
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో పదవులను త్యజించి ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్‌సీపీ ఎంపీలకు జిల్లా వ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షలను ఏర్పాటు చేసి.. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని నినదించారు. విద్యార్థులు, యువకులు, న్యాయవాదులు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు ప్రకటించారు. సీపీఎంతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు కూడా మద్దతు తెలిపారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన దీక్షలు సాయంత్రం మానవహారాలతో ముగిశాయి.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలులోని ధర్నాచౌక్ (శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద)లో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఈ శిబిరంలో హఫీజ్‌ఖాన్, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డితో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ..ఎంపీల త్యాగాలను వృథాగా పోనివ్వబోమన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాల మూలంగానే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోందన్నారు. ఓటుకు నోట్లు కేసు, అమరావతి, పోలవరం, పట్టిసీమల్లో జరిగిన అవినీతికి భయపడిన చంద్రబాబు..రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని దుయ్యబట్టారు.
♦ ప్రత్యేక హోదాపై పలుమార్లు యూటర్న్ తీసుకున్న ముఖ్యమంత్రి దమ్ముంటే ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ దీక్షలకు సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఆ పార్టీ నాయకులు నిర్మలమ్మ, గౌస్ దేశాయ్ మద్దతు ప్రకటించారు. టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశాయని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, నాయకులు రెహమాన్, రాఘవేంద్రారెడ్డి, మాలిక్ కరుణాకరరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
♦ ఆత్మకూరులోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో సంఘీభావ దీక్షలను వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. దీక్షలో కౌన్సిలర్లు లాలు, తిమ్మోతి, రాజగోపాల్,నజీర్, కరీముల్లా కూర్చొన్నారు. వీరికి పలు పాఠశాలల విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాన్ని ఆపబోమని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని విమర్శించారు. తమ పార్టీ అధినేత మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగానే ఎంపీల రాజీనామా, దీక్షలకు పూనుకున్నట్లు చెప్పారు.
♦ ఆలూరులో దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే గుమ్మ నూ రు జయరాం ప్రారంభించారు. సీపీఎం నాయకులు నారాయణ, సత్యనారాయణ, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు షాకీర్, మైనా మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం అసమర్థతతోనే ఏపీకి ప్రత్యేక హోదా రావడంలేదన్నారు. సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు.
♦ నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే ఐజయ్య ప్రారంభించారు. విద్యార్థులు మద్దతు తెలిపారు. ఐజయ్య మాట్లాడుతూ ఎంపీల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే మోదీ, చంద్రబాబులదే బాధ్యత అన్నారు. కేంద్రం వెంటనే స్పందించి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.
♦ పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలులోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో పాటు నాయకులు దేవపూజ ధనుంజయాచారి, రాజేంద్ర ప్రసాద్‌నాయుడు, బెల్లం మహేశ్వరరెడ్డి, సురేంద్రనాథరెడ్డి, ఫిరోజ్, సులోచన, ఉమాబాయి, షబీయా, వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరావు, దొడ్డిపాడు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
♦ ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో గంగుల బిజేంద్రారెడ్డి(నాని) ఆధ్వర్యంలో సంఘీభావ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు పలువురు దివ్యాంగులు మద్దతు తెలిపారు.
♦ డోన్ పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి, బుగ్గన నాగభూషణ్‌రెడ్డి, ముర్తుజావలి, గౌసియా బేగం కూర్చొన్నారు.
♦ నంద్యాలలోని టెక్కె శిల్పా సహకార్ సమీపంలో నిర్వహించిన సంఘీభావ దీక్షలో వైఎస్సార్‌సీపీ నేత శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, నాయకులు రామలిం గారెడ్డి, ఇషాక్‌బాషా, హబీబుల్లా కూర్చున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు.
♦ పత్తికొండలో చేపట్టిన సంఘీభావ దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. దీక్షలో కూర్చున్న వారికి సాయంత్రం కేడీసీసీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
♦ ఆదోనిలో చేపట్టిన రిలే దీక్షలో పదిమంది వైఎస్సార్‌సీపీ నాయకులు కూర్చున్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాల్‌రెడ్డి ధ్రుతరాష్ట్రుడి వేషధారణలో ఆకట్టుకున్నారు. సీఎం చంద్రబాబు కళ్లుండి చూడలేని కబోదని, అందుకే ఇలా నిరసన తెలుపుతున్నానని గోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ దీక్షలకు సాయంత్రం కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య సంఘీభావం ప్రకటించారు.
♦ ఎమ్మిగనూరులో చేపట్టిన రిలే దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు కూర్చున్నారు. వీరికి పలువురు విద్యార్థులు, యువకులు మద్దతు తెలిపారు. సాయంత్రం బీవై రామయ్య దీక్ష విరమింపజేశారు.
♦ కోడుమూరు పాతబస్టాండ్‌లో ఏర్పాటు చేసిన దీక్షలో సమన్వయకర్త మురళీకృష్ణ పాల్గొనగా.. పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment