అదుపులో శాంతిభద్రతలు
Published Wed, Jan 1 2014 3:26 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం(గుంటూరు),న్యూస్‌లైన్ :శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని రూరల్‌ఎస్పీ జె.సత్యనారాయణ మంగళవారం తెలిపారు. 2012తో పోల్చుకుంటే 2013లో అన్ని రకాల నేరాలు అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం నుంచి నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా మంగళవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, వృద్ధులు సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించే సిబ్బందిని అభినందించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు వేయడంలో వెనుకాడేది లేదని తెలిపారు. 2013లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,006 కేసులు నమోదయ్యాయన్నారు. బాధితులకు భరోసా కార్యక్రమం ద్వారా ఫ్యాక్షనిజం, నక్సలిజం, ప్రాణాం తక వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందజేశామన్నారు.
నేటి నుంచి....నూతన సంవత్సరం నుంచి ప్రజా సంబంధాలను పెంపొందించడంతోపాటు పటిష్టంగా చట్టాలను అమలు పరిచి శాంతి భద్రతలను పరిరక్షిస్తామని ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక నుంచి ఆర్థిక నేరాలు జరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన సబ్సిడరీ క్యాంటీన్‌లో వస్తువులను పెంచడంతోపాటు సిబ్బందికి వెల్ఫేర్ లోను, వారి పిల్లలకు విద్యా రుణాలు, గృహరుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే సకాలంలో రుణాలు మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 225 ఏటీఎం సెంటర్లలో ఇప్పటివరకు 130 ఏటీఎం సెంటర్‌లలో సెక్యూరిటీ గార్డులు ఉన్నారని, మిగిలిన వాటిలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు సూచించామన్నారు. ఎన్నికలకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం కావాలని వివరించినట్లు ఎస్పీ సత్యనారాయణ వివరించారు.
Advertisement