మాఫియాకు దేశం దన్ను
ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వాటి నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించనున్నట్టు టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు...మరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చేస్తున్న నిర్వాకం తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే...వారి అక్రమ సంపాదన చూసి అవాక్కవ్వాల్సిందే...రూ.కోట్లకు పడగలెత్తుతున్న కోటరీలను చూస్తే ఖంగుతినాల్సిందే... ఎమ్మెల్యేలనే బెదిరించే స్థాయికి ఇసుక మాఫియా ఎదిగిందంటే ఆశ్చర్యపోవాల్సిందే..!
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక మాఫియా భరతం పడతానంటూ చేస్తున్న హెచ్చరికలను జిల్లాలోని ఆ పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మాఫియాకు వెన్నుదన్నుగా నిలుస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సామాన్యులు ఇసుక కొనలేని పరిస్థితిని కల్పిస్తూ అక్రమార్కుల కొమ్ముకాస్తున్నారు.
* మామూలుగా రీచ్‌లోకి వెళ్లిన లారీకి రూ. 2,700 తీసుకుని బిల్లు ఇవ్వాల్సి ఉండగా, మొదటి గేటులో ఈ తంతు ముగించి, ఇసుక లోడ్ చేస్తున్న సమయంలో మరో రూ.5 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్క వైకుంఠపురం రీచ్‌లోనే రోజుకు సుమారు మూడు వందల లారీలకు ఇసుక లోడ్ చేస్తున్నారు.
* ఇలారోజుకు రూ.15 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారంటే మాఫియా దందా స్థాయి ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు.
* గతంలో లారీ ఇసుక మార్కెట్‌లో రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకూ ధర ఉండేది. మాఫియా అక్రమ వసూళ్ల కారణంగా రెట్టింపు ధర పలుకుతోంది. ప్రస్తుతం లారీ ఇసుకను రూ.12 వేల వద్ద విక్రయిస్తున్నారు. ఇది పేద,మధ్య తరగతి ప్రజలకు భారంగా మారి ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు.
* ఈ తంతును మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా, వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు రూరల్ ఎస్పీ పీహెచ్‌డి రామకృష్ణ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సైతం అధికార పార్టీ నేతలకు భజన చేస్తున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.
* ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యహరించారనే కారణంతో కొల్లిపర సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను వి.ఆర్‌కు పంపి పోలీసు ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.
* అమరావతిలో భారీ స్థాయిలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది.
టీడీపీ ఎమ్మెల్యేకి ఇసుక రీచ్‌లో వాటాలు
* అక్రమ వసూళ్లకు పాల్పడే ఇసుక రీచ్‌ల్లో జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు వాటాలు కూడా ఉన్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి.
* ఆయన వాటా కింద నెలకు ఒక్కో రీచ్ నుంచి రూ.10 లక్షలు పంపుతున్నట్లు సమాచారం. అధికారులు ఈ రీచ్‌ల జోలికి రాకుండా ఆ ఎమ్మెల్యే కాపు కాస్తున్నారని అంటున్నారు.
* ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో డప్పాలు కొడుతుంటే, ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే మాఫీయాతో చేతులు కలపడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నేతలను బెదిరించే స్థాయికి మాఫియా..
* రూ. కోట్లలో ఆదాయం వస్తుండటంతో ఇసుక మాఫియా ఎవ్వరినీ లెక్కచేయకుండా వ్యవహరిస్తోంది. రూరల్ ఎస్పీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ వసూళ్లను కొనసాగిస్తూ ఆ శాఖకే సవాలు విసురుతోంది.
* ఇసుక అక్రమ తవ్వకాలపై పోరాటానికి దిగిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి మాఫియా నుంచి బెదిరింపు లేఖ రావడాన్ని చూస్తుంటే వారి అరాచకాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు.
* టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తుంటే, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వారిపై పోరాటాలు చేస్తుండడాన్ని ప్రజలు గమనిస్తునే ఉన్నారు.
కలెక్టర్, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు
అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూలు చేస్తున్నారంటూ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, మైనింగ్ ఏడీ జగన్నాథరావుకు ఫిర్యాదులు చేశారు. లారీకి రూ. 2, 700 వసూలు చేస్తూనే అదనంగా మరో రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని వాపోయారు. స్పందించిన కలెక్టర్ దీనిపై బుధవారం జేసీ వివేక్ యాదవ్‌తో సమావేశం నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు.