సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన హై ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ స్కీం(హెచ్‌వీడీఎస్) అమలు అటకెక్కింది. 2009 జనవరిలో ప్రారంభమైన ఈ పథకం అమలు కాంట్రాక్టరు చేతులెత్తేయడంతో అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇదే పథకం కింద తాజాగా మరో రూ.100 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత అనుభవాల నేపథ్యంలో ప్రస్తుతం పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునికీకరించడం లక్ష్యంగా 2009 జనవరిలో రూ.47.49 కోట్లతో హెచ్‌వీడీఎస్ కింద పనులు ప్రతిపాదించారు. లో ఓల్టేజీ సమస్య నివారించి, సరఫరాలో విద్యుత్ నష్టాన్ని అరికట్టడం ఈ పథకం ఉద్దేశం. వదులుగా వున్న తీగలను, శిథిలావస్థలో వున్న స్తంభాలను సరిచేయడం, 25 కేవీ, 16 కేవీ సామర్థ్యమున్న ట్రాన్స్‌ఫార్మర్లు నెలకొల్పేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
సెంట్రల్ పవర్ డిస్కమ్ పరిధిలోని మెదక్ సర్కిల్‌లో 20 ఫీడర్ల పరిధిలో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. 100 కేవీ సామర్థ్యమున్న 589 ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో తక్కువ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. సర్కిల్ పరిధిలోని పనులన్నీ హైదరాబాద్‌కు చెందిన ఐసీఎస్‌ఏ అనే సంస్థకు టెండర్ ద్వారా అప్పగించారు. అయితే కాంట్రాక్టు సంస్థ 521 ట్రాన్స్‌ఫార్మర్లను మాత్రమే మార్చగలిగింది. రూ.41.49 కోట్లు ఖర్చు చేసినట్లు సీపీడీసీఎల్ అధికారులు చెప్తున్నారు. కాంట్రాక్టు సంస్థ అర్ధంతరంగా చేతులెత్తేయడంతో హెచ్‌వీడీఎస్ పనులు మెదక్ సర్కిల్ పరిధిలో నిలిచిపోయాయి. ‘షార్ట్ క్లోజింగ్’ పద్ధతిలో పనులు నిలిపివేసినట్లు కన్‌స్ట్రక్షన్ డీఈ రాజశేఖరం ‘సాక్షి’కి వెల్లడించారు. పనులు మధ్యలోనే వదిలేసి వెళ్లిన కాంట్రాక్టు సంస్థకు జరిమానా విధించే అధికారం కార్పొరేట్ ఆఫీసుకు మాత్రమే వుందని అధికారులు చెప్తున్నారు.
రూ.100 కోట్లతో ప్రతిపాదనలు...
గతంలో హెచ్‌వీడీఎస్‌ను సక్రమంగా అమలు చేయలేని అధికారులు తాజాగా ఇదే పథకం కింద రూ.100 కోట్లతో పనులు ప్రతిపాదించారు. జపాన్ ఆర్థిక సంస్థ(జికా) సహాయంతో మెదక్ సర్కిల్‌లో 85 ఫీడర్ల పరిధిలో ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం 1800కు పైగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. గతంలో సర్కిల్ అంతటికీ ఒకే కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయగా, ప్రస్తుతం ఒక్కో డివిజన్‌లో ఒక్కో సంస్థకు పనులు అప్పగించనున్నారు. ఇప్పటి వరకు మూడు డివిజన్ల పరిధిలో టెండర్ ద్వారా కాంట్రాక్టరును ఎంపిక చేసి లెటర్ ఆఫ్ ఇండెంట్(ఎల్‌ఓఐ) కూడా జారీ చేశారు. కాంట్రాక్టు దక్కిన సంస్థలు రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధన విధించారు.
గతంలో హెచ్‌వీడీఎస్‌ను అడ్డుపెట్టుకుని సంబంధిత అధికారులు, సిబ్బంది చేతి వాటం చూపినట్లు ఆరోపణలు వున్నాయి. రైతుల నుంచి డబ్బు వసూలు చేసి కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారని విమర్శలు వచ్చాయి. ఈ పథకం కింద మంజూరైన సామగ్రికి కూడా పూర్తి లెక్కలు కూడా లేవనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పనుల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చేతులెత్తేశారు!
Published Tue, Oct 22 2013 2:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
Advertisement
Advertisement