
గల్లా సాక్షిగా బాబు విమర్శలు
సాక్షి, తిరుపతి: రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. బంగారుపాళెం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎన్‌పీ.చెంగల్రాయనాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. మంత్రి గల్లా కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమానికి మంత్రి స్వయంగా హాజరయ్యారు.
విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసిన ప్రాంగణంలోని వేదికపై చంద్రబాబు, అరుణకుమారి పక్కపక్కనే కూర్చున్నారు. దశబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న ఈ నేతలు ఒకే వేదికపై పక్కపక్కన కూర్చోవడం చర్చకు దారితీసింది. ఈ వేదికపై నుంచే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్పమొయిలీలను ప్రతిపక్షనేత తీవ్రస్థాయిలో విమర్శించారు.
చంద్రబాబు విమర్శలు చేస్తున్న సమయంలో అరుణకుమారి కొంత ఇబ్బందిపడినట్టు కనిపించారు. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని కాంగ్రెస్ నేతలు కీలకంగా వ్యవహరించారని బాబు తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో చిదంబరం భారీ మెజారిటీతో ఓడిపోవడం ఖాయమన్నారు. అంతకుముందు గల్లా అరుణకుమారి తన ప్రసంగంలో ఎన్‌పీ. చెంగల్రాయనాయుడు సేవలను కీర్తించారు. కాగా చంద్రబాబు బంగారుపాళెం చేరుకోవడానికి గంట ముందుగానే అరుణకుమారి అక్కడికి చేరుకున్నారు.
అయితే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాబు చేరుకోవడానికి ఐదు నిమిషాల ముందు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే రవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఉదయం పది గంటల సమయంలో బంగారుపాళెం చేరుకుని చెంగల్రాయనాయుడు విగ్ర హానికి నివాళులు అర్పించి వెళ్లారు.