రాజధాని ఎంపిక లో కుట్ర
నంద్యాల:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుయాయులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకే విజయవాడను రాజధానిగా ఎంపిక చేశారని, ఇందులో కుట్ర దాగి ఉందని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలోని ఆయన నివాసంలో రాయలసీమ పార్టీ అధ్యక్షుడు పాండురంగారెడ్డితో కలిసి భూమా విలేకరులతో మాట్లాడారు. విజయవాడను రాజధాని చేయడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, అక్కడున్న నేల స్వభావం, ప్రకృతి వైపరీత్యాలు రాజధాని నిర్మాణానికి ఉపయోగపడే విధంగా లేవ ని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో విజయవాడకు వరదలు, భూకంపాల ముప్పు పొంచి ఉందని వెల్లడైనట్లు భూమా గుర్తు చేశారు. ఆ ప్రాంత ప్రజలు కూడా ఇష్టం లేదన్నారు. అక్కడున్న స్థలాలు, పొలాలతో వ్యాపారం చేసుకునేందుకు తెలుగుదేశం పన్నిన కుట్రగా అభివర్ణించారు. శాసన సభలో కూడా రాజధాని ఎంపికపై ఎలాంటి చర్చ జరుగకుండానే చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈ విషయంపై త్వరలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి వాస్తవాలను వివరించే యత్నం చేస్తామన్నారు. అనంతరం విజయవాడపై పరిశోధన చేయాలని రాయలసీమ పార్టీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి అంతర్జాతీయ సముద్ర శాస్త్రవేత్త మారంరెడ్డి మద్దిలేటిరెడ్డిని కోరారు.