
చింతలపూడి మండలం కాంతంపాలెం వద్ద సర్వే పనులను అడ్డుకుంటున్న రైతులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
చింతలపూడి: పరిహారం, భూ సేకరణ విషయంలో జిల్లాలోని చింతలపూడి పథకం వివాదస్పదమవుతోంది. ఈ పథకం పూర్వాపరాలు ఇలా.. 2003లో పాదయాత్ర సమయంలో మెట్ట ప్రాంత రైతుల సాగునీటి కష్టాలను ప్రత్యక్షంగా తిలకించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.1701 కోట్ల అంచనా వ్యయంతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. అంతేకాకుండా 2008 అక్టోబరు 30వ తేదీన కామవరపుకోటలో స్వయంగా ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు అందించడం ఈ పథకం ఉద్దేశం. జలయజ్ఞంలో 75వ ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనున్న ఈ ఎత్తిపోతల పథకం వల్ల 2 లక్షల మూడు వందల అరవై ఆరు ఎకరాలకు సాగునీరు అందనున్నది.
గుడ్డిగూడెం ఎత్తిపోతల ప్రతిపాదన
ఇదిలా ఉండగా ప్రభుత్వం తాజాగా రూపొందిస్తోన్న గుడ్డిగూడెం ఎత్తిపోతల పథకాన్ని మరింత విస్తరించి చింతలపూడి ఎత్తిపోతల కోసం తవ్వుతున్న కాల్వకు అనుసంధానం చేయడం ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో 2.80 లక్షల ఎకరాలకు సాగు నీరు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
దీంతో రెండు జిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ కాల్వను విస్తరించడం ద్వార చింతలపూడి మేజర్ కాల్వ నుంచి వేంపాడు మేజర్ కాల్వకు గోదావరి నీటిని మళ్లించడానికి పథకం రూపొందించారు. మొదటి దశ పనులు 25 శాతం కూడా పూర్తి కాలేదు. అయినా సరే ప్రభుత్వం చింతలపూడి పథకాన్ని విస్తరించి కృష్ణా జిల్లాకు లబ్ధి చేకూరే విధంగా రెండో దశకు రూ.3,200 కోట్లు కేటాయించారు. దీంతో ప్రాజెక్టు వ్యయం 4,909 కోట్లకు చేరుకుంది. తొలి దశలో 2 వేల క్యూసెక్కులు ప్రవహించేలా కాల్వ తవ్వకం పనులు చేపట్టారు. ఇప్పుడు 6,875 క్యూసెక్కులు ప్రవహించేలా భూసేకరణ చేస్తున్నారు. గతంలో 24 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల లోతు చొప్పున కాల్వను తవ్వారు. రెండోదశ చేర్చడంతో కాల్వ ఎత్తును మరో 3 మీటర్లు పెంచనున్నారు.
ఎక్కడికక్కడ వ్యతిరేకత
ఈ క్రమంలో అధికారులు చేపట్టిన సర్వే పనులను ఎక్కడికక్కడ రైతులు అడ్డుకుంటున్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం విషయం తేల్చకుండా అడ్డగోలుగా భూములను సేకరించేందుకు బలవంతంగా సర్వే పనులు మొదలు పెట్టారు. ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో రూ.20 లక్షల విలువ చేసే భూములకు పన్నెండున్నర లక్షలు చెల్లించి లాక్కోవాలని ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోంది. రైతులకు సమాచారం ఇవ్వకుండా ప్రజా ప్రయోజనాల పేరుతో అడ్డగోలు భూ సేకరణకు తెరలేపింది. దీంతో ప్రభుత్వ తీరుపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్త మవుతోంది. పట్టిసీమ తరహాలో ఎకరానికి రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలని రెండున్నర ఏళ్ల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 8న చింతలపూడి మండలం కాంతంపాలెం వద్ద పోలీసు బందోబస్తుతో సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను రైతులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు 10 మంది రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి సర్వే పనులు కొనసాగిస్తున్నారు.
ఒకే ప్యాకేజీ అమలు చేయాలి
చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ ఒకే ప్యాకేజీ అందించాలి. జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ప్యాకేజీ అమలు చేయడం రైతులను మోసగించడమే అవుతుంది. పరిహారం విషయం తేల్చకుండా బలవంతంగా సర్వే పనులు చేస్తున్నారు.
-అలవాల ఖాదర్‌బాబురెడ్డి, చింతలపూడి భూ నిర్వాసితుల కమిటీ, చింతలపూడి
బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారు
ప్రభుత్వం బలవంతంగా మా భూములను లాక్కోవాలని చూస్తోంది. రైతులకు జరుగుతోన్న అన్యాయంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. మొదటి దశ పూర్తి చేయకుండా రెండో దశకు సర్వే చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన చింతలపూడి మొదటి దశను తొలుత పూర్తి చేసి జిల్లాలోని మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించాలి.
పిడపర్తి ముత్తారెడ్డి, రైతు, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
నష్ట పరిహారం విషయం తేల్చండి
చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ఎంత ఇస్తారో ప్రభుత్వం ముందుగా తేల్చాలి. పట్టిసీమ తరహాలో ఎకరానికి రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలి. అప్పటి వరకు ఎత్తిపోతల కాలువ తవ్వకం పనులు జరగనివ్వం. –కె.రాఘవేంద్రరెడ్డి, చింతలపూడి రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment