సుగర్ ఫ్యాక్టరీల నిర్వీర్యానికి కుట్ర | Conspiracy to undermine the Sugar Factories | Sakshi
Sakshi News home page

సుగర్ ఫ్యాక్టరీల నిర్వీర్యానికి కుట్ర

Published Wed, Mar 16 2016 11:26 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

సుగర్ ఫ్యాక్టరీల  నిర్వీర్యానికి కుట్ర - Sakshi

సుగర్ ఫ్యాక్టరీల నిర్వీర్యానికి కుట్ర

30 లోగా గోవాడ రైతులకు  బకాయిలు చెల్లించాలి
లేకుంటే ఆ తరువాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
కలెక్టర్‌కు స్పష్టంచేసిన వైఎస్సార్‌సీపీ నేత బొత్స

 
విశాఖపట్నం: సహకార రంగంలో ఉన్న సుగర్ ఫ్యాక్టరీలను హస్తగతం చేసుకోవాలన్న కుట్రతోనే లాభాలబాటలో ఉన్న ఫ్యాక్టరీలను సైతం నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలో కూడా ఇదే రీతిలో సుగర్ ఫ్యాక్టరీలను నష్టాలపాల్జేసి మూతపడేలా చేశారని, మళ్లీ నేడు అదే రీతిలో టీడీపీ పాలకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తుమ్మపాల ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిపేయడం, లాభాల బాటలో ఉన్న చోడవరం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని నష్టాలపాల్జే యడం చూస్తుంటే దీని వెనుక భారీ కుట్ర దాగి  ఉందని అర్థమవుతోందన్నారు.
 చోడవర ం గోవాడ సుగర్ రైతులకు పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ  బొత్సతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు రైతులతో కలిసి బుధవారం విశాఖ కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ ఎన్. యువరాజ్‌ను  వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బొత్స కలెక్టర్‌తో మాట్లాడుతూ గోవాడ ఫ్యాక్టరీ టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు రూ.20 నుంచి 22 కోట్ల మిగులులో ఉండేదని, గతంలో తాను మంత్రిగా ఉన్నపుడు   ఏటా క్రషింగ్ అయిన వెంటనే సకాలంలో చెల్లింపులు చేయడమే కాకుండా, రూ.200 బోనస్ కూడా ఇచ్చేవారమని గుర్తుచేశారు.   పదేళ్లుగా లాభాలబాటలో ఉన్న ఈ ఫ్యాక్టరీ నేడు నష్టాల్లో కూరుకుపోతుందో అర్థం కావడం లేదన్నారు. బోనస్ మాటదేవుడెరుగు గతేడాది  క్రషింగ్‌కు సంబంధించి టన్నుకు రూ.175ల చొప్పున ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. గతేడాది జరిగిన మహాజనసభలో ఫ్యాక్టరీలో  అవినీతిపైనే కాకుండా బకాయిల కోసం రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయాన్ని గుర్తు చేశారు.

అప్పట్లో ఇదే సమస్యను మీ దృష్టికితీసుకొస్తే జేసీతో విచారించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారని ఐదు నెలలైనా నేటికీ సమస్య అలాగే ఉందని బొత్స చెప్పారు. దీనిపై కలెక్టర్  స్పందిస్తూ జేసీ నెలరోజుల్లోనే నివేదిక ఇచ్చారని, కానీ చెల్లించాల్సిన బకాయిలు  రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆ రూ.7.5 కోట్లయినా ఈ నెలాఖరు లోగా ఇచ్చేలా ఏర్పాటు చేయాలని, లేకుంటే మరోసారి రైతులు రోడ్డెక్కే పరిస్థితులు నెలకొంటాయని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని బొత్స హెచ్చరించారు. అలాగే జేసీ ఎంక్వైరీ రిపోర్టును కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
 
హామీలు విస్మరించిన టీడీపీ
ఈ సందర్భంగా బొత్స  సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ,   సుగర్ ఫ్యాక్టరీలను బలోపేతం చేస్తాం.. తుమ్మపాల ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తాం.. లేకుంటే రాజీనామా చేస్తాం.. అంటూ టీడీపీ నాయకులు శుష్కవాగ్దానాలు చేసి గద్దెనెక్కారని, కానీ నేడు వాటిని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు. మీరేమీ రాజీనామాలు చేయనవసరం లేదు రైతుల ఆవేదనను అర్థం చేసుకోండి.. బకాయిలను వెంటనే చెల్లించి క్రషింగ్‌కు అనుమతులివ్వండి చాలు అని బొత్స కోరారు. ఈ కార్యక్రమంలో   వైఎస్సార్‌సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి,రాష్ర్ట కార్యదర్శి కంపా హనోక్, రాష్ర్ట ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, రాష్ర్ట యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, బీసీసెల్ నాయకుడు ఫక్కి దివాకర్, డీసీఎంఎస్ చైర్మన్ మక్కా మహాలక్ష్మి నాయుడు, డీసీసీబీ డెరైక్టర్ గుమ్మిడి సత్యదేవ్, జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గైరమ్మ సత్తిబాబు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతు సంఘ నాయకులు కె.జగ్గారావు, ఓరుగంటి నెహ్రూ, ఏరువాక సత్యారావు, రాపేటి నాగేశ్వరరావు,  శీలం శంకరరావు, సూరిశెట్టి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement