

ప్రతి మండలానికి పది బస్సులు చొప్పున సిద్ధంగా ఉన్నాయని, మీ మండలాల పరిధిలో కాంగ్రెస్ నాయకులను సంప్రదించి వీలైనంత ఎక్కువ జనాన్ని పంపేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల మెసేజ్‌ల సారాంశం. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఏయే ప్రాంతాల్లో బస్సులు ఉంచుతున్నదీ స్థానిక నేతలను అడిగి తెలుసుకోవాలని, శనివారం ఉదయమే జనాన్ని తరలించేలా గ్రామాలవారీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అసలు విధుల కంటే కొసరు బాధ్యతలు మోయలేక జనాన్ని తరలించే అవస్థలు పడలేక మండలస్థాయి అధికారులు మూగగా రోదిస్తున్నారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement