రగిలిన పోడు వివాదం
Published Sat, Aug 17 2013 6:10 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
పోడుసాగు దారులకు, అటవీశాఖ అధికారులకు మధ్య నెలకొన్న వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దుగినేపల్లి పంచాయతీ టీ. కొత్తగూడెం, భీమవరం గ్రామాల మధ్య ఉన్న అటవీభూములను కొంతకాలంగా టి. కొత్తగూడెం గ్రామానికి చెందిన వారు సాగు చేస్తున్నారు. ఈ విషయంపై కొంత కాలంగా పోడుదారులకు, అటవీశాఖ అధికారులకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ సంవత్సరం పోడు సాగు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ గురువారం రాత్రి ట్రాక్టర్ ద్వారా భూములు దున్నుతుండగా సమాచారం అందుకున్న ఏడూళ్లబయ్యారం ఫారెస్ట్ రేంజర్ ఈ. లక్ష్మణ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. వారిని ఆపేందుకు యత్నించగా ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన టి.కొత్తగూడెం గ్రామానికి చెందిన కొంతమంది రేంజర్ లక్ష్మణ్‌పై దాడికి దిగారు. అదే విధంగా ఫారెస్ట్ శాఖకు చెందిన వాహనం టైర్ల గాలి తీసి సిబ్బంది వద్ద ఉన్న 3 సెల్ ఫోన్లు, రూ.5 వేలు నగదు లాక్కున్నారు. దీంతో అక్కడి నుండి తప్పించుకున్న ఫారెస్ట్ అధికారులు ఏడూళ్ళబయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అరెస్ట్‌లు, కేసులు నమోదు..
అటవీశాఖ అధికారి, సిబ్బందిపై దాడికి దిగినందుకు టి. కొత్తగూడేనికి చెందిన ఏడుగురిని శుక్రవారం ఏడూళ్లబయ్యారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. దాడికి ప్రధాన కారణమైన దాట్ల గోపాలనర్సరాజు( వాసుబాబు), ఆర్. మలచ్చు, దినసరపు బలవరెడ్డి, తొండపు నరేష్‌రెడ్డి, ఎస్‌కె సర్వర్, దావీద్, ఎస్‌కె. రజాక్ పాషాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో పాటు దాడిలో పాల్గొన్న మరో ముగ్గురు దొడ్డా వెంకటేశ్వర్లు, కిరణ్, గాదె సమ్మిరెడ్డిలు పరారీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఘర్షణకు దిగిన మరో 100 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను మణుగూరు కోర్టులో రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement