
‘కోరమాండల్’ హాల్ట్ కొనసాగింపు
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు తాడేపల్లిగూడెంలో హాల్టును కొనసాగిస్తూ గురువారం ఉత్తర్వులు వచ్చాయి. ట్రయల్ రన్ ప్రాతిపదికన ఈ రైలుకు తొలుత ఆరు నెలలపాటు హాల్టు ఇస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆరు నెలల అనంతరం రైలు ఎక్కే, దిగే ప్రయాణీకులు, టికెట్లపై వచ్చే ఆదాయం తదితర కోణాలలో సమీక్షించుకొని రైలు హాల్టు కొనసాగించాలా? రద్దు చేయాలా? అనేది నిర్ణయిస్తామని హాల్టు కోసం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆశించిన మేర ఆదాయం రాకపోవడంతో గత నెల 28 నుంచి గూడెంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ హాల్టును ఎత్తేశారు. ఈ రైలు ప్రారంభమయ్యాక అదనపు హాల్టు ఒక్క తాడేపల్లిగూడెంకు మాత్రమే ఇవ్వటం విశేషం. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు చొరవే దీనికి కారణం. హాల్టు రద్దు కాకుండా చూసుకోవాలని అప్పట్లో బాపిరాజు ఇక్కడి ప్రయాణీకులకు, వ్యాపార సంఘాలకు చెప్పారు. ఈ రైలులో ప్రయాణించటానికి 500 కిలోమీటర్ల కనీస పరిమితి ఉంది.
ఇక్కడ నుంచి అటు చెన్నైకి, ఇటు బరంపురం ఆపై స్టేషన్లకు మాత్రమే టికెట్ ఇస్తా రు. ఈ రైలు నడిచే మార్గంలో 500 కిలో మీటర్ల కనీసం దూరం మినహాయింపును ఒక్క రాజమండ్రి స్టేషన్ కే ఇచ్చారు. అక్కడి నుంచి ఈ రైలు హాల్టున్న ఏ స్టేషన్‌కైనా టికెట్ ఇస్తారు. అలాంటి మినహాయింపునే గూడెంకు ఇవ్వాలని ప్రయాణికులు, పలు స్వ చ్ఛంద సంఘాలు రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించాయి. వాటిని రై ల్వే శాఖ పరిగణనలోకి తీసుకోలేదు. ఆరు నెలలు కావటంతో కోరమాండల్ హాల్టును రద్దు చే స్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రయాణికులు నిరాశపడ్డారు. ఈ రైలు హాల్టును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గూడెం రైల్వే స్టేషన్లో హాల్టు ఇచ్చిన స్వర్ణజయంతి హాల్టును గురువారం నుంచి రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయి.
అన్ని రైళ్ల హాల్టుల గడవు పొడిగింపు
తాడేపల్లిగూడెం స్టేషన్లో హాల్టు ఇచ్చిన నాందేడ్- విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్(18509-18510)కు సెప్టెంబరు 30 వరకు, హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్ప్‌ప్రెస్ (12863-12864) హాల్టును ఆగస్టు 7 వరకు, అమరావతి ఎక్స్‌ప్రెస్ (18047-18048) హాల్టును ఆగస్టు 13 వరకు, గరీబ్ రథ్(12739-12740) హాల్టును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఈ రైళ్లకు గూడెంలో హాల్టు నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపైనే ఉంది. సంత్రాగచ్చి, కాకినాడ టౌన్-లోకమాన్యతిలక్ టెర్మినల్ ఎక్స్‌ప్రెస్‌లకు గూడెంలో హాల్టులను రెగ్యులరైజ్ చేశారు,