మహిళాలోకం సమైక్యాంధ్రే లక్ష్యంగా నినదించింది. నారీ రణభేరితో జిల్లాలో ఉద్యమానికి మరింత ఊపొచ్చింది. విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, తిరువూరు, అవనిగడ్డతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన మహిళా గర్జనకు పెద్ద ఎత్తున మహిళలు పోటెత్తారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. జిల్లా అంతటా నిరసనలు, మానవహారాలు శుక్రవారం కూడా ఉధృతంగా సాగాయి.
సాక్షి, విజయవాడ : మహిళా గర్జనలతో జిల్లా మార్మోగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో శుక్రవారం మహిళలు ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. మండుటెండలో సైతం ఉద్యమమే ఊపిరిగా ఆందోళన నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, ఉయ్యూరు, అవనిగడ్డలతో పాటు పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున మహిళా గర్జనలు జరిగాయి. మహిళా జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ పీడబ్ల్యుడీ గ్రౌండ్స్‌లో జరిగిన సభ వేలాదిగా తరలివచ్చిన మహిళలతో కిక్కిరిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ప్రాణాలు అర్పించడానికైనా తాము సిద్ధమని వారు నినదించారు. మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో మహిళా న్యాయవాదులు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, వంట ఏజెన్సీ నిర్వాహకులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉయ్యూరులో సమైక్యాంధ్ర గోడు విజయవంతమైంది.
వేలాది మంది మహిళలు గర్జనలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. వంగపండు ఉష కళాబృందం సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ ఆలపించిన ఆట, పాట, మాటకు మహిళలు జేజేలు పలికారు. సోనియమ్మను విమర్శిస్తారా అంటూ మంత్రి సారథి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా సమైక్యవాదులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. అవనిగడ్డలో మహిళాలోకం కదంతొక్కింది. మహిళా ఉద్యోగినులు, డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎస్‌వీఎల్ క్రాంతి విద్యార్థినులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
అవనిగడ్డ పంచాయతీ ఈవో శైలజాకుమారి రాజీవ్‌చౌక్‌లో యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మకు సంప్రదాయబద్ధంగా కర్మకాండలు నిర్వహించారు. ముదినేపల్లిలో మహిళ గర్జనలో భాగంగా బస్‌స్టేషన్ ఆవరణలో 500 మంది వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బాలికలు, 50 మంది ఉపాధ్యాయినులతో ఆంధ్రప్రదేశ్ ఆకారంలో నిలబడి సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండవల్లి జేఏసీ ఆధ్వర్యంలో మహిళా గర్జనలో పాల్గొన్న మహిళలు రాస్తారోకో నిర్వహించారు.
బంటుమిల్లి సమైక్యాంధ్ర పోరాట సమితి నిర్వహించిన మహిళా గర్జనకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల నుంచి మహిళలు స్వచ్ఛందంగా హాజరయ్యారు. తిరువూరులో మహిళా గర్జన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రమంత్రులు, ఎంపీలు, సోనియాగాంధీ మాస్కులతో నిరసన ప్రదర్శన జరిపారు. జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని విజయవాడ చార్టర్డ్ అకౌంటెంట్ల జేఏసీ తీర్మానించింది.
రెండోరోజుకు చేరిన 72 గంటల సమ్మె..
సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె రెండో రోజుకు చేరింది. ఎన్టీటీపీఎస్‌లో ఇంజనీరింగ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ జేఏసీకి మద్య విభేదాలు రావటంతో ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దాంతో 5వ యూనిట్ మినహా మిగిలిన యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నూజివీడులో విద్యుత్ ఉద్యోగులు రోడ్లపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటు బస్ ఆపరేటర్లు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. నూజివీడులో వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న రిలేదీక్షలు 18వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ప్రారంభించారు.
గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, కైకలూరు, మచిలీపట్నం తదితర పట్టణాల్లో జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగాయి. గుడివాడలో టెలికాం, పోస్టల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సమైక్యవాదులు మూయించారు. కైకలూరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించగా, మహిళా నేతలు మహిళలకు బొట్టుపెట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు. నందిగామ బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో న్యాయవాదులు సమైక్య నినాదాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
నాగాయలంకలో పండ్ల వ్యాపారులు ఆపిల్ పండ్లు, కూరగాయల వ్యాపారులు పచ్చిమిర్చి దండలు ధరించి నిరసన తెలిపారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో కొండపల్లిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జగ్గయ్యపేటలో అఖిల పక్ష, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒంటికాలితో కుంటుతూ నిరసన వ్యక్తం చేశారు. పెడనలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 23వ రోజుకు చేరాయి. చాట్రాయి మండలం చనుబండలో ఐకాస నాయకులు బ్యాంకు మేనేజర్ చెప్పులు శుభ్రపరచి నిరసన తెలిపారు.
హోరెత్తిన మహిళా గర్జనలు
Published Sat, Sep 14 2013 1:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement