రహస్య సమావేశం ఎందుకు..? | contractors secreat meeting in ongole | Sakshi
Sakshi News home page

రహస్య సమావేశం ఎందుకు..?

Published Mon, Mar 14 2016 12:52 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

contractors secreat meeting in ongole

 సివిల్ వర్కుల్లో అధికార పార్టీ నేతల ఆగడాలు
 ప్రజా ధనానికి గండి కొట్టే ప్రయత్నం
 రూ.2 కోట్ల మేర నగర పాలకానికి నష్టం..?
 ఇంజినీరింగ్ అధికారులు, ఫైవ్‌మెన్ కమిటీ తెరవెనుక డెరైక్షన్
 రంగంలోకి అధికార పార్టీ కాంట్రాక్టర్లు


ఒంగోలు అర్బన్:  ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రాత్రి కాంట్రాక్టర్లు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ నెల 17వ తేదీ 170 పనులకి సంబంధించి రూ.11 కోట్ల టెండర్లు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు సమావేశం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. గతంలో కూడా ఇదే మొత్తానికి టెండర్లు నిర్వహించి భారీఎత్తున పర్సంటేజిలు ముందుగానే తీసుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసిన అధికార పార్టీ నేతలు, ఫైవ్‌మెన్ కమిటీ ప్రయత్నాలను ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ఈ ఏడాది జనవరి 1వ తేదీన హడావుడిగా రాత్రికిరాత్రే సాంకేతిక కారణాల పేరుతో టెండర్లు రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే ఫైవ్‌మెన్ కమిటీ ప్రజాధనంపై పెట్టుకున్న ఆశలు మాత్రం చావలేదు. దీంతో ఎన్నో రకాలుగా తమ కాంట్రాక్టర్లకు లెస్‌లు లేకుండా పనులు అప్పగించి కోట్లాది రూపాయలు స్వాహా చేసేందుకు ప్రయత్నాలు చే స్తూనే ఉన్నారు. దీనికి ఓఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తోడ్పాటు ఉండటంతో ఏదో విధంగా తమవారికే పనులు కేటాయించుకోవాలని అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.  ఎప్పటికప్పుడు ‘సాక్షి’ వారి ఆగడాలను   వెలుగులోకి తెస్తూనే ఉంది.

కార్పొరేషన్ ప్రత్యేక అధికారి అయిన  కలెక్టర్ కూడా టెండర్ల విషయంపై దృష్టి సారించకపోవడంతో అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అధికార పార్టీ వారిని కాదని ఎవరైనా ఇతర కాంట్రాక్టర్లు పోటీకి దిగితే వారికి ఇప్పటి వరకు రావాల్సిన బిల్లులను నిలుపుదల చేస్తామని ఇంజినీరింగ్ విభాగం అధికారులు హెచ్చరించడం పరిపాటి అయింది. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగం అడ్డగోలుగా వారికి ఇష్టమొచ్చిన వారికే పనులు ముందుగా కేటాయిస్తూ తర్వాత టెండర్లకు పిలవడం కూడా పలు మార్లు జరిగింది.  ఈ నేపథ్యంలో ఆదివారం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు సీన్‌లోకి రాకుండా తెరవెనుక ఉండి డెరైక్షన్ చేయడంతో వారికి సంబంధించిన కాంట్రాక్టర్లు రహస్యంగా సమావేశమై పనుల కేటాయింపుపై తర్జనభర్జనలు పడ్డారు. రూ.11 కోట్లకి సంబంధించి 170 పనులను డివిజన్ల వారీగా 5 పనుల లెక్కన ప్యాకేజిలుగా విడగొట్టారు.

ఒక్కో ప్యాకేజిలో 3 డ్రైన్లు, 2 రోడ్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాటిలో కూడా ఏదైనా డివిజన్‌లో ఎక్కువ మిగిలే పనులు ఉంటే వాటిని డ్రా పద్ధతిలో కేటాయించేలా చర్చలు జరిపారు. దీనికి సంబంధించి అధికార పార్టీ కమిటీకి డ్రైన్‌కు 5శాతం, రోడ్డుకి 6 శాతం లెక్కన పర్సటేంజ్‌లు ఇచ్చేలా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ మామూళ్లను టెండర్లు వేసేటపుడు ముందుగానే కమిటీ సభ్యులకి ముట్టచెప్పాలని అధికార పార్టీ మనుషులు కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేశారు. అయితే సదరు కాంట్రాక్టర్లు గత అనుభవం దృష్ట్యా ముందుగా డబ్బు ఇవ్వమని వర్క్ ఆర్డర్ చేతికి వచ్చాక మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
 
 
ఇవే పనులను జరగాల్సిన ప్రక్రియ ప్రకారం టెండర్లు వేస్తే దాదాపుగా 20 నుంచి 25 శాతం వరకు లెస్సుల రూపంలో నగర పాలకానికి రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అలా కాకుండా అధికార పార్టీకి తలొగ్గి 5,6 శాతం మామూళ్ల కోసం ఒక శాతం లోపు లెస్సులకి టెండర్లు వేయడం ద్వారా ప్రజాధనం దాదాపుగా రూ.1.50 కోట్లు అధికార పార్టీ కమిటీ సభ్యులు, వారి నాయకుడు, ఇంజినీరింగ్ విభాగం అధికారుల జేబుల్లోకి పోతుంది. ఈ నేపథ్యంలో ప్రజాధనం వృథా కాకుండా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ఇప్పటికైనా కార్పొరేషన్ ప్రత్యేక అధికారి  కలెక్టర్ టెండర్ల వ్యవహారంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement