పాలకొండ : పచ్చ కాంట్రాక్టర్లకు పనుల పందేరానికి ప్రభుత్వం గేట్లు తెరవడంతో జిల్లాలో టీడీపీ నేతలు, సీనియర్ కార్యకర్తలు పనులు దక్కించుకొని కాసులు దండుకునేందుకు ఉబలాటపడుతున్నారు. పురపాలక సంఘాల్లో రూ.5 లక్షల వరకు పనులను టెండర్లతో పని లేకుండా నామినేషన్ పద్ధతిలో కేటాయించే వెసులుబాటు కల్పిస్తూ మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనిలో పనిగా ఈ పనులను కేటాయించే అధికారాన్ని టీడీపీ నేతలకు కల్పించింది. ఫలితంగా మున్సిపాలిటీల్లో చేపట్టే అభివృద్ధి పనులపై ‘పచ్చ’ ముద్ర స్పష్టంగా కనిపించనుంది. ఈ నిర్ణయాన్ని సొమ్ము చేసుకునేందుకు అప్పుడే నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలతోపాటు రాజాం, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి.
ఇప్పటివరకు వీటి పరిధిలో అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేపట్టడానికి ఈ-టెండర్ ప్రక్రియ నిర్వహించేవారు. గ్రేడ్-1 కాంట్రాక్టర్లు మాత్రమే ఇందులో పాల్గొని పోటీ పడి టెండర్లు దక్కించుకోవాల్సి వచ్చేది. దీంతో అధికార పార్టీ నేతలు, వారి అనుయాయులు పనులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బినామీలను కాంట్రాక్టర్లుగా రంగంలోకి దించినా నిధులు వెనకేసుకొనేందుకు పెద్దగా అవకాశం దొరికేది కాదు. దీంతో పలుమార్లు మున్సిపాలిటీల్లో పనులు పొందేందుకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తేవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పార్టీ ప్రయోజనాల పేరిట తమ పార్టీ నేతలకు మార్గం సుగమం చేసింది.
దీనిలో భాగంగానే మూడు రోజుల కిందట రూ.5 లక్షల వరకు పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించుకొనే అవకాశాన్ని మున్సిపాలిటీలకు కల్పించించింది. అక్కడితో ఆగకుండా పనులను కేటాయించే అవకాశాన్ని తెలుగు తమ్ముళ్ల చేతికి అప్పగించింది. జీవో జారీ కావడమే ఆలస్యం.. జిల్లాలో నాయకుల హడావుడి మొదలైంది. చేపట్టాల్సిన పనులు ఏం ఉన్నాయి.. వాటిని ఎలా దక్కించుకోవాలి.. పోటీ ఎక్కువగా ఉన్న చోట పనులు ఎలా పంచుకోవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా తాజా ఉత్తర్వుల వల్ల పనుల్లో పర్యవేక్షణ, నాణ్యత దెబ్బతింటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పనులు పారదర్శకంగా జరిగేవని, కొత్త విధానంతో అవినీతి పెరుగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కార్యకర్తల లబ్ధికోసమే ఈ విధానాన్ని ప్రకటించినా మున్సిపాలిటీల స్థాయిలో వర్గపోరు మొదలవుతుందని పలువురు టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక పచ్చపాలికలు!
Published Sun, Jan 11 2015 3:13 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement