► ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణకు మంగళం
► ఎన్నికల హామీని తుంగలో తొక్కిన బాబు సర్కారు
► ఉపసంఘం పేరుతో మూడేళ్ల కాలయాపన
► తీరా కుదరదంటూ చేతులెత్తేసిన సర్కారు
► జిల్లాలో ప్రశ్నార్థకంగా 24 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంట్రాక్టు ఉద్యోగులను బాబు సర్కారు వంచించింది. అధికారంలోకి వస్తూనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారు. ఉపసంఘం పేరుతో మూడేళ్లు కాలయాపన చేసి న్యాయపరమైన చిక్కుల సాకు చూపి ఇప్పుడు క్రమబద్ధీకరణ కుదరదంటూ చేతులెత్తేశారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఒక వైపు తెలంగాణ సర్కారు ఎన్నికల హామీని అమలు చేస్తుండగా ఇక్కడ చంద్రబాబు మాత్రం హామీని తుంగలో తొక్కి వంచనకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగులు 8500కు పైగా ఉన్నారు. ఇక స్కీమ్ వర్కర్ల పరిధిలో మధ్యాహ్న భోజనం, గ్రామసమాఖ్యలు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, ఆయూష్, క్షయ వ్యాధి, అర్బన్ హెల్త్ సెంటర్లు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, రైతుబజార్ తదితర విభాగాల్లో 17 వేల మంది వరకు కాంట్రాక్టు వర్కర్లు పనిచేస్తున్నారు. మొత్తంగా జిల్లాలో 25 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు, వర్కర్లు పనిచేస్తున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. బాబు మాటలు నమ్మి ఉద్యోగులు, కార్మికులు ఓట్లేశారు. గద్దెనెక్కాక బాబు ఎన్నికల హామీని మరిచారు. కాలయాపన కోసం 2014, సెప్టెంబర్ 9న మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. 11 మార్లు సమావేశమైన ఉపసంఘం చివరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించలేమని తేల్చి చెప్పింది.
ఇందుకు న్యాయపరమైన చిక్కులు అంటూ సాకు చూపి ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటే... చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగానే హామీని నెరవేర్చక వంచించిందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
వైఎస్ హయాంలో క్రమబద్ధీకరణ
దివంగత వైఎస్ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది. 2007 ఆగస్టు 10న జీవో ఎంఎస్ నెం.89 విడుదల చేసి సాంఘిక సంక్షేమశాఖలో ఉన్న కాంట్రాక్టు టీచర్లను క్రమబద్ధీకరించారు. 2009 జూన్ 19న మరో జీవో నెం.128 విడుదల చేసి వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఎంపీహెచ్‌ఎలను క్రమబద్ధీకరించారు. 2009, జులై 24న జీవో నెం.84 విడుదల చేసి స్కూలు ఎడ్యుకేషన్ విభాగంలో పని చేస్తున్న పార్ట్‌టైం ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్చర్లను క్రమబద్ధీకరించారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వంచించిన బాబు
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సీఎం చంద్రబాబు వంచించారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని చెప్పి తరువాత వారి ఊసే ఎత్తలేదు. పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వరుసపెట్టి తొలగిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేది లేదని ప్రకటించడం దారుణం. పైగా 10వ పీఆర్‌సీ ప్రకారం 104 శాతం జీతం పెంచాల్సి ఉంటే, కేవలం 50 శాతం మాత్రమే పెంచారు. బాబు నిర్వాకం కారణంగా 64 శాతం జీతం కాంట్రాక్టు ఉద్యోగులు నష్టపోయారు. – ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి టి.మహేష్