వీళ్లు కరువును జయించారు! | A permanent solution to the water misery | Sakshi
Sakshi News home page

వీళ్లు కరువును జయించారు!

Published Thu, Apr 23 2015 12:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

A permanent solution to the water misery

చేను కిందే చెరువుంది..
 
ఎకరానికి రూ. వెయ్యి ఖర్చుతో కాంటూరు కందకాల ద్వారా సాగునీటి భద్రత
నీటి వెతల నుంచి విముక్తి పొందిన ఇద్దరు నల్లగొండ రైతులు
శాశ్వత సాగునీటి భద్రతకు ఇదే సులువైన మార్గం అంటున్న
తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక
నీటి కష్టాలకు శాశ్వత, సత్వర పరిష్కారం.. రైతు చేతిలోనే..

 
అసలే మెట్ట పొలాలు.. అందులోనూ కరువు కాలం! ఎండాకాలంలో పంటలను, పండ్ల తోటలను ఎలాగైనా బతికించుకోవాలన్న తపనతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్న రోజులివి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో సాగునీరు, తాగునీటి కొరత తీవ్రరూపం దాల్చింది.

ఇటువంటి గడ్డుకాలంలో, నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు మాత్రం స్వల్ప ఖర్చుతోనే  శాశ్వతంగా సాగు నీటి భద్రతను సాధించారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక(తె.వి.ఇం.వే.) నేతలు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ రైతులు సాగు నీటి సమస్యను అధిగమించారు. కందకాల ద్వారా వాన నీటి సంరక్షణపై ‘మన చేను-మన చెరువు’ పేరిట ఈ వేదిక ప్రచారోద్యమం నిర్వహిస్తూ.. మెట్ట రైతులకు వెలుగుబాట చూపుతుండడం ప్రశంసనీయం.
 
రూ.25 వేలతో  పండ్ల తోటకు జలసిరి!
పరకాల జోగేశ్వరరావు సింగరేణి కాలరీస్‌లో అదనపు జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పదేళ్ల క్రితం ఉద్యాన పంటల సాగు చేపట్టారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లిలో 36 ఎకరాల భూమి కొని.. బత్తాయి(18 ఎకరాలు), మామిడి(9 ఎకరాలు), సీతాఫలం, ఉసిరి తదితర తోటలు సాగు చేస్తున్నారు. 15 బోర్లు వేయగా.. 5 బోర్లలో నీరు పడింది. తోట మొత్తానికీ డ్రిప్ ద్వారా నీరందిస్తున్నారు.

బోరు ఎండిపోయి..
చెట్ల వయసు పెరిగే కొద్దీ నీటి అవసరం పెరిగింది. ఒక బోరు పూర్తిగా ఎండిపోయింది. గత మూడేళ్లుగా వేసవిలో పక్కన రైతులను పంటలు వేయొద్దని బతిమాలి.. వారి బోర్ల నుంచి, ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేశానని జోగేశ్వరరావు తెలిపారు. తోటల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న అటువంటి సంక్లిష్ట దశలో తె.వి.ఇం.వే. నేతలు కందకాలు తవ్వుకోమని ఆయనకు సూచించారు. 2014 జనవరిలో తోటలో వాలుకు అడ్డంగా.. 50 మీటర్లకు ఒక కందకం చొప్పున.. 25 వరకు కందకాలు తవ్వించారు. మొత్తం రూ. 25 వేల వరకు ఖర్చయింది. తవ్విన నెల రోజుల్లోనే మంచి వానలు కురవడంతో.. రెండు దఫాలుగా కందకాలు నిండాయి. పొలంలో పడిన ప్రతి చుక్కా బయటకుపోకుండా తొలిసారి భూమిలోకి ఇంకింది.

కందకాలతో మళ్లీ జలకళ
దీంతో, భూగర్భ జలమట్టం పెరిగి.. ఎండిపోయిన బోరుకు మళ్లీ నీటి కళ వచ్చింది. ఇతర బోర్లలో నీటి పరిమాణం పెరిగింది. దీంతో 2014 ఎండాకాలంలోనూ నీరు కొనాల్సిన అవసరం రాలేదని జోగేశ్వరరావు వివరించారు. ఆ తర్వాత వర్షాకాలం ముగిసే వరకూ ఒక్క పెద్ద వానా కురవలేదు. ఒక్కసారీ కందకాలు నిండలేదు. ఈ(2015) ఎండాకాలం ఎలా గడుస్తుందోనన్న ఆందోళన తలెత్తిన నేపథ్యంలో.. అదృష్టవశాత్తూ ఏప్రిల్ రెండో వారంలో కందకాలు నిండేంత పెద్ద (2 సాలేటి)వాన కురిసింది. కందకాలు తవ్వి ఉన్నందున ప్రతి చుక్కా పొలంలోనే ఇంకి.. నీటి కొరత తీరింది.
 
ఎండిపోయిన బావికి పునర్జలం!
నార్కెట్‌పల్లి మండలం తొండ్లవాయికి చెందిన కంచర్ల మధుసూదన్‌రెడ్డి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా రిటైరైన తర్వాత తన 33 ఎకరాల పొలంలో సేద్యం చేస్తున్నారు. బత్తాయి, వరి, మామిడి తదితర పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో 60 అడుగుల (10 కోలలు) వ్యవసాయ బావి పూర్తిగా ఎండిపోయింది. దశల వారీగా 30 బోర్లు వేయగా.. 3 బోర్లు మాత్రమే నీటిని అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఖరీఫ్, రబీల్లో 8 ఎకరాల వరకు వరి సాగు చేసేవారు. నీరు అందుబాటులో లేక.. వరి సాగు కొన్నేళ్ల క్రితం మానుకున్నారు. విశ్రాంత ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ చంద్రమౌళి స్వస్థలం కూడా తొండ్లవాయి కావడం వల్ల మధుసూదన్‌రెడ్డి పొలంలో మూడేళ్ల క్రితం బావి, బోర్ల వద్ద కేవలం నాలుగు కందకాలు తవ్వించడంతో... నీటి కరువు తీరిపోయింది.
 
కందకాల పుణ్యమా అని మళ్లీ వరి సాగు..
కందకాలు తవ్వించిన తర్వాత నుంచి వర్షాకాలంలో బావిలో 45 అడుగుల లోతున నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడూ పది అడుగుల లోతున నీళ్లున్నాయి. 7.5 హెచ్‌పీ మోటారు బావి నీటిని తోడి పంటలకందిస్తోంది. ఈ కరవు కాలపు వేసవిలోనూ 3 బోర్లు అంతరాయం లేకుండా ఇంచున్నర నీరు పోస్తున్నాయి. కందకాల పుణ్యమా మళ్లీ వరి సేద్యం చేస్తున్నారు. ఇప్పుడు రబీ వరి కోతకు సిద్ధంగా ఉంది. పొలంలో కందకాలుంటే చేను కింద నీటి చెరువు ఉన్నట్లే. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవాలి.
 - కంచర్ల మధుసూదన్‌రెడ్డి (99495 22288),తొండ్లవాయి, నార్కెట్‌పల్లి మండలం, నల్లగొండ జిల్లా
 
కందకాలు తవ్వేది ఇలా..
పొలంలో వాలుకు అడ్డంగా మీటరు లోతు, ముప్పావు మీటరు వెడల్పున కందకాలు తవ్వుకోవాలి. ప్రతి 50 మీటర్లకో చోట కందకం తవ్వితే చాలు. కందకం పొడవు 25 మీటర్ల వరకు ఉండొచ్చు. ఎకరానికి కేవలం రూ. వెయ్యి- రూ. వెయ్యిన్నర ఖర్చుతోనే కందకాల ద్వారా.. చేను కింద భూగర్భంలోనే చెరువును నిర్మించుకోవచ్చు. శాశ్వతంగా సాగు నీటి భద్రత కందకాలతోనే సాధ్యపడుతుంది. భూమి కోతను పూర్తిగా అరికట్టడం కూడా కందకాలతోనే సాధ్యం. మెట్ట భూముల్లో రెండు ఆరుతడి పంటలు దిగుల్లేకుండా సాగు చేసుకోవచ్చు.
 
ఎకరంలో 22 లక్షల లీటర్ల నీటిని ఒడిసిపట్టొచ్చు
మా పొలంలో 8 ఏళ్ల క్రితమే కందకాలు తవ్వించాను. 5 బోర్లను వాడటం ఆపేసి.. పాత బావి నీటి ద్వారానే 12 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నా.  నల్లగొండ జిల్లాలో ఏడాదికి సగటు వర్షపాతం 750 ఎం.ఎం. ఈ సంవత్సరం కరువు వల్ల 400 ఎం.ఎం. మాత్రమే వర్షం పడింది. అయినా, కందకాలు తవ్వుకున్న రైతులకు ఇప్పుడు నీటికి కొరత లేదు. నల్లగొండ జిల్లాలో లక్ష ఎకరాల్లో సాధారణంగా 1.5 టీఎంసీల వాన నీరు భూమిలోకి ఇంకుతుండగా.. ఈ లక్ష ఎకరాల్లో కందకాలు తవ్వితే 8 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకుతుంది.

ఎకరం పొలంలో సాధారణంగా 5 లక్షల లీటర్ల నీరు భూమిలోకి ఇంకుతున్నది. కందకాలు తవ్వితే 22 లక్షల లీటర్ల వాన నీరు భూమిలోకి ఇంకుతుంది. మనచేను అడుగునే పెద్ద చెరువున్నట్లు లెక్క. ఇందులో కనీసం 80 శాతం నీటిని మనకు అవసరమైనప్పుడు తిరిగి బోర్లు, బావుల ద్వారా వాడుకోవచ్చు. అందుకే ‘మనచేను మన చెరువు’ ఉద్యమం చేపట్టాం.
 - సంగెం చంద్రమౌళి (98495 66009),  నీటిపారుదల విశ్రాంత చీఫ్ ఇంజినీర్, అధ్యక్షులు, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం
 
ఇక మాకు నీటి దిగుల్లేదు!
ఇక ఈ ఎండాకాలంలో మాకు దిగుల్లేదు. ఇటీవలి వర్షంతో భరోసా వచ్చింది. పక్క పొలాల్లో బోర్ల నుంచి నీటిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కందకాలు తవ్విన తర్వాత వరుసగా రెండో వేసవి కూడా నీటి సమస్య లేకుండా గడుస్తున్నది. ఇదంతా తె. వి. ఇం. వే. నేతలు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి దగ్గరుండి మా పొలంలో తవ్వించిన కందకాల పుణ్యమే. గత ఏడాది బత్తాయి తోటపై రూ. 9 లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు వేసవి పంటగా 20 టన్నుల  బత్తాయిలు, మామిడి కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. కాలువ నీటి సదుపాయం లేని ప్రతి రైతూ పొలంలో కందకాలు తవ్వుకుంటే.. సాగు నీటికి కొరతన్న మాటే ఉండదు.
 - పరకాల జోగేశ్వరరావు(98663 49019),పండ్ల తోటల సాగుదారు, సుంకెనపల్లి, చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా  
 
ఫ్లోరోసిస్‌కు పరిష్కారం కందకాలే..!
ప్రతి రైతు పొలంలోనూ కందకాలు తవ్వడం ద్వారా సాగునీరు, తాగునీటి కరువుతోపాటు ఫ్లోరోసిస్‌ను 100% రూపుమాపడానికి అవకాశం ఉంది. ఫ్లోరోసిస్‌కు తాగునీరు 10%, సాగు నీరు 90% మేరకు కారణభూతమవుతున్నాయి. కందకాల వల్ల నీటి కొరతతోపాటు నీటి నాణ్యత బాగా పెరుగుతుంది. కరెంటు వాడకం తగ్గుతుంది. అతి తక్కువ వర్షం కురిసే దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో ప్రతి రైతూ కందకాలు తవ్వుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

మన చేను కిందే భూగర్భంలో నీటిని దాచుకొని, కావాలనుకున్పప్పుడు వాడుకోవచ్చు. అందువల్లే మన చేను- మన చెరువు అని నినాదంతో ప్రచారోద్యమం నిర్వహిస్తున్నాం. నీటి ప్రాజెక్టుల ద్వారా ఎకరానికి నీరు పారించడానికి రూ. లక్షకు పైగా ఖర్చవుతుంది. కందకాలు తవ్వడానికి ఎకరానికి రూ. వెయ్యి చాలు. వాటర్‌షెడ్ పథకంలో కందకాలను చేర్చాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లా రైతులు కోరినా సాంకేతిక సహకారం అందించడానికి మేం సిద్ధమే.
 - మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), విశ్రాంత ఈఈ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement