పోలీస్ రక్షణ ఉంటేనే.. ఇసుక మాఫియాను అడ్డుకోండి
ఒంగోలు కలెక్టరేట్ : ‘కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నార్నూర్ గ్రామంలో రెవెన్యూ ఉద్యోగులను ఇసుక మాఫియా టార్గెట్ చేసింది. విధి నిర్వహణలో ఉన్నవారిపై వాహనాన్ని నడిపించింది. ఈ సంఘటనలో ముగ్గురు వీఆర్‌ఏలు, ఒక ఆర్‌ఐ మరణించారు. అక్కడి తహసీల్దార్‌తో పాటు అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. రెవెన్యూ శాఖ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. ఈ సంఘటనతో రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అందువల్ల పోలీస్ ప్రొటెక్షన్ ఉంటేనే ఇసుక మాఫియాను అడ్డుకోవాలి’ అని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన.. స్థానిక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇసుక మాఫియాను అడ్డుకోవాలని గతంలో అనేకమార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బొప్పరాజు విమర్శించారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీస్, మండల పరిషత్ అధికారులతో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ రెండు శాఖలు దూరంగా ఉంటున్నాయని తెలిపారు. ఇసుక మాఫియాను అడ్డుకునే సమయంలో మాఫియాకు సంబంధించిన ఎవరైనా అధికారులు, సిబ్బందిపై కేసులు పెడితే పోలీసులు అత్యుత్సాహంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడుల సమయంలో ముందుగానే పోలీసులకు ఫోన్‌చేస్తే సిబ్బంది లేరంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తిని కలిసి నార్నూర్ గ్రామ ఘటనను వివరించామన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వమే ఇసుక వేలం వేస్తే బాగుంటుందని, ఒకవైపు మాఫియాకు అడ్డుకట్ట వేయడంతోపాటు మరోవైపు ఆదాయం కూడా వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇసుకను తరలించడం ద్వారా నదులు, నదీ ప్రవాహాలు దెబ్బతింటాయని ప్రభుత్వం వేలం వేయడం లేదని, మాఫియా కారణంగా దాన్నేమైనా కాపాడగలుగుతున్నారా అని బొప్పరాజు ప్రశ్నించారు.
ఇదేనా మీ సంస్కృతి..?
తెలంగాణకు చెందిన గ్రూప్-1 ఆఫీసర్స్ నాయకుడు ఆంధ్రాకు చెందిన అధికారులంతా అక్కడ నుంచి వెళ్లాలంటూ పదేపదే ఇబ్బందులకు గురిచేస్తున్నారని బొప్పరాజు విమర్శించారు. స్టేట్ లెవల్ ఆఫీసర్లంతా కమలనాథ్ కమిటీ సిఫార్సులు తీసుకోవాలన్న విషయాన్ని కూడా ఆయన గుర్తించకపోవడం దారుణమన్నారు. అక్కడ పనిచేసే ఆంధ్రా ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇదేనా మీ సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు. సహజీవనానికి నిదర్శనం కక్ష సాధింపు చర్యలా అని అక్కడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు, రాష్ట్ర నాయకుడు శెట్టి గోపి, కలెక్టరేట్ యూనిట్ కార్యదర్శి ఊతకోలు శ్రీనివాసరావు, నాయకుడు ఎస్‌వీ సుధాకరరావు, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోయ కోటేశ్వరరావు, డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.