కానిస్టేబుల్‌పై ఇనపరాడ్డుతో దాడి
Published Sat, Aug 10 2013 2:21 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
పెరవలి, న్యూస్‌లైన్ : పెరవలి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై గురువారం అర్థరాత్రి ఒంటిగంటకు ఓ ఫిర్యాదీ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వివరాలు ఇవి.. కాపవరం గ్రామానికి చెందిన మేడిద ముత్యాలరావు(50) ఇంట్లో భార్య, కుమారుడితో గొడవ పడి గురువారం రాత్రి 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తన భార్య, కుమారుడు తనను చంపేయడానికి ప్రయత్నిస్తున్నారని, వెంటనే చర్య తీసుకోమని కోరాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎ.మోహన్‌రావు ఫిర్యాదు రాసివ్వమని కాగితం ఇచ్చాడు.
ఇంతలో అతని భార్య, కుమారుడు స్టేషన్‌కు వచ్చి ముత్యాలరావు తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, రక్షణ కల్పించమని కోరారు. వారికి కూడా ఫిర్యాదు రాసిఇవ్వమని కాగితం ఇచ్చాడు మోహనరావు. తాము చదువుకోలేదని ఫిర్యాదు రేపు ఇస్తామని చెప్పి వారు వెళ్లిపోయారు. ముత్యాలరావు మాత్రం కాగితం మీద సంతకం పెడుతున్నానని, నీ ఇష్టం వచ్చింది రాసుకుని వారిపై చర్య తీసుకోమని కానిస్టేబుల్‌కు చెప్పాడు. రేపు ఉదయం రమ్మని అతనికి నచ్చజెప్పి పంపేశాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ముత్యాలరావు ఇనుపరాడ్డుతో స్టేషన్‌కు వచ్చాడు. మళ్లీ ఎందుకు వచ్చావని మోహనరావు ప్రశ్నించగా ఇందాక ఇచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకోలేదేంటి? నువ్వేం చేస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అని హెచ్చరించాడు. అదే సమయంలో ఫోన్ రావడంతో మోహనరావు ఫోన్ మాట్లాడుతుండగా తలుపు తీసుకుని వచ్చిన ముత్యాలరావు ఇనుపరాడ్డుతో అతని తలపై కొట్టబోయాడు. మోహనరావు పక్కకు తప్పుకోవటంతో ఆ దెబ్బ భుజంపై పడింది.
రెండో దెబ్బ వేస్తుండగా చేతిని అడ్డుపెట్టుకోవటంతో చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ముక్కలైంది. మూడోసారి వేసినప్పుడు ఇనుపరాడ్డును పట్టుకున్నాడు. ఈ గలాటాకు స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంట్లో వ్యక్తి స్టేషన్‌కు వెళ్ళగా కానిస్టేబుల్ ఎస్సైకి ఫోన్ చేయమని చెప్పడంతో అతను ఫోన్ చేశాడు. గస్తీకి వెళ్ళిన ఎస్సై ఎంవీఎస్‌ఎస్ మూర్తి వెంటనే స్టేషన్‌కు వచ్చి ముత్యాలరావును పట్టుకొనే లోపు అంద ర్ని నెట్టేసి అతను పారిపోయాడు. మోహన్‌రావును వెంటనే ప్రభుత్వాసపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి కేసు నమోదుచేశామని ఎస్సై తెలిపారు. మోహన్‌రావు యువకుడు, బలిష్టంగా ఉండటం వల్ల ఇనుపరాడ్డు దెబ్బలకు తట్టుకోగలిగాడని, తలపై తగిలి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదోనని చెప్పారు.
Advertisement