
సాక్షి, అమరావతి: రాజధానిలో ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సముదాయాల కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలకు అప్పగించింది. ఈ విషయాన్ని బుధవారం సచివాలయంలో నిర్వహించిన సీఆర్‌డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆరు నెలల్లోగా ఈ గృహ సముదాయ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గృహ సముదాయాల నిర్మాణానికి గతంలో రూ.1991 కోట్లు మంజూరు చేయగా, ఇపుడు ఆ మొత్తాన్ని రూ.2652 కోట్లకు పెంచడానికి ఆమోదం తెలిపారు.
ఎమ్మెల్యేలకు, అఖిల భారత సర్వీసు అధికారులకు ఒక్కో ప్లాటు 3500 చదరపు అడుగుల చొప్పున 18 టవర్లను నిర్మిస్తారు. నాన్ గెజిటెడ్ అధికారులకు ఒక్కోప్లాటు 1200 చదరపు అడుగుల చొప్పున 22 టవర్లు, ఒకటవ రకం గెజిటెడ్ ఆఫీసర్లకు 1800 చదరపు అడుగుల చొప్పున ఎనిమిది టవర్లు, రెండో రకం గెజిటెడ్ అధికారులకు 1500 చదరపు అడుగుల చొప్పున ఏడు టవర్లు, నాలుగవ తరగతి ఉద్యోగులకు 900 చదరపు అడుగుల చొప్పున ఆరు టవర్లను నిర్మించనున్నారు.
ముఖ్య నిర్ణయాలు ఇవే..
- గోల్ఫ్ కోర్సుకు రాజధానిలో 70 ఎకరాలు కేటాయింపు హా అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఎనిమిది జాతీయ, అంతర్జాతీయ స్కూళ్లకు 32 ఎకరాలు..
- రైతులను సింగపూర్ తీసుకువెళ్లేందుకు లాటరీ ద్వారా 100 మందిని సీఆర్‌డీఏ ఎంపిక చేసింది. మరో 23 మంది రైతులు మిగిలిపోయారు. ఆ రైతులను సింగపూర్ తీసుకువెళ్లాలని సీఎం సూచించారు.
కాగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల డిజైన్లు ఖరారు చేయడానికి తాను లండన్ వెళ్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన పర్యటన అనంతరం సీఎం కూడా వెళ్తారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment