‘‘ఈ ఫొటోలో కన్పిస్తోన్న వ్యక్తిపేరు ఓబుళపతి(38). కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని కంబదూరు మండలం మంద గ్రామ వాసి. గ్రామంలో ఉపాధి లేకపోవడంతో 8 నెలల కిందట బెంగళూరుకు వలసెళ్లారు. అక్కడ భవననిర్మాణ పనులు చేస్తూ అతనితో పాటు అతని భార్య రాములమ్మ అక్కడే బతుకుతున్నారు. శుక్రవారం సాయంత్రం కంకర మిషన్ వద్ద పనిచేసేవాడు. అమ్మా, నాన్నలతో మాట్లాడేందుకు పిల్లలు ఫోన్ చేశారు. ఫోన్‌లో మాట్లాడుతుండగా సెల్‌ఫోన్ జారి కంకర మిషన్‌లో పడింది. ఫోన్ తీసుకునే క్రమంలో జారి అందులో పడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఓబుళపతి మృతితో ఇతని భార్యతో పాటు ముగ్గురు పిల్లలు అనాథలైపోయారు.’’
సాక్షిప్రతినిధి, అనంతపురం : బతికేందుకు ‘ఉపాధి’లేక పొట్టకూటికోసం వలస వెళితే అక్కడ టెంట్లకింద, ఇరుకు గదుల్లో బతుకుతూ, దొరికింది తింటూ అనారోగ్యంపాలై ‘అనంత’ వాసులు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాభావంతో గతేడాది ఖరీఫ్ రైతన్నను కుంగదీసింది. వర్షాలు లేక జిల్లాలో 7.69లక్షల హెక్టార్లకు గాను 5.06లక్షల హెక్టార్లలోనే వేరుశనగ సాగైంది. అది కూడా పూర్తిగా ఎండిపోయిందని వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు. ప్రభుత్వం జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందంటేనే కరువు ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. ఈ స్థితిలో అప్పులను తీర్చేందుకు రైతులు, రైతుకూలీలు బతికేందుకు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వలసెళ్లారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 లక్షల కుటుంబాలు వలసెళ్లినట్లు పలు స్వచ్ఛందసంస్థలు తేల్చాయి. వలసపోలేక, అప్పులు తీర్చే మార్గం లేక చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ 65మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే క్రమంలో వలసెళ్లిన వారు కూడా మృత్యువాతపడుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
‘‘ఇదిగో ఈ పడిపోయిన మట్టిగోడల ఇంటి ముందు దిగాలుగా కూర్చున్న వారంతా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలోని పెద్ద నింగప్ప కుటుంబసభ్యులు. వీరికి సెంటు భూమి లేదు. బతికేందుకు ఊళ్లో పనిలేదు. దీంతో ఇంటిల్లిపాది బెంగళూరుకు వలసెళ్లారు. అక్కడ భవననిర్మాణ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి ఇంటికి రావాలనుకున్నారు. భోగిపండుగ రోజు నింగప్ప బెంగళూరులో అనారోగ్యంతో చనిపోయాడు. సంబరంగా సంక్రాంతికి సొంతూరు వచ్చి పండుగ చేసుకోవల్సిన నింగప్ప నలుగురు కుమారులు నాన్న శవాన్ని మోసుకుని ఊరికి వచ్చారు. ఊరంతా పండుగ చేసుకుంటే వారు మాత్రం నాన్న చావును తలుచుకుంటూ కుమిలిపోయారు.’’
వలస ‘చావులు’!
Published Sun, Apr 19 2015 2:28 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement