సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని పసుపు చొక్కా తొడుక్కోవాలని నిర్ణయం తీసుకున్న శాసనసభ్యులు ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధరరెడ్డి ప్రస్తుత పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 24, లేదా 25వ తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నెల్లూరుకు రప్పించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సైకిలెక్కే దిశగా వారు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈలోగానే ఆదాలను నెల్లూరు లోక్‌సభకు పోటీ చేయించాలా? కావలి శాసనసభకు పోటీ చేయించాలా? అనే విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నందున ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తే డిపాజిట్ దక్కదని ఆదాల, ముంగమూరు దృఢ నిశ్చయానికి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసేయడంతో రెండో ప్రత్యామ్నాయంగా వారు తెలుగుదేశంను ఎంచుకున్నారు.
ఆదాలతో జిల్లా టీడీపీ ముఖ్య నేతలకు ఉన్న సన్నిహిత సంబంధాలతో వారే ఈ ఇద్దరి చేరిక గురించి చంద్రబాబుతో మాట్లాడి సరేననిపించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్థానిక గ్రూపు రాజకీయాల వల్ల కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు ఆదాలతో చెక్ పెట్టేలా పావులు కదిపారు. ఆదాలను కావలి నుంచి పోటీ చేయించి మస్తాన్ రావును లోక్‌సభకు పోటీ చేయించే ప్రతిపాదన చేశారు. చంద్రబాబు కూడా ఇందుకు అంగీకరించి మస్తాన్‌రావు ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. ఆదాల కోసం తనను బలిచేసే నిర్ణయం తీసుకుంటే తాను ఎన్నికల్లో పోటీకే దిగనని, కావలి నుంచైతేనే పోటీ చేస్తానని ఆయన తెగేసి చెప్పడంతో చంద్రబాబు సైతం వెనకడుగు వేశారు.
అయితే ఆదాల, ముంగమూరులను పార్టీలోచేర్చుకోవడాన్ని మాత్రం చంద్రబాబు ఖరారు చేశారు. ఆదాలను నెల్లూరు లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ముంగమూరు శ్రీధరరెడ్డికి మాత్రం ఆయన ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచే టికెట్ ఖరారైందని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన వెంటనే వీరిద్దరూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరాలని భావించారు.
అయితే అనూహ్య పరిణామాల నడుమ శాసనసభ రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరించడం, తనతో ఉన్న బంధుత్వం, ప్రభుత్వం నుంచి ఆదాలకు ఉన్న అవసరాల దృష్ట్యా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వీరి చేరికను వాయిదా వేయిస్తూ వచ్చారు.
నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటం, లోక్‌సభలో గురువారం నాటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి ఇదే మంచి వాదన అవుతుందనే ఆలోచనతో ఎమ్మెల్యేలిద్దరూ గురువారం తమ రాజీనామా ప్రకటన చేశారు. చివరి వరకు సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూనే జనం వద్ద సమైక్య హీరోలుగా ముద్ర వేసుకునేందుకు ఆపసోపాలు పడిన ఆదాల, ముంగమూరు ఎట్టకేలకు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
సైకిలెక్కేందుకే..
Published Fri, Feb 14 2014 3:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement