
కొలతల సాకుతో కోత
యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించాలని చెబుతున్న అధికారులు బిల్లుల చెల్లింపుల్లో కొలతల సాకుతో తగ్గించేస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రేషన్‌కు లింకుపెట్టడంతో అప్పోసప్పో చేసి ఏదోరకంగా పనులు చేపట్టిన లబ్ధిదారులు కోతతోపాటు సకాలంలో బిల్లులందక నష్టపోతున్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు చెల్లించడం లేదని వారు వాపోతున్నారు.
- రూ.15 వేలకు రూ.12 వేలు మంజూరు
- కుంటిసాకులతో తగ్గిస్తున్న అధికారులు
- అయోమయంలో మరుగుదొడ్ల లబ్ధిదారులు
- ముందుకు సాగని నిర్మాణాలు
నర్సీపట్నం: నర్సీపట్నం సబ్ డివిజన్‌లో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకను తలపిస్తోంది. నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని అధికారులు చెబుతున్నా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలను చైతన్యవంతులను చేసి మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని సమీక్ష సమావేశాల్లో దిగువస్థాయి సిబ్బందిని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు.
వీరిబాధ పడలేక ఏదోరకంగా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేపట్టేలా సిబ్బంది తమ వంతు ప్రయత్నంచ చేస్తున్నారు. ఏదోరకంగా నిర్మాణం పూర్తిచేసినప్పటికీ బిల్లుల చెల్లింపుల్లో కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు నరకం చూపిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
నర్సీపట్నం సబ్‌డివిజన్‌లో...
నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాల్లో ఎటువంటి పురోగతి కనిపించటం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 వేలు ప్రకటించింది. ఆచరణలోకి వచ్చే సరికి లబ్ధిదారుడికి రూ.12 వేలు మాత్రమే అధికాారులు చెల్లిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే నిర్మాణంలో కొలతలు పాటించడం లేదని రూ. 3 వేలు తగ్గించాల్సి వచ్చిందని అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
లక్ష్యంపై ప్రభావం చూపిస్తున్నా..
ప్రభుత్వం విధించిన లక్ష్యంపై ప్రభావం చూపిస్తున్నా అధికారుల తీరు మారడం లేదన్న విమర్శలున్నాయి. నర్సీపట్నం మండలానికి 3,999 మరుగుదొడ్లు మంజూరు కాగా 110 పూర్తయ్యాయి. 350 వివిధ దశల్లో ఉన్నాయి. మాకవరపాలెం మండలంలో 6,882 గాను 81 మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. గొలుగొండ 8092 మరుగుదొడ్లుకు 429 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. నాతవరం మండలంలో 9217 మరుగుదొడ్లుకు 460 మాత్రమే ప్రారంభించారు. ఇప్పటివరకు 330 మంది మరుగుదొడ్లు పూర్తి చేసినా వీరిలో చాలామందికి బిల్లులు చెల్లించలేదు. దీంతో నిరుత్సాహం చెందిన చాలా మంది లబ్ధిదారులు నిర్మాణాలను మధ్యస్తంగా నిలిపివేశారు.
బిల్లు అందలేదు
మరుగుదొడ్డు నిర్మాణం పూర్తి చేసినా బిల్లు మంజూరు కాలేదు. అధికారులను అడుగుతుంటే అదిగో..ఇదిగో అంటూ తిప్పుతున్నారు. నిర్మాణం పూర్తిచేస్తే వెంటనే బిల్లులు చెల్లిస్తామని అధికారుల చెప్పడంలో వాస్తవం లేదు.
- రావాడ మణి, లబ్ధిదారు, చెట్టుపల్లి
బిల్లులు వెంటనే చెల్లిస్తాం
నిర్మాణాలు పూర్తి చేసిన వారికి బిల్లులు వెంటనే ఇవ్వాలని ఏఈలకు ఆదేశాలు ఇచ్చాం. బిల్లుల్లో జాప్యం జరుగుతున్నట్టు నా దృష్టికి రాలేదు. ఇకనుంచి బిల్లులు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకుంటాం.
-చంద్రశేఖరరావు, డీఈ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం