ఆర్‌ఎంసీ కాలువ వద్ద 12ఎల్ కాలువ పరిధిలో రైతుల నిరసన
మక్కువ(సాలూరు):రబీ పంటలకు సాగునీరు విషయంలో రైతుల మధ్య జలజగడం మొదలైంది. ఈ సీజన్‌లో ఆరుతడి పంటలకు సాగునీరందిస్తామని ఇరిగేషన్ అధికారులు, నీటిసంఘాల నాయకులు ప్రకటించడంతో రైతులు ఆరుతడి పంటలకు బదులుగా వరి అధికంగా సాగుచేశారు. వెంగళరాయసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఆర్‌ఎంసీ కాలువ పరిధిలోని 12ఎల్, 13ఎల్, 14ఎల్, 15ఎల్ కాలువలకు పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడంలేదు. అయినప్పటికీ వారాబందీ ప్రకారం రైతులు మూడురోజుల వంతున కాలువ పరిధిలో ఉన్న పంటపొలాలకు నీటిని సరఫరా చేసుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ దానిని ఓ వర్గం ఉల్లంఘించడంతో వివాదం మొదలైంది.
కోసేసిన కాలువ షట్టర్
వారాబందీ ఒప్పందాన్ని ఉల్లంఘించి కొందరు కాలువ షట్టర్ కోసేసి ఓ వైపు మాత్రమే సాగునీరు తీసుకువెళ్లేందుకు కొందరు రైతులు ప్రయత్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. షట్టర్ కోసేయడం వల్ల తమకు నీరందడం లేదని మండలంలోని పాపయ్యవలస, కొయ్యానపేట గ్రామానికి చెందిన సుమారు 100మంది రైతులు ఆర్‌ఎంసీ కాలువ వద్ద మంగళవారం నిరసన తెలియజేశారు. అనంతరం ఇరిగేషన్ ఏఈ జగదీష్‌కు ఫోన్‌చేసి కాలువ వద్దకు రప్పించారు. కాలువ షట్టరు విరగ్గొట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదుచేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం నుంచి 12ఎల్ కాలువకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఏఈ జగదీష్ సాగునీరు సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటానని, తలుపు విరగ్గొట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హామీ ఇచ్చారు.
అమలుకాని వారాబందీ
వెంగళరాయసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఆర్‌ఎంసీ(కుడిప్రధానకాలువ) చప్పబుచ్చమ్మపేట గ్రామం వద్ద నున్న 12ఎల్ కాలువ నుంచి మండలంలోని చప్పబుచ్చమ్మపేట, మేళాపువలస, ములక్కాయవలస, కాశీపట్నం, పాపయ్యవలస, కొయ్యానపేట గ్రామాలకు చెందిన సుమారు 2వేల ఎకరాల వరిపంటను ఈ ఏడాది రబీసీజన్‌లో సాగుచేస్తున్నారు. అలాగే 13ఎల్, 14ఎల్, 15ఎల్ కాలువ పరిదిలో ఏ.వెంకంపేట, కన్నంపేట, కొండరేజేరు గ్రామాలకు చెందిన సుమారు 1500 ఎకరాల్లో వరిపంటను సాగుచేస్తున్నారు. ఆర్‌ఎంసీ కాలువ నుంచి సాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడంతో వారం రోజుల క్రితం ఏ.వెంకంపేట గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు ఆధ్వర్యంలో మూడురోజులు 12ఎల్ కాలువకు, మరో మూడురోజులు 13, 14, 15ఎల్ కాలువలకు సాగునీరు సరఫరా చేసుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల అయిదురోజులుపాటు 12ఎల్ కాలువకు నీరు అందించినప్పటికి, మరలా 12ఎల్ కాలువ పరిధిలోని రైతులు 13ఎల్ కాలువకు నీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని 13, 14, 15ఎల్ కాలువలకు చెందిన రైతులు తలుపును కోసేసినట్లు చెబుతున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదుచేసిన రైతులు
మండలంలోని పాపయ్యవలస గ్రామానికి చెందిన రైతులతోపాటు, వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదుచేశారు. 12ఎల్ కాలువకు సాగునీరు అందించకుండా ఉండేందుకే ఆర్‌ఎంసీ కాలువ పరిధిలో షట్టర్ తలుపును కోసేశారనీ, దీనివల్ల 2వేల ఎకరాలకు సాగునీరు అందడంలేదని, తలుపు విరగ్గొట్టిన వ్యక్తులను గుర్తించి, వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment