డోన్‌టౌన్, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో సిబ్బంది మధ్య సమన్వయ లోపానికి ఓ నిండు ప్రాణం బలైంది. పట్టణంలోని కోట్రికె పెట్రోల్ బంకు వద్ద మంగళవారం ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కిన కాంట్రాక్టు కార్మికుడు ఇదూర్‌బాష(28) మృత్యువాత పడ్డాడు. పట్టణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో విద్యుత్‌స్తంభాలకు మరమ్మతు చేసే సమయంలో లైనమన్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కోట్రికే పెట్రోల్ బంకు వద్ద ఉన్న విద్యుత్ స్తంభం ఏబీ స్విచ్ మరమ్మతుల కోసం లైన్‌మెన్ గోవిందు ఆధ్వర్యంలో ఇదూర్‌బాష, మల్లికార్జున స్తంభం ఎక్కారు. నగరేశ్వరాలయం వద్ద డ్రిస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌సరఫరాను అందించేందుకు మరోలైన్‌మెన్ నాగేశ్వరయ్య విధులు నిర్వహిస్తూ మరమ్మతులు చేపట్టారు. ముందుగా నాగేశ్వరయ్య స్థానిక సబ్‌స్టేషన్‌లో 11.38 నిమిషాలకు ఎల్‌సీ లైన్‌క్లియర్ (సరఫరా నిలిపివేతకు అనుమతి) తీసుకున్నాడు. ఇదే అనుమతిని లైన్‌మెన్ గోవిందుకు ఇవ్వడంతో రెండు ప్రాంతాలలో మరమ్మతులు ప్రారంభించారు.
నగరేశ్వరాలయం వద్ద పని త్వరగా పూర్తి కావడంతో మరో చోట మరమ్మతులు పూర్తి కాకుండా నాగేశ్వరయ్య ఎల్‌సీ తీసుకున్నాడు. వెంటనే విద్యుత్‌సరఫరా కావడంతో మరో చోట విద్యుత్ స్తంభంపై ఉన్న ఇదూర్‌బాష విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తీగలకు కొంచెం కింద ఉండటంతో మల్లికార్జున తృటిలో తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందకు దించారు. ప్రమాదాన్ని కళ్లారా చూసిన ప్రజలు భయాందోళన చెందారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.
మృతుడు ఈదుర్‌బాషకు నాలుగేళ్ల క్రితం స్థానిక చిగురుమానుపేటకు చెందిన హసీనాతో వివాహమైంది. ప్రస్తుతం ఈదుర్‌బాషకు మూడేళ్ల కుమారుడు నజీర్ ఉన్నాడు. కుటుంబ యజమాని మృతి చెందడంతో వారి రోదన పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఏడాదిలో రెండో ప్రమాదం: డోన్ పట్టణంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఇది రెండో సారి. మార్చి 23న కొండపేటలో విద్యుత్ స్తంభానికి మరమ్మతులు చేస్తూ హుస్సేన్ మృతి చెందాడు. తరుచూ ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులకు భద్రత కరువైందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిర్లక్ష్యపు సిబ్బందిపై కేసు నమోదు: మృతుడి భార్య హసీనా ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన సిబ్బందిపై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐమోహన్‌రెడ్డి తెలిపారు. లైన్‌మెన్ నాగేశ్వరయ్య, గోవిందు, నాగచంద్రుడులపై సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
విద్యుదాఘాతంతో కాంట్రాక్టు కార్మికుడి మృతి
Published Wed, Aug 28 2013 5:33 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement