PWD Grounds
-
యువత చేతిలో దేశ భవిత
విజయవాడ కల్చరల్ : భారతీయ యువత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాజమండ్రి ఇస్కాన్ మందిర అధ్యక్షుడు, సౌత్ ఇండియా డివిజన్ కౌన్సిల్ చైర్మన్ సత్యగోపీనాథ్ ప్రభూజీ పేర్కొన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో స్వరాజ్యమైదానంలో జరుగుతున్న స్వర్ణోత్సవం శుక్రవారం రెండోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ యువత సక్రమమైన బాటలో నడవడానికి భగవద్గీత మంచి సాధనమన్నారు. నూతన రా«జధాని అమరావతిలో ఇస్కాన్ దేవాలయ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లా కొండవీడు కేంద్రంగా రూ.100 కోట్లతో శ్రీకృష్ణ స్వర్ణదేవాలయం నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి దేవాలయ అధ్యక్షుడు సుకదేవ స్వామి మహరాజ్, బెంగళూరు మందిర అధ్యక్షుడు వరదకృష్ణదాస్, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన స్వామీజీలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు బరంపురానికి చెందిన ప్రిన్స్ గ్రూప్ సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రారంభ కార్యక్రమంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధించే అంశంతో ప్రారంభమైంది. ‘లిటిల్ కృష్ణ’ అంశంలో బాలకృష్ణుడి కాళీయ మర్దనం, శ్రీకృష్ణ రాసలీలు,« దశావతారాల అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. చివరిగా ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల జీవితం, ఆయన సమాజసేవ, శ్రీకృష్ణతత్వాన్ని ప్రచారం తదితర అంశాలు ప్రదర్శించారు. నేటి కార్యక్రమాలు శనివారం సాయంత్రం 7 గంటలకు సత్యగోపీనాథ్ స్వామి ప్రవచనాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భగవద్గీత పోటీల విజేతలకు బహుమతి ప్రదాన్సోవ సభ జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. -
ఉత్సవంలా అమరావతి ఫెస్టివల్
విజయవాడ సెంట్రల్ : అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ఉత్సవంలా నిర్వహించాలని కమిషనర్ జి.వీరపాండియన్ అధికారులకు సూచించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పీడబ్లు్యడీ గ్రౌండ్లో జరుగుతున్న పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయడంలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పూల కుండీలను, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొన్నారు. పీడబ్లు్యడీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. చెత్తను డంపర్‌బిన్స్‌లోనే ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. షాపింగ్ ఫెస్టివల్‌కు వచ్చే ప్రజలకు మంచినీరు, మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తరుచు కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా పారిశుధ్య సిబ్బందిని అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఒన్‌టౌన్ పంజాసెంటర్ రైల్వే స్టేషన్ వద్ద ముసాఫర్‌ఖానాను తొలగించి ఉర్దూఘర్‌కం షాదీఖానా షాపింగ్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయడంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రోడ్ల విస్తరణ అనంతరం రైల్వే సరిహద్దు గోడ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ ఎంఏ.షుకూర్, ఈఈ ఉదయ్‌కుమార్, ఎస్టేట్ ఆఫీసర్ కృష్ణమూర్తి, యూసీడీ పీవో ఎం.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా ఊంజల్ సేవ
విజయవాడ కల్చరల్ : కృష ్ణపుష్కరాల సందర్భంగా స్వరాజ్య మైదానంలో టీటీడీ( తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్మించిన నమూనా దేవాలయం ఊంజల్ సేవ సోమవారం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పల్లకీసేవ, ఉంజల్‌సేవలో కంచిపీఠ ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. స్వామికి టీటీడీ దేవాలయ ప్రత్యేక అధికారి శేషాద్రి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. వెంకటేశ్వరుడి పూజలో స్వామి స్వయంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ విశేషాలను శేషాద్రి స్వామికి వివరించారు. -
23న విజయవాడ రైతు సదస్సులో దేశీ రెడ్ రైస్ విత్తనాల పంపిణీ
గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్(బందర్ రోడ్డు)లో ఈ నెల 23 (ఆదివారం)న జరగనున్న సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఔషధ విలువలతో కూడిన ‘కుడవలై’ అనే దేశీ వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు సంఘం నేత కుమారస్వామి తెలిపారు (ఇది 140 రోజుల పంట. బియ్యం ఎర్రగా ఉంటాయి. రక్తహీనతను, కీళ్ల నొప్పులను తగ్గించడానికి దోహదపడుతుంది). తమిళనాడులోని ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ వద్ద నుంచి హరిత భారతి ట్రస్టు (త్రినాథ్:89770 97405) తెప్పించిన ఈ రెడ్ రైస్ విత్తనాలను రైతుకు కిలో చొప్పున అందించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్న రైతులను ఒకే గొడుగు కిందకు తేవడం.. ఈ అమృతాహారం విలువను వినియోగదారులకు తెలియజెప్పడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ విస్తృత సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు, వినియోగదారులు తరలి రావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు జరుగుతుందన్నారు. వివరాలకు.. కుమారస్వామి-94401 27151, భూపతిరాజు రామకృష్ణంరాజు-94404 87864 -
రండి బాబూ రండి...!
*జనం వచ్చేనా? *ఇప్పటికే విభజనపై భగ్గుమంటున్న సీమాంధ్రులు *ఎలాగోలా రప్పించేందుకు తంటాలు సాక్షి, విజయవాడ/ మచిలీపట్నం : విభజనపై ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేస్తారు.. ముఖ్యమంత్రితో పాటు, సభకు వచ్చే మంత్రులు కూడా రాజీనామాలు చేస్తారు.. సమైక్యవాదులందరూ రండి.. అంటూ గ్రామాలలో పులిచింతల సభకు జనాన్ని రప్పించేందుకు అధికార పార్టీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. తెలంగాణ బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో సీమాంధ్ర భగ్గుమంటోంది. శుక్రవారం సీమాంధ్ర మొత్తం బంద్‌తో స్తంభించిపోయింది. శనివారం కూడా తెలుగుదేశం పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. అధికార పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసమీకరణ జరుగుతుందా లేదా అన్న భయం అధికార పార్టీ నేతలను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో సమైక్యవాదిగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రాజీనామా ప్రకటిస్తారంటూ ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు లేవనెత్తారు. పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు విజయవాడ పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో శనివారం బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి రెండు లక్షల మంది ప్రజల్ని సమీకరిస్తామని గొప్పలు చెప్పినా 30, 40 వేల మంది వస్తే చాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో సభ ప్రాంగణంలో 25 వేల కుర్చీలు వేస్తున్నారు. మరో ఐదు వేల మంది నిలబడితే కిక్కిరిసిపోతుంది. అందుకే డ్వాక్వా మహిళలను, రైతులను పెద్ద సంఖ్యలో తరలించే బాధ్యత వ్యవసాయ శాఖ, డ్వామాలపై పెట్టారు. ఉయ్యూరులో రైతులకు ఆరుతడి పంటలు వేసుకునేందుకు మినుములు సరఫరా చేయాల్సి ఉంది. వీరందరినీ సీఎం సభకు వస్తే ఆదివారం నాడు పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు బతిమలాడుతున్నారు. మరోవైపు భారతరత్న అవార్డు గ్రహీత, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా గురువారం ఉదయం మరణించారు. ఆయనకు సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది. ఈ సమయంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తయిన తరుణంలో సభ నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ పంపనున్నట్లు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఒకపక్క కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆయన శనివారం విజయవాడలో జరిగే సభకు హాజరుకానున్నారు. ప్రజల ముందుకు రావడానికి ఏదో ఒక నాటకం ఆడటం ఆనవాయితీగా మారింది. దీనిలో భాగంగానే లగడపాటి ఆ ప్రకటన చేశారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తై పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో జరిగే సమావేశాలు అధికార పార్టీ నేతలకు అచ్చిరావన్న సెంటిమెంట్ భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. గత ముఖ్యమంత్రి కె రోశయ్య ఇదే గ్రౌండ్లో సన్మానం చేయించుకున్న తర్వాత ఇటునుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి అక్కడ రాజీనామా చేయాల్సి రావడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన ఇందిరాగాంధీ, చంద్రశేఖర్, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదురైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇన్ని ఆటంకాల మధ్య జరుగుతున్న సభ కావడంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. అధికారుల నెత్తిన.. జనం ‘మోత’ విజయవాడలో నిర్వహిస్తున్న సీఎం బహిరంగ సభకు సమైక్యసెగ తగిలే అవకాశం ఉండటంతో జన సమీకరణపై ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే మౌఖికంగా దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు మండలాల వారీ జనసమీకరణ కోటాలను వేస్తూ మరింత ఒత్తిడి పెంచారు. పాలనాపరమైన సేవలను అందించటమే కాదు, కాంగ్రెస్ ఉనికి కోసం ఆ పార్టీ నేతలు నిర్వహిస్తున్న సభలకు కూడా జనాన్ని తరలించాల్సిన బాధ్యత అధికారులపై పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సభ విజయవంతం కోసం జనాన్ని తోలుకురండంటూ ఇటీవల మౌఖికంగా చెప్పిన ఉన్నతాధికారులు ఇప్పుడు రాతపూర్వక ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం వస్తున్న సీఎం బహిరంగ సభను జయప్రదం చేసేందుకు జిల్లా యంత్రాంగం నానా తంటాలు పడుతోంది. శనివారం ఉదయం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం జడపల్లి తండా వద్ద పులిచింతల పైలాన్‌ను ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన అనంతరం సీఎం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం సభ విజయవంతం చేయటం కోసం కాంగ్రెస్ కార్యకర్తల కంటే జిల్లా అధికార యంత్రాంగం పోటీపడుతోంది. ఇప్పటికే మౌఖికంగా జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు శుక్రవారం రాత్రి ఆయాశాఖల మండలస్థాయి అధికారులకు సెల్ మెసేజ్‌లు, ఈ-మెయిల్ సందేశాలను పంపారు. ప్రతి మండలానికి పది బస్సులు చొప్పున సిద్ధంగా ఉన్నాయని, మీ మండలాల పరిధిలో కాంగ్రెస్ నాయకులను సంప్రదించి వీలైనంత ఎక్కువ జనాన్ని పంపేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల మెసేజ్‌ల సారాంశం. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఏయే ప్రాంతాల్లో బస్సులు ఉంచుతున్నదీ స్థానిక నేతలను అడిగి తెలుసుకోవాలని, శనివారం ఉదయమే జనాన్ని తరలించేలా గ్రామాలవారీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అసలు విధుల కంటే కొసరు బాధ్యతలు మోయలేక జనాన్ని తరలించే అవస్థలు పడలేక మండలస్థాయి అధికారులు మూగగా రోదిస్తున్నారు. -
హోరెత్తిన మహిళా గర్జనలు
మహిళాలోకం సమైక్యాంధ్రే లక్ష్యంగా నినదించింది. నారీ రణభేరితో జిల్లాలో ఉద్యమానికి మరింత ఊపొచ్చింది. విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, తిరువూరు, అవనిగడ్డతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన మహిళా గర్జనకు పెద్ద ఎత్తున మహిళలు పోటెత్తారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. జిల్లా అంతటా నిరసనలు, మానవహారాలు శుక్రవారం కూడా ఉధృతంగా సాగాయి. సాక్షి, విజయవాడ : మహిళా గర్జనలతో జిల్లా మార్మోగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో శుక్రవారం మహిళలు ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. మండుటెండలో సైతం ఉద్యమమే ఊపిరిగా ఆందోళన నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, ఉయ్యూరు, అవనిగడ్డలతో పాటు పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున మహిళా గర్జనలు జరిగాయి. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో జరిగిన సభ వేలాదిగా తరలివచ్చిన మహిళలతో కిక్కిరిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ప్రాణాలు అర్పించడానికైనా తాము సిద్ధమని వారు నినదించారు. మచిలీపట్నం కోనేరు సెంటర్లో నిర్వహించిన భారీ ర్యాలీలో మహిళా న్యాయవాదులు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, వంట ఏజెన్సీ నిర్వాహకులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉయ్యూరులో సమైక్యాంధ్ర గోడు విజయవంతమైంది. వేలాది మంది మహిళలు గర్జనలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. వంగపండు ఉష కళాబృందం సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ ఆలపించిన ఆట, పాట, మాటకు మహిళలు జేజేలు పలికారు. సోనియమ్మను విమర్శిస్తారా అంటూ మంత్రి సారథి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా సమైక్యవాదులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. అవనిగడ్డలో మహిళాలోకం కదంతొక్కింది. మహిళా ఉద్యోగినులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఎస్వీఎల్ క్రాంతి విద్యార్థినులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అవనిగడ్డ పంచాయతీ ఈవో శైలజాకుమారి రాజీవ్‌చౌక్‌లో యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మకు సంప్రదాయబద్ధంగా కర్మకాండలు నిర్వహించారు. ముదినేపల్లిలో మహిళ గర్జనలో భాగంగా బస్‌స్టేషన్ ఆవరణలో 500 మంది వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బాలికలు, 50 మంది ఉపాధ్యాయినులతో ఆంధ్రప్రదేశ్ ఆకారంలో నిలబడి సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండవల్లి జేఏసీ ఆధ్వర్యంలో మహిళా గర్జనలో పాల్గొన్న మహిళలు రాస్తారోకో నిర్వహించారు. బంటుమిల్లి సమైక్యాంధ్ర పోరాట సమితి నిర్వహించిన మహిళా గర్జనకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల నుంచి మహిళలు స్వచ్ఛందంగా హాజరయ్యారు. తిరువూరులో మహిళా గర్జన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రమంత్రులు, ఎంపీలు, సోనియాగాంధీ మాస్కులతో నిరసన ప్రదర్శన జరిపారు. జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని విజయవాడ చార్టర్డ్ అకౌంటెంట్ల జేఏసీ తీర్మానించింది. రెండోరోజుకు చేరిన 72 గంటల సమ్మె.. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె రెండో రోజుకు చేరింది. ఎన్టీటీపీఎస్లో ఇంజనీరింగ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ జేఏసీకి మద్య విభేదాలు రావటంతో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దాంతో 5వ యూనిట్ మినహా మిగిలిన యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నూజివీడులో విద్యుత్ ఉద్యోగులు రోడ్లపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటు బస్ ఆపరేటర్లు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. నూజివీడులో వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న రిలేదీక్షలు 18వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ప్రారంభించారు. గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, కైకలూరు, మచిలీపట్నం తదితర పట్టణాల్లో జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి. గుడివాడలో టెలికాం, పోస్టల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సమైక్యవాదులు మూయించారు. కైకలూరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించగా, మహిళా నేతలు మహిళలకు బొట్టుపెట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో న్యాయవాదులు సమైక్య నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నాగాయలంకలో పండ్ల వ్యాపారులు ఆపిల్ పండ్లు, కూరగాయల వ్యాపారులు పచ్చిమిర్చి దండలు ధరించి నిరసన తెలిపారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో కొండపల్లిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జగ్గయ్యపేటలో అఖిల పక్ష, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒంటికాలితో కుంటుతూ నిరసన వ్యక్తం చేశారు. పెడనలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. చాట్రాయి మండలం చనుబండలో ఐకాస నాయకులు బ్యాంకు మేనేజర్ చెప్పులు శుభ్రపరచి నిరసన తెలిపారు.