సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రాంతానికి జీవనాడి అయిన ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టును సర్కారు అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. చాలీచాలని నిధుల కేటాయింపులతో పను లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పోలవ రం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించి సత్వరమే పూర్తి చేస్తామని ప్రకటించిన కేం ద్రం ఈ ప్రాజెక్టు విషయంపై ఏమీ మాట్లాడక పోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కే విధంగా కృషి చేస్తామని గొప్పలు చెప్పిన సర్కారు ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన కేంద్రం పోలవరం ప్రాజెక్టుపై అమిత ప్రేమను ఒలుకబోసి ‘ప్రాణహిత’పై వివక్ష చూపటంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. సొరంగ మార్గం, రిజర్వాయర్లకు సంబంధించి న పలు పనులు మందకొడిగా సాగుతున్నాయి. జాతీయ హోదా లభిస్తే తప్ప పనులకు ముందడుగు పడే అవకాశం కనిపించడం లేదు.
ఇదీ పరిస్థితి
2012 నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, బాలారిష్టాలను దాటలేదు. తెలంగాణ బీడు భూముల నోళ్లు తడపవల్సిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి, పలు ఏజెన్సీలకు అప్పగించారు. ఐదేళ్లు పూర్తి అవుతున్నా, కొన్ని ప్యాకేజీల్లో ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం సర్కారు చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో ఉన్న 275 గ్రామాలకు సాగునీరు అందించడానికి మూడు ప్యాకేజీలకు రూపకల్పన చేశారు. ఇందుకోసం రూ.3,483 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఇందూరులో ఇలా..
జిల్లాలోని నవీపేట మండలం బినోల గ్రామం వద్ద అప్రోచ్ కాలువ తవ్వకంతో పాటు సొరంగమార్గం పనులు ఏడాది క్రితం ప్రారంభమయ్యాయి. 17 కిలోమీటర్ల సొరంగమార్గం పనులకుగానూ ఇప్పటి వరకు కిలోమీటర్ వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. నిజామాబాద్ మండలం మంచిప్పలో సొరంగమార్గం, సారంగాపూర్ వద్ద పంపుహౌస్, కొడెంచెరువు వద్ద రిజర్వాయర్ పనులను ప్రారంభించినప్పటికి మొక్కుబడిగా సాగుతున్నాయి. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి వద్ద పనులు ఇ ప్పుడిప్పుడే మొదలు పెట్టారు. నిధుల కొరత కారణంగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. బోధన్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో పాటు పూర్థి స్థాయిలో నిధులు విడుదలయ్యే విధంగా కృషి చేస్తానని ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది.
ప్యాకేజీ పనులు ఇలా..
20వ ప్యాకేజీ పనులకు రూ. 892 కోట్లు అవసరం కాగా ఇప్పటివరకు రూ. 38.90 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. 492 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా 472 ఎకరాలు మాత్రమే సేకరించారు. 21వ ప్యాకేజీ పనులకు రూ.1,143 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.25.03 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 22వ ప్యాకేజీ పనుల కోసం రూ. 1,446 కోట్లు అంచనా వేయగా రూ.51.62 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ. 3,483 కోట్ల పనులకుగాను రూ. 115.55 కోట్ల విలువ చేసే పనులు మాత్రమే జరిగాయంటే ఎంత మందకొడిగా పనులు సాగుతున్నాయే అర్థమవుతుంది. మూడు ప్యాకేజీల పనులు 2012 నాటికే పూర్తి కావల్సినప్పటికిని ఏటా పొడిగిస్తూ వస్తున్నారు. 20, 21వ ప్యాకేజీల పరిధిలో నిజామా బాద్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మాక్లూర్, సిరికొండ, వేల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఆర్మూర్, బాల్కొండ (నిజామాబాద్), మెట్‌పల్లి (కరీంనగర్), 22వ ప్యాకేజీ పరిధిలో గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్, కామారెడ్డి, భిక్కనూర్, మాచారెడ్డి, దోమకొండ (నిజామాబాద్), రామాయంపేట (మెదక్) మండలాలు వస్తాయి.
సాగుతున్న ‘ప్రాణహిత’
Published Wed, Aug 14 2013 6:42 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement