సాక్షి, గుంటూరు: పల్నాడులో పురాతన దేవాలయాల వద్ద గుప్త నిధుల తవ్వకాల విషయం కలకలం రేపుతుంది. దీనిలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు పోలీసు అధికారులపై ఆ శాఖలో తీవ్ర చర్చ జరుగుతుంది.‘గుప్త నిధుల వేట’ శీర్షికన ఈ నెల నాలుగవ తేదీన ‘సాక్షి’ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. గుంటూరుతో పాటు శ్రీశైలం నుంచి వచ్చిన ముఠాలు రాత్రిళ్లు పూజలు చేస్తూ తవ్వకాలు చేస్తున్నారనే విషయాన్ని రూరల్ జిల్లా ఎస్పీ జె. సత్యనారాయణ సీరియస్‌గా పరిగణించారు. ఇప్పటికే తవ్వకాలపై ఆరా తీయడంతో పాటు పోలీసు అధికారులపై వినిపిస్తున్న ఆరోపణల్లోని వాస్తవాల్ని నిగ్గుతేల్చాలని స్పెషల్‌బ్రాంచి సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
ప్రధానంగా బెల్లంకొండ మండలంలో వేమవరం, కేతవరం, పడవలరేవు, కోళ్లూరు గ్రామాల్లో చాలాచోట్ల తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. పాతకాలపు శిలా శాసనాలు ఉన్న దేవాలయాల వద్ద గ్రామస్తులు బృందాలుగా ఏర్పడి వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గుప్తనిధులు తవ్వేసి పంచుకుందామని ప్రయత్నించిన ముగ్గురు ‘ఖాకీ’ లు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. తవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని పిడుగురాళ్ల సమీపాన వున్న ఓ క్వారీలో దాచిపెట్టి ఏమీ తెలియనట్లు మసలుతున్నారని తెలిసింది. గతంలో ఈ ముగ్గురు కలిసి అదే మండలంలో తవ్వకాలు జరిపిన ప్పుడు గుప్తనిధి బదులు మావోయిస్టులు దాచిన డంప్ దొరికిందని, తవ్వకాల కలకలం వాటిల్లో భారీగా డబ్బు కూడా ఉన్నట్లు సమాచారం.
తవ్వ కాలకు ఖర్చు పెట్టిన గుంటూరున్యాయవాది సొమ్ముకు ఆ ముగ్గురు అధికారులు హామీనిచ్చినట్లు తెలిసింది.
దొంగస్వాముల బురిడీ.. తాజాగా పోలీసులు చేపట్టిన విచారణలో పలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణానదీ తీర గ్రామా ల్లో గుప్త నిధులు వున్నాయని, వజ్రాలు దొరుకుతున్నాయని, విలువైన రంగురాళ్లు సేకరిస్తున్నామని కొందరు మోసగాళ్లు స్వామీజీల అవతార మెత్తుతున్నారు. వీరు ఓ బృందంగా ఏర్పడి ధనవంతులను వల లో వేసుకుంటున్నారు. శ్రీశైలం నుంచి ఇద్దరు వ్యక్తులతో పాటు దాచేపల్లిలో ఉండే ఓ వ్యక్తి స్వామిజీలుగా చెప్పుకుంటూ డబ్బు దండుకుంటున్నారు. వీరిలో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. బోధనం గ్రామానికి చెందిన ఓ మహిళకు వారం కిందట ఓ రంగురాయి దొరికింది. దాన్ని వజ్రంగా భ్రమించి, దాన్ని విక్రయించాలని భారీగా ఖర్చు పెట్టినట్లు తెలిసింది. చివరకు, అది రంగురాయి కూడా కాదని తేలడంతో మిన్నుకున్నట్లు సమాచారం.
తవ్వకాల కలకలం
Published Tue, Dec 10 2013 12:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement