హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంపై ఏపీలోని రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. దీనికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగనుంది.
ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రాష్ట్రంలో అడుగుపెట్టిన మోదీ ప్రత్యేక హోదా అంశం గురించి ఊసెత్తకపోవడంపై ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధానిని హోదా అడిగితే ఢిల్లీ నుంచి మట్టి, నీళ్లు తెచ్చారని దుయ్యబట్టారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని రుద్రరాజు పిలుపునిచ్చారు. సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజల ఆకాంక్షలు నెరవేరవని అన్నారు.