వీడిన మిస్టరీ | Constable, Scheduled murder | Sakshi
Sakshi News home page

వీడిన మిస్టరీ

Published Mon, Jan 13 2014 3:34 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable, Scheduled murder

  •      కానిస్టేబుల్, హోంగార్డు హత్య కేసును ఛేదించిన పోలీసులు
  •      నిందితులు తమిళనాడు, చిత్తూరు జిల్లా వాసులే
  •      కటకటాల వెనక్కు నిందితులు
  •  
    చిత్తూరు (క్రైమ్), న్యూస్‌లైన్: పలమనేరు పట్టణంలో కానిస్టేబుల్, హోంగార్డు హత్యల వెనుకున్న మిస్టరీ వీడింది. పోలీసులు నెల రోజు లకుపైగా శ్రమించి కేసును ఛేదించారు. నిందితులు తమిళనాడులోని సేలం, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వాసులుగా తేల్చారు. నిందితులను కటకటాల వెనక్కు పంపారు. ఈ వివరాలను ఎస్పీ రామకృష్ణ ఆదివారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో వెల్లడించారు. డిసెంబర్ 1న పలమనేరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతంలో అక్కడ పనిచేసే కానిస్టేబుల్ జవహర్‌నాయక్, హోంగార్డ్ దేవేం ద్రలు దారుణ హత్యకు గురైన విషయం విదితమే.

    పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీలు రాజేశ్వర్‌రెడ్డి, హరినాథరెడ్డిలతో పాటు మరో ఐదుగురు సీఐలు, ఎస్సైలను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేశారు. ఈ బృందం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విచారణ చేపట్టగా క్లూ లభించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే ముఠా సేలం జిల్లాలో ఉందని తెలిసింది. అక్కడికి వెళ్లి నిందితుల కదలికలపై ఆరా తీశారు.

    ఈ నేపథ్యంలో ఆదివారం అంతర్రాష్ర్ట దోపిడీ ముఠాకు సంబంధించిన తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన వెళ్లాయన్ మణికంఠ అలియాస్ వెళ్లాయన్, సంపత్ (27), సేలం జిల్లా సంగగిరి గ్రామానికి చెందిన మురగన్ అలియాస్ కాశి (24)లను పలమనేరు సమీపంలోని భూతలకొండ క్రాస్ వద్ద ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. వారిని విచారించగా కానిస్టేబుల్, హోంగార్డును హత్య చేసిం ది తామేనని, ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని చేశామని అంగీకరించారు. తమ బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్న ట్టు వెల్లడించారు.

    నిందితులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం మేటూరి క్యాంపునకు చెందిన రాఘవన్ అలియాస్ వెంకటేష్, ప్రేమ్ (24), పలమనేరు మండలం నక్కపల్లెకు చెందిన జంగంరెడ్డిగారి రామిరెడ్డి (34), క్యాటిల్‌ఫారమ్‌కు చెందిన మామిళ్లపల్లె విజయకుమార్ (28), బెరైడ్డిపల్లె మండలం కడతట్లపల్లెకు చెందిన సాకే రాజేంద్ర (34), తవణంపల్లె మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రతాప్ (29)లను పోలీసులు అరెస్టు చేశారు.

    వీరితో పాటు మీరట్‌లో మిలటరీ ఉద్యోగం చేస్తున్న తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా జామనహల్లె పుట్టావర్రి గ్రామానికి చెందిన గోవిందస్వామి అలియాస్ కృష్ణ, కావప్ప, గోవింద, స్వామి, మిలటరీ గోవిందస్వామి (29), శోళింగర్‌కు చెందిన బొమ్మి అలియాస్ లక్ష్మి (35)లను దోపిడీ బంగారం రికవరీ చేయడానికి పోలీసులు బయట ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 92 గ్రాముల బంగారు ఆభరణాలు, మూ డు ద్విచక్రవాహనాలు, కత్తులు, కారంపొడి పొట్లాలు కలిగిన క్యారీబ్యాగులు, వేటకొడళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  
     
    కానిస్టేబుల్, హోంగార్డు హత్య జరిగిందిలా
     
    గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం పలమనేరు అటవీ ప్రాంతంలోని గాంధీనగర్ వద్ద ఓ జంట ఆటోలో వెళ్లినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పలమనేరు పోలీ స్‌స్టేషన్‌కు చెందిన బ్లూకోల్డ్ సిబ్బంది జవహర్‌నాయక్, హోంగార్డు దేవేంద్ర లు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆటో లేకపోవడంతో అటవీ ప్రాంతంలోని చెట్లపొదల మధ్య నుంచి అనుమానాస్పదంగా వస్తూ ఎదురుపడిన మణికంఠ అలియాస్ సంపత్, కాశీలను ఎవరని ప్రశ్నించారు.

    వారు సమాధానం చెప్పకుండా పరుగులు తీశారు. అనుమానం వచ్చి పోలీసులు వారిని వెంబడించారు. అటవీ ప్రాంతంలోనికి వెళ్లగానే హోంగార్డు దేవేంద్రపై తిరగబడి దాడి చేసి కత్తితో పొడిచారు. దాడి విషయాన్ని గుర్తించిన కానిస్టేబుల్ జవహర్‌నాయక్ నిందితులను ఎదిరిం చే ప్రయత్నం చేశాడు. దుండగులు అతన్నీ కత్తితో పొడిచేశారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా ఇద్దరి గొంతులపై కాలితో నొక్కిపెట్టి ఊపిరాడకుండా చంపేసినట్లు నిందితులు అంగీకరించారు.
     
    ఇలాంటి ఘటనలు మరెన్నో
     
    ముఠా నాయకుడు వళ్లెయన్ మణికంఠ అలియాస్ సంపత్ (29). 16వ ఏట నుంచి దొంగతనాలు, దోపిడీలు చేయడానికి అలవాటు పడ్డాడు. గతంలో పోలీసులకు చిక్కి పదేళ్ల పాటు సేలంలో జైలు శిక్ష అనుభవించాడు. జైలులో ప్రేమ్, కాశీలతో కలిశాడు. అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన రామిరెడ్డితో కలిసి 2012 డిసెంబర్‌లో పలమనేరు మండలంలోని క్యాటిల్‌ఫారమ్ వద్దకు వచ్చి సతీష్ వద్ద షెల్టర్ తీసుకున్నారు. అక్కడి నుంచి బెరైడ్డిపల్లె పరిధిలోని కైగల్ జలపాతం, బోయకొండ, చంద్రగిరి, భాకరాపేట, పెనుమూరు, బంగారుపాళెం, వి.కోట మండలం అన్నవరం ఒంటిల్లు, కోలార్ హైవే, ధర్మపురి వద్ద బొమ్మిడి, కాణిపాకం సమీపంలో చిగరపల్లె, తవణంపల్లె మండలం గొల్లపల్లె తదితర ప్రాంతాల్లోని అటవీ పరిసర ప్రాంతాలు, ఇళ్లల్లో దొంగతనాలు, రాబ రీలు, ప్రేమజంటలపై దాడులు, అత్యాచారాలు లెక్కలేనన్ని చేశారు.

    ఇలాంటి ఘటనలపై 30 కేసులు నమోదయ్యా యి. ఇందులో వెలుగులోకి రానివి, బయటకు చెప్పుకోలేనివి 50కి పైగా ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులను ఛేదించడానికి ఏఎస్పీ, డీఎస్పీలతో పాటు సీఐలు బాలయ్య, చంద్రశేఖర్, శ్రీకాంత్, వంశీధర్‌గౌడ్, రాజగోపాల్‌రెడ్డి, రుషికేశవ్, ఎస్‌ఐలు శివప్రసాద్‌రెడ్డి, తేజోమూర్తి, మునస్వామి, లక్ష్మీనారాయణ, వాసంతీలను ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులను అందించడానికి డీఐజీకి ప్రతిపాదనలు పంపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement