Sp satyanarayana
-
అదుపులో శాంతిభద్రతలు
ఏటీఅగ్రహారం(గుంటూరు),న్యూస్‌లైన్ :శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని రూరల్‌ఎస్పీ జె.సత్యనారాయణ మంగళవారం తెలిపారు. 2012తో పోల్చుకుంటే 2013లో అన్ని రకాల నేరాలు అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం నుంచి నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా మంగళవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, వృద్ధులు సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. సమర్ధవంతంగా విధులు నిర్వహించే సిబ్బందిని అభినందించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు వేయడంలో వెనుకాడేది లేదని తెలిపారు. 2013లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,006 కేసులు నమోదయ్యాయన్నారు. బాధితులకు భరోసా కార్యక్రమం ద్వారా ఫ్యాక్షనిజం, నక్సలిజం, ప్రాణాం తక వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందజేశామన్నారు. నేటి నుంచి....నూతన సంవత్సరం నుంచి ప్రజా సంబంధాలను పెంపొందించడంతోపాటు పటిష్టంగా చట్టాలను అమలు పరిచి శాంతి భద్రతలను పరిరక్షిస్తామని ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక నుంచి ఆర్థిక నేరాలు జరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన సబ్సిడరీ క్యాంటీన్లో వస్తువులను పెంచడంతోపాటు సిబ్బందికి వెల్ఫేర్ లోను, వారి పిల్లలకు విద్యా రుణాలు, గృహరుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే సకాలంలో రుణాలు మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 225 ఏటీఎం సెంటర్లలో ఇప్పటివరకు 130 ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డులు ఉన్నారని, మిగిలిన వాటిలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు సూచించామన్నారు. ఎన్నికలకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం కావాలని వివరించినట్లు ఎస్పీ సత్యనారాయణ వివరించారు. -
తవ్వకాల కలకలం
సాక్షి, గుంటూరు: పల్నాడులో పురాతన దేవాలయాల వద్ద గుప్త నిధుల తవ్వకాల విషయం కలకలం రేపుతుంది. దీనిలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు పోలీసు అధికారులపై ఆ శాఖలో తీవ్ర చర్చ జరుగుతుంది.‘గుప్త నిధుల వేట’ శీర్షికన ఈ నెల నాలుగవ తేదీన ‘సాక్షి’ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. గుంటూరుతో పాటు శ్రీశైలం నుంచి వచ్చిన ముఠాలు రాత్రిళ్లు పూజలు చేస్తూ తవ్వకాలు చేస్తున్నారనే విషయాన్ని రూరల్ జిల్లా ఎస్పీ జె. సత్యనారాయణ సీరియస్‌గా పరిగణించారు. ఇప్పటికే తవ్వకాలపై ఆరా తీయడంతో పాటు పోలీసు అధికారులపై వినిపిస్తున్న ఆరోపణల్లోని వాస్తవాల్ని నిగ్గుతేల్చాలని స్పెషల్‌బ్రాంచి సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ప్రధానంగా బెల్లంకొండ మండలంలో వేమవరం, కేతవరం, పడవలరేవు, కోళ్లూరు గ్రామాల్లో చాలాచోట్ల తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. పాతకాలపు శిలా శాసనాలు ఉన్న దేవాలయాల వద్ద గ్రామస్తులు బృందాలుగా ఏర్పడి వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గుప్తనిధులు తవ్వేసి పంచుకుందామని ప్రయత్నించిన ముగ్గురు ‘ఖాకీ’ లు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. తవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని పిడుగురాళ్ల సమీపాన వున్న ఓ క్వారీలో దాచిపెట్టి ఏమీ తెలియనట్లు మసలుతున్నారని తెలిసింది. గతంలో ఈ ముగ్గురు కలిసి అదే మండలంలో తవ్వకాలు జరిపిన ప్పుడు గుప్తనిధి బదులు మావోయిస్టులు దాచిన డంప్ దొరికిందని, తవ్వకాల కలకలం వాటిల్లో భారీగా డబ్బు కూడా ఉన్నట్లు సమాచారం. తవ్వ కాలకు ఖర్చు పెట్టిన గుంటూరున్యాయవాది సొమ్ముకు ఆ ముగ్గురు అధికారులు హామీనిచ్చినట్లు తెలిసింది. దొంగస్వాముల బురిడీ.. తాజాగా పోలీసులు చేపట్టిన విచారణలో పలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణానదీ తీర గ్రామా ల్లో గుప్త నిధులు వున్నాయని, వజ్రాలు దొరుకుతున్నాయని, విలువైన రంగురాళ్లు సేకరిస్తున్నామని కొందరు మోసగాళ్లు స్వామీజీల అవతార మెత్తుతున్నారు. వీరు ఓ బృందంగా ఏర్పడి ధనవంతులను వల లో వేసుకుంటున్నారు. శ్రీశైలం నుంచి ఇద్దరు వ్యక్తులతో పాటు దాచేపల్లిలో ఉండే ఓ వ్యక్తి స్వామిజీలుగా చెప్పుకుంటూ డబ్బు దండుకుంటున్నారు. వీరిలో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. బోధనం గ్రామానికి చెందిన ఓ మహిళకు వారం కిందట ఓ రంగురాయి దొరికింది. దాన్ని వజ్రంగా భ్రమించి, దాన్ని విక్రయించాలని భారీగా ఖర్చు పెట్టినట్లు తెలిసింది. చివరకు, అది రంగురాయి కూడా కాదని తేలడంతో మిన్నుకున్నట్లు సమాచారం.