‘పోలవరం’ ముంపుపై నేడు సుప్రీంలో విచారణ  | Supreme Court Trial On Polavaram | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 2 2018 4:34 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

Supreme Court Trial On Polavaram  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో తమ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందంటూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో తెలంగాణను కక్షిదారుగా చేర్చడంతో ముంపు సమస్యలపై తన వాదనలు వినిపించనుంది. జస్టిస్‌ లోకూర్‌తో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌పై విచారణ జరగనుండగా తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల గడువు ముగిసిందని, దీంతో కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని, అలాగే ప్రాజెక్టుతో తమ ప్రాంతంలో ముంపు ఎక్కువ ఉన్న దృష్ట్యా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని ఒడిశా సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీనిపై గతంలో విచారించిన సుప్రీం.. అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ఒడిశా, తెలంగాణలను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ అఫిడవిట్‌ సమర్పించింది. పోలవరం ప్రాజెక్టును 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే చేపట్టారని, కానీ ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కులకు పెంచారని తెలిపింది. గరిష్ట వరద ప్రవాహాల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటూ బ్యాక్‌వాటర్‌పై అధ్యయనం చేశారా.. తెలంగాణపై పడే ముంపు ప్రభావాన్ని కేంద్రం అధ్యయనం చేసిందా అన్న అంశాలపై ప్రశ్నలు లేవనెత్తింది. 1980 బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం బ్యాక్‌వాటర్‌ను సముద్రమట్టానికి 140 అడుగుల కన్నా తక్కువకే ఉంచేలా ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉందని, కానీ పోలవరం 150 అడుగుల కన్నా ఎక్కువగా నిర్మిస్తే ముంపు తీవ్రత పెరిగే అవకాశముందని తెలిపింది. 50 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చిన నేపథ్యంలో భద్రాచలం రామాలయానికి ముంపు ముప్పు పొంచి ఉందని, బొగ్గు నిక్షేపాలు, మణుగూరులోని మినరల్‌ ప్లాంట్‌ సైతం ముంపునకు గురవుతాయని పేర్కొంది. వీటిపై ఎలాంటి అధ్యయనంజరగలేదని స్పష్టం చేసింది. 

ఇప్పటికే తెలంగాణతో చర్చించిన ఒడిశా.. 
ఏపీ చేపట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ రాష్ట్రాలకు కలుగుతున్న ముంపుపై కలసి పోరాడుదామని ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణకు విన్నవించింది. ఈ ఏడాది జూన్‌ 5న ఒడిశా జల వనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీకే జెనా, చీఫ్‌ ఇంజనీర్‌ జీపీ రాయ్‌లు హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ముంపుపై పోరాడుతున్న తమతో కలసిరావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రాన్ని కదిలిస్తేనే పోలవరం ముంపుపై రీ సర్వేకు అవకాశముందని, అది జరిగితే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణకు ప్రశ్నించే హక్కుందా?
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం నిర్మాణంపై అభ్యంతరాలు చెబుతూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని విచారణాంశంగా ప్రతిపాదించింది. ఒడిశా ప్రభుత్వం 2007లో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న సంగతి తెలిసిందే. నదీ పరీవాహకం పరిధిలోని రాష్ట్రాలు, కేంద్రం ఈ వ్యాజ్యం లో విచారించదగిన అంశాలను విడివిడిగా ప్రతిపాదించాలని ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో బుధవారం ఏపీ 11 విచారణాంశాలను ప్రతిపాదించింది. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించగలుగుతుందా అని ఆ విచారణాంశాల్లో పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement